మర్రిపాలెం గూడేనికి దారేది
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:42 PM
రహదారులు అభివృద్ధికి చిహ్నాలు అంటారు. చంద్రమండలానికి సైతం దారులు వెతికే నేటి ఆధునిక యుగంలో తరతరాలుగా నివాసముంటున్న గ్రామానికి సరైన రహదారి లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డు నుంచి 7కిలోమీటర్ల ప్రయాణం
అభయారణ్యంలో క్రూర జంతువల దాడులు
వరద నీటికి కొట్టుకుపోయిన రాళ్లవాగుపై చప్టా
అవస్థలు పడుతున్న చెంచు గిరిజనులు
పెద్ద దోర్నాల,నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రహదారులు అభివృద్ధికి చిహ్నాలు అంటారు. చంద్రమండలానికి సైతం దారులు వెతికే నేటి ఆధునిక యుగంలో తరతరాలుగా నివాసముంటున్న గ్రామానికి సరైన రహదారి లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ ఉన్నా ఫలితం మాత్రం సున్నా. పైగా పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా అన్ని గూడేలకు మౌలికవసతులు సమకూర్చుతామని సంబంధిత అధికారులు రెండేళ్లుగా అవ గాహన సమావేశాలు వల్లెవేశారు. ఏపాటి వసతులు సమకూర్చారో మాకు తెలియదని పలువురు గిరిజనులు అంటున్నారు.
మర్రిపాలెం వెళ్లాలంటేనే జంకు
మండలంలోని మర్రిపాలెం గిరిజన చెంచు గూ డెం శ్రీశైలం-దోర్నాల ఘాట్ రోడ్డుకు 7 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పడింది. ఆ గ్రామంలో 124 కుటుంబాలు నివశిస్తున్నాయి. నేటికీ గ్రామానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి సక్రమంగా లేదు. ఆ గ్రామంలో ఆశ్రమ పాఠశాల ఉం ది. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లాలన్నా, పిల్లల కు నిత్యావసర సరుకులు తీసుకు వెళ్లాలన్నా ఇబ్బందికరంగామారింది. అభయారణ్యంలో ఏపుగా పెరిగిన చెట్లు, ముళ్ల పొదలు మధ్యగా అక్కడక్కడ కా లువలు పడిన దారిలో బిక్కు బిక్కు మంటూ ప్ర యాణించాల్సి వస్తోంది. అంతే కాదు పొదల మధ్య నుంచి ఎలుగుబంట్లు దాడిచేసి గాయపర్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఒకరిద్దరు ప్రయాణించలేక గుంపులుగా వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెప్తున్నారు. అదంతా రోజువారి సమస్య కాగా వర్షాలు కురిస్తే కలిగే ఇబ్బందులు చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వెళ్లాలంటే శ్రీశైలం రోడ్డు నుంచి కిలోమీటరు దూరంలో రాళ్లవాగుపై చిన్నపాటి చప్టా ఉంది. అయితే వర్షాకాలం వానలు ఎక్కువగా కురిస్తే వాగు ఉధృతి పెరిగి చప్టా మీదుగా వరద ప్రవహించడంతో పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఏడాది కురిసిన మొంథా తుఫాన్ దాటికి రాళ్లు బయట పడ్డాయి. వాహనాలు గ్రామానికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఇంటి సరుకులు, వ్యవసాయ సామగ్రి, ఉత్పత్తులుతరలించేందుకు కష్టతరంగామారిందని చెంచు గిరిజనులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధి తఅధికారులు స్పందించి రహదారి పఠిష్ట పరచాలని, రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మించాలని చెంచు గిరిజనులు కోరుతున్నారు.