మరోసారి మార్కింగ్
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:39 AM
ఒంగోలు నగర అభివృద్ధిలో కీలకమైన ట్రంక్‌రోడ్డు విస్తరణ పనులు ఊపందుకున్నాయి. బుధవారం మరోసారి మార్కింగ్ చేశారు. వాస్తవానికి 100 అడుగుల విస్తరణకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఒంగోలులో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం
దుకాణదారులకు చెల్లించాల్సిన నష్టపరిహారం అంచనా
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర అభివృద్ధిలో కీలకమైన ట్రంక్‌రోడ్డు విస్తరణ పనులు ఊపందుకున్నాయి. బుధవారం మరోసారి మార్కింగ్ చేశారు. వాస్తవానికి 100 అడుగుల విస్తరణకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వ్యాపారుల నుంచి అభ్యంతరాలు రావడంతో కొంతమేర కుదించారు. ఇటీవల కాలంలో కార్పొ రేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు సెంటర్ మార్కింగ్ చేసి, స్కెచ్‌ను సిద్ధం చేశారు. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరి హారం అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. నగరంలోని జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి వద్ద నుంచి మస్తాన్ దర్గా సెంటర్ వరకు రోడ్డును విస్తరించనున్నారు. ఇప్పటివరకు 62 అడుగుల నుంచి 49 అడుగులు మాత్రమే ఉండగా, ఇరువైపులా 40 అడుగులు విస్తరించనుండటంతో80 అడుగుల వరకు రోడ్డు వెడల్పు కానుంది. రెండు వారాల క్రితం వ్యాపారులకు నోటీసులు జారీచేసిన అధికారులు నాలుగు రోజుల క్రితం మార్కింగ్ చేశారు. తాజాగా మరోసారి మార్కింగ్ చేసిన అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేశారు. కాగా ట్రంక్‌రోడ్డు విస్తరణ పనులకు షాపుల యజమానులు, వ్యాపారులు నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనరు వెంకటేశ్వరరావు కోరారు.