Share News

మల్లేశ్వరస్వామి భూములు అన్యాక్రాంతం

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:56 PM

ఓవైపు నిమ్జ్‌, మరోవైపు రిలయన్స్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌లు వస్తున్న తరుణంలో పెదయిర్లపాడు ప్రాంతంలో భూ ఆక్రమణదారులు తెగబడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములనే కాకుండా దేవదాయ భూములను సైతం ఆక్రమించి ప్లాట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు.

మల్లేశ్వరస్వామి భూములు   అన్యాక్రాంతం
సర్వేనెంబరు 133లోని దేవదాయ భూమి

పదయిర్లపాడులో ప్లాట్లు వేసిన ఆక్రమణదారులు

నిమ్జ్‌, రిలయన్స్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ రాకతో ఖాళీ స్థలాలకు డిమాండ్‌

రెచ్చిపోతున్న అక్రమార్కులు

పీసీపల్లి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ఓవైపు నిమ్జ్‌, మరోవైపు రిలయన్స్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌లు వస్తున్న తరుణంలో పెదయిర్లపాడు ప్రాంతంలో భూ ఆక్రమణదారులు తెగబడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములనే కాకుండా దేవదాయ భూములను సైతం ఆక్రమించి ప్లాట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అడిగేవారు లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మండలంలోని పెదయిర్లపాడు గ్రామంలో శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. పొన్నలూరు మండలం చెరుకూరు, లింగసముద్రం మండలం మొగిలిచర్ల, వివిధ ప్రాంతాలలో 120 ఎకరాల భూములను పలువురు దాతలు మల్లేశ్వరస్వామి ఆలయానికి ఇచ్చారు. ఈ భూముల నుంచి వచ్చే కౌలుతో స్వామికి ధూపదీప నైవేద్యాలకు అయ్యే ఖర్చులకు వినియోగించేవారు.

ఈ ఆలయాన్ని 1970లో దేవదాయ, ధర్మాదాయ శాఖలో చేర్చారు. ఈక్రమంలో దాతలు ఇచ్చిన భూములతో పాటు అర్చకులకు చెందిన ఈనాం భూములను సైతం స్వామికి ఇచ్చారు. 1977లో వచ్చిన తుఫాన్‌కి మల్లేశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభం విరిగిపడింది. అప్పటినుంచి 2010వరకు ఆలయం మూతబడి ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదు. ఆలయ ప్రాంగణం మొత్తం పిచ్చిమొక్కలు పెరిగి మూసుకుపోయింది. ఈ ఆలయాన్ని 1515వ సంవత్సరంలో పలుకూరి వంశస్థులు నిర్మించారు. 2010వ సంవత్సరంలో పలుకూరి వంశీయులలో ఒకరైన సుబ్బారావు దాతల సహకారంతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ధూపదీప నైవేద్యాలను నిర్వహిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. అప్పటివరకు పలు ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన భూములను అధికారుల సహాయంతో తిరిగి దేవస్థానానికి చెందేటట్లు చేశారు.


ఆక్రమణలో ఉన్న భూముల సర్వే నంబర్లు

మల్లేశ్వరస్వామి ఆలయం ఉన్న పెదయిర్లపాడు గ్రామంలో సర్వేనెంబరు 133లో 15.35ఎకరాలు, సర్వేనెంబరు 840లో 3.58ఎకరాల భూములు ఆలయానికి చెందినవి ఉన్నాయి. ఈ భూములను కొంతమంది ఆక్రమంచారు. సర్వేనెంబరు 133 భూమిలో సుమారు 1.25 ఎకరాలను ఓ వ్యక్తి ఆక్రమించి ప్లాట్లు వేశారు. సర్వే నెంబరు 840లో ఉన్న భూమిని ఓవ్యక్తి ఆక్రమించి డెయిరీ ఫాం కోసం షెడ్‌ను నిర్మించాడు. సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దేవదాయ భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపించి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

దేవదాయ భూములను కాపాడతాం

పెదయిర్లపాడులో మల్లేశ్వరస్వామి ఆలయ భూముల ఆక్రమణ విషయంపై దేవదాయశాఖ ఈవో కొండారెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా సర్వేనెంబరు 133, 840లో కొంతభూమి ఆక్రమణకు గురైన విషయం వాస్తవమేనని చెప్పారు. తమకు తెలిసిన వెంటనే ఆక్రమణదారులను ప్రశ్నించగా సరైన సమాధానాలు రాలేదన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దేవదాయ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణదారులపై పోలీసులకు ఫిర్యాదుచేసి భూములను స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు.

Updated Date - Apr 15 , 2025 | 11:56 PM