మల్లన్న అంతేనా!
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:19 AM
పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతం ఏ జిల్లాలో ఉండాలనే అంశంలో రాయలసీమ.. ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయ పెత్తనానిదే పైచేయిగా మారింది. ఫలితంగా అత్యంత చేరువలో ఉన్న జిల్లాకేంద్రానికి దూరంగా శ్రీశైలం మిగిలిపోతోంది.
తెరపైకి వచ్చిన శ్రీశైలం అంశం!
కొనసాగుతున్న సీమ పెత్తనం
అప్పుడూ, ఇప్పుడూ అదే తంతు
నాడు ప్రకాశం జిల్లాకు దూరం
నేడు మార్కాపురంలోకి కష్టమే!
రాజకీయానికే ప్రభుత్వం ప్రాధాన్యం
పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతం ఏ జిల్లాలో ఉండాలనే అంశంలో రాయలసీమ.. ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయ పెత్తనానిదే పైచేయిగా మారింది. ఫలితంగా అత్యంత చేరువలో ఉన్న జిల్లాకేంద్రానికి దూరంగా శ్రీశైలం మిగిలిపోతోంది. 1956లో కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తర్వాత 1970లో ప్రకాశం జిల్లా ఆవిర్భావ సమయంలోనూ అక్కడి రాజకీయ నేతలు చక్రం తిప్పి కర్నూలు జిల్లాలోనే శ్రీశైలంను ఉంచారు. ప్రస్తుతం కొత్తగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడుతుండగా.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంతం అక్కడి ప్రజానీకానికి అనువైన జిల్లాలో ఉండాలా? లేదా? అన్న కీలక విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొత్తంగా ఆ వ్యవహారంపై సీమ రాజకీయ ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
శ్రీశైలం ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో ఉంది. కొత్తగా ఏర్పడుతున్న మార్కాపురం జిల్లాలోకి శ్రీశైలంను కలపాలా? వద్దా? అన్న అంశం సమ స్యాత్మకంగా మారింది. 1956లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలు కేంద్రంగా రాజధాని కొద్దికాలం కొనసాగింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా ఏర్పాటు సమయంలోనూ, ఇప్పుడు మార్కాపురం జిల్లా ఏర్పాటుకాబోతున్న సమయంలోనూ శ్రీశైలం ప్రాంతం ఏ జిల్లాలో కొనసాగాలి అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు నుంచి హైదరాబాద్ రాష్ట్ర రాజధా నిగా అప్పుడు మార్పు జరిగింది. శ్రీశైలంతోపాటు ప్రస్తుత మార్కాపురం డివిజన్ ప్రాంతమంతా అప్పట్లో కర్నూలు జిల్లాలోకి చేర్చారు. అంతకు ముందు కడప జిల్లాలో ఉన్న గిద్దలూరు, మార్కాపురం, దోర్నాల ప్రాంతాలు కూడా కర్నూలు జిల్లాలోకి రావడంతో శ్రీశైలం కూడా అందులో చేరింది.
అప్పుడు మొండిచెయ్యి!
1970లో ఒంగోలు కేంద్రంగా మూడు జిల్లాల్లోని ప్రాంతాలను కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు, ఇప్పుడు కూడా దోర్నాల నుంచి అటు హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లేందుకు అనుకూలమైన రవాణా మార్గాలు శ్రీశైలానికి ఉన్నాయి. అయితే ప్రకాశం జిల్లా ఏర్పడే సమ యంలో కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు, మార్కాపురం, దోర్నాల ప్రాంతాల మొత్తాన్ని చేర్చారు. దోర్నాల నుంచి రవాణా మార్గమున్న శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంతంను మాత్రమే కర్నూలు జిల్లాలో ఉంచారు. కర్నూలు జిల్లా నుంచి శ్రీశైలానికి ప్రకాశంలోని దోర్నాల నుంచే వెళ్లాలి. అది తప్పించి వేరే మార్గం లేదు. వెనుకబడిన దోర్నాల ప్రాంతాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చిన అప్పటి పాలకులు శ్రీశైలం ప్రాంతాన్ని మాత్రం కర్నూలు జిల్లాలో ఉంచారు. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రముఖుల సూచనలకు అనుగుణంగానే ఆ మార్పు చేశారు. శ్రీశైలం సమీపంలో ఉన్న శిఖరం ముందుభాగం వరకు ప్రకాశంలో కలిపారు. శ్రీశైలం దేవస్థానం ప్రాంతాన్ని కర్నూలు జిల్లాలో ఉంచారు. రాయలసీమలో కీలకమైన కర్నూలు జిల్లాలో పెత్తనం చేస్తున్న నేతల సూచనలకు అనుగుణంగానే వ్యవహారం సాగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మార్కాపురం డివిజన్ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. 1970 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిక, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నేపఽథ్యంలో కొత్త జిల్లాల అంశం తెరపైకి రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2022లో అప్పటి వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అప్పుడు మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మార్కాపురం డివిజన్‌ను ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలోనే కొనసాగించింది. అప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ కొనసాగింది.
నూతన జిల్లా ఏర్పాటుకు సిద్ధం
మార్కాపురం కేంద్రంగా జిల్లా కోసం ఉద్యమించిన వారు శ్రీశైలం అంశాన్ని పక్కన పెట్టి ఆందోళన చేశారు. జగన్ ప్రభుత్వం వారి ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాలను ప్రత్యేక జిల్లా చేశారు. తదనుగుణంగా శ్రీశైలంను నంద్యాల జిల్లాలోకి చేర్చారు. నాటి ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు ఆ నిర్ణయం సమంజసంగానే అనిపించడంతో స్వాగతించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటును జగన్ ప్రభుత్వం తోసిపుచ్చినా అటు శ్రీశైలం వాసులు కానీ, ఇటు మార్కాపురం వాసులు కానీ శ్రీశైలం కర్నూలులో ఉన్నా నంద్యాలలో ఉన్నా ఏంటి అని పట్టించుకోలేదు. దీంతో శ్రీశైలం ప్రాంతం అంశం పక్కనపెట్టి మార్కాపురం జిల్లా లక్ష్యంగా ప్రజలు తమ వాదనలు వినిపించారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త జిల్లా అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తమ పార్టీ అధికారంలోకి వస్తే మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజున మార్కాపురం ప్రాంతంలో పర్యటిస్తూ మార్కాపురం జిల్లా ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. తదనుగుణంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే నాటి హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం పలికింది. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. తదనుగుణంగా రేపోమాపో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం కూడా అయింది.
అనూహ్యంగా ప్రచారంలోకి శ్రీశైలం
ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రప్రభుత్వం ముందడుగు వేయడాన్ని మార్కాపురం ప్రాంత ప్రజానీకం పూర్తిగా స్వాగతించింది. తదనంతరం రాజకీయాలకతీతంగా సాధారణ ప్రజానీకం శ్రీశైలం ప్రాంతం అంశాన్ని తెరపైకి తెచ్చారు. నిజానికి ఏ రకంగా చూసినా శ్రీశైలం ప్రాంతం మార్కాపురం డివిజన్‌లో ఉండటమే ప్రజలకు ఉపయోగకరం. పూర్వం నుంచి ఈ ప్రాంతం నుంచే రాకపోకలు ఉండేవి. శ్రీశైలంలో నివాసం ఉండే వారిలో అధికం మార్కాపురం డివిజన్ వారే. అందుకు కారణం శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో కూలీలుగా ఈ ప్రాంతం వారే పనిచేశారు. తర్వాత ఉద్యోగాలు ఇవ్వడంతో అక్కడే స్థిరపడ్డారు. కానీ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను కానీ, వాస్తవానికి అనుగుణంగా ఉన్న పరిస్ధితులను కానీ పాలకులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. మార్కాపురం ప్రాంత ప్రజలు మొదటి ప్రాధాన్యతను జిల్లా ఏర్పాటుకే ఇస్తూ శ్రీశైలం అంశంపై ఆచితూచి అడుగు వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో అలాగే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ప్రసుత్తం శ్రీశైలం ఉన్న నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మొత్తం పార్టీలకతీతంగా శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవాలకు అనుగుణంగా ముందుకు సాగలేని పరిస్థితి ప్రభుత్వంలోని పెద్దలకు ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ అంశాన్ని పరిశీలించింది.
వారి ప్రభావమే అధికం
గత ఎన్నికల్లో నంద్యాల జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్ధానాలు, లోక్‌సభ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థులు గెలుపొం దారు. దీంతో రాష్ట్రప్రభుత్వంపై నంద్యాల జిల్లాలో గెలుపొందిన టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రభావం పనిచేస్తోంది. ఇటు మార్కాపురం జిల్లా ఏర్పాటును కోరుకునే వారు ప్రాంతాల కతీతంగా జిల్లా ఏర్పాటును సాధించాలనే లక్ష్యాన్నే ప్రథమ బాధ్యతగా పరిగణించగా, నంద్యాల జిల్లాలో ఉన్న నేతలంతా శ్రీశైలాన్ని ఆ జిల్లాలో ఉంచుకునేందుకు చూస్తున్నారు. దీంతో శ్రీశైలం విషయాన్ని తెరపైకి తెస్తే మార్కాపురం జిల్లా ఏర్పాటుకే సమస్య రావచ్చనే ఆలోచనతో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా శ్రీశైలం డిమాండ్ పక్కనపెట్టి మార్కా పురం జిల్లా ఏర్పాటుకు మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఫలితంగా శ్రీశైలం ప్రాంతం ఏ జిల్లాలో ఉండాలనే అంశంలో సీమ ప్రాంత రాజకీయనాయకుల పెత్తనానికే ప్రాధాన్యత లభించినట్లు కనిపిస్తోంది.