Share News

ఎన్నో అనుమానాలు!

ABN , Publish Date - Jul 29 , 2025 | 01:29 AM

విద్యుత్‌ శాఖలో అధునాతన సాంకేతిక పద్ధతులలో భాగంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దశల వారీగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయడం చాలావరకు పూర్తిచేశారు.

ఎన్నో అనుమానాలు!

విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లపై గందరగోళం

దానికయ్యే ఖర్చు వేస్తారు!

ఆందోళన చెందుతున్న వినియోగదారులు

దశలవారీగా ఏర్పాటుకు సిద్ధమవుతున్న విద్యుత్‌ శాఖ

అదనపు భారం ఉండదు : ఎస్‌ఈ

ఒంగోలు క్రైం, జూలై 28 (ఆంధ్ర జ్యోతి): విద్యుత్‌ శాఖలో అధునాతన సాంకేతిక పద్ధతులలో భాగంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దశల వారీగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయడం చాలావరకు పూర్తిచేశారు. ఇళ్లకు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సమయంలో వినియోగదారులు ఆందోళన దిగడంతో ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. అయితే విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం 200 యూనిట్ల రీడింగ్‌ పైబడిన ఇళ్లకు మాత్రమే స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే వారు చెప్పేవి అబద్దాలంటూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. వినియోదారులపై అదనపు భారం పడుతున్న స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని కోరుతున్నాయి. ఈక్రమంలో ఇళ్లకు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటును అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

స్మార్టుమీటర్‌ వినియోగం

విద్యుత్‌ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. స్మార్ట్‌ మీటర్‌లో ఖచ్చితమైన రీడింగ్‌ రికార్డు చేయడంతో పాటుగా సిబ్బంది పర్యవేక్షించేందుకు బాగా ఉపయోగపడుతుంది. వినియోగదారునికి, సంస్థకు ఎంత విద్యుత్‌ వినియోగించాము అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అదేవిధంగా బిల్లింగ్‌ లోపాలు లేకుండా ఉండేందుకు దోహదపడుతుంది. వినియోగదారుడు నిత్యం వినియోగించే విద్యుత్‌ ఎంతో తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్మార్ట్‌మీటరు వలన విద్యుత్‌ను ఆదా చేసుకునే అవకాశం ఉంది. అదే క్రమంలో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటుతో వినియోగదారునిపై ఎలాంటి అదనపు భారం ఉండదని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌ మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు.

రీచార్జ్‌ పద్ధతిలో వినియోగం

విద్యుత్‌ స్మార్టుమీటర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాత రీచార్జ్‌ పద్ధతిన వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనిలో పోస్టుపెయిడ్‌, ప్రీపెయిడ్‌ సిస్టమ్‌ కూడా ఉంటుంది. దీంతో వినియోగదారులు నిత్యం వినియోగించే విద్యుత్‌ను అంచనా వేసుకొని పొదుపు చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఎంత వినియోగించుకుంటే అంతవరకు చెల్లింపులు చేసుకునేందుకు స్మార్ట్‌ మీటర్లు దోహదపడతాయి.

ప్రభుత్వ సంస్థలకు, వ్యాపార కూడళ్ళకు ఏర్పాటు

జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో 20,306 కనెక్షన్లు ఉండగా 17,680కి స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థలు 1,12,235 కనెక్షన్లు ఉండగా 92,020కి ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెచ్‌టీ కనెక్షన్లు 700కాగా 60 స్మార్టు మీటర్లు ఏర్పాటు చేశారు. ఇంటి కనెక్షను సుమారు 8 లక్షలు ఉండగా వీటిలో 200 యూనిట్లు పైబడి రీడింగ్‌ వచ్చే ఇళ్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖ నిర్ణయించింది. సుమారుగా 80వేల ఇళ్లకు మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే 200 యూనిట్లకు లోబడి రీడింగ్‌ వస్తున్న ఇళ్లకు ప్రస్తుతం స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయరు.

వినియోగదారులలో ఆందోళన

విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుతో వినియోగదారులపై అదనపు భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. నూతనంగా స్మార్ట్‌మీటరు సుమారుగా రూ.9వేల వరకు ఉంటుందని ఆ భారాన్ని వినియోగదారులు భరాయించాలని ప్రజా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం వినియోగదారులనుంచి స్మార్ట్‌మీటర్లకు సంబంధించి అదనపు వసూళ్లు ఉండవని అపోహపడవద్దని అంటున్నారు. అదే సమయంలో స్మార్ట్‌మీటరు ఏర్పాటు వలన వినియోగదారుడు రీచార్జ్‌ చేసుకున్న అంతవరకు వినియోగం చేసుకోవాలని, కార్డులో నగదు లేకుంటే ఇంట్లో విద్యుత్‌ నిలిచిపోతుందని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jul 29 , 2025 | 01:30 AM