వైభవంగా మహాకుంభాభిషేకాలు
ABN , Publish Date - May 16 , 2025 | 12:03 AM
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న మహాకుంభాభిషేకంలో భాగంగా గురువారం జీవధ్వజస్తంభం, విమాన గోపుర కలశాలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.
శింగరకొండలో జీవధ్వజం, విమాన గోపుర కళశాలకు విశేష పూజలు
19న భారీ కార్యక్రమాలు
అద్దంకి, మే 15 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న మహాకుంభాభిషేకంలో భాగంగా గురువారం జీవధ్వజస్తంభం, విమాన గోపుర కలశాలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం కళశాలను యాగశాలలో ఉంచారు. పూజా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం కాగా రెండవరోజు గురువందనం, గణపతిపూజ, ప్రాతఃకాల మండపార్చనలు, సూర్యనమస్కారాలు, హహన్యాసపారాయణం, మూలవరులకు అభిషేకం, పంచగవ్యాధి వాసములు, ఆంజనేయ, రామ, సుదర్శన మంత్ర అనుష్టానం, వేదపారాయణం, సుందరకాండపారాయణం నిర్వహించారు. సాయంత్రం ఆవరణ దేవతాహవనం, ధాన్యాధివాసం, హవనాలు, బలిహరణ, దేవస్వస్థి, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీవధ్వజస్తంభం, విమానగోపుర కలశాలకు అభిషేకం, పూజలను ఈవో తిమ్మానాయుడు, రిషిత దంపతులు నిర్వహించారు. విమాన గోపుర దాత నలమలపు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులు, జీవ ధ్వజస్తంభం దాతలు మేదరమెట్ల రాజశేఖరరెడ్డి, చంద్రశేఖరరెడ్డిల దంపతులు ఆధ్వర్యంలో అభిషేకం, పూజలు చేశారు. దేవస్థానం మాజీ చైర్మన్ కోట శ్రీనివాసకుమార్, నాగలక్ష్మి దంపతులు, దేవస్థానం ముఖమండపం నిర్మాణ దాతలు గుంజి కృష్ణారావు, రమాదేవి దంపతులు, కాట్రగడ్డ అనిల్‌కుమార్, శ్రీవిద్య దంపతులు, సందిరెడ్డి శ్రీనివాసరావు, చుండూరి మురళీసుధాకర్ తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గురువారం రాత్రి ప్రదర్శించిన భక్తప్రహ్లాద, కూచిపూడి నృత్య ప్రదర్శన, గోదా కల్యాణం ప్రత్యేక నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి.
కలశయాత్ర ఏర్పాట్లపై దృష్టి
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం మహాకుంభాభిషేకం సందర్భంగా 19న ఉదయం 5 గంటలకు అద్దంకి పట్టణం సమీపంలో పాత దర్శి రోడ్డులో గుండ్లకమ్మ నది నుంచి సుమారు 1500 మంది మహిళలతో కలశయాత్ర ప్రారంభమవుతుందని ఈవో తిమ్మానాయుడు తెలిపారు. కలశ యాత్రలో పాల్గొనే మహిళలు సుమారు 6 కి.మీ దూరం నడవాల్సి ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఈవో తిమ్మానాయుడు పలు స్వచ్ఛంద సంస్థల మహిళా ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. మార్గమధ్యలో వాటర్‌బాటిల్స్, మజ్జిగప్యాకెట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లీడర్స్ అవసరమైన అన్ని ఏర్పాట్లు చూడాలన్నారు. రమాసుందరీ, వూటుకూరు ఉమా అన్నపూర్ణ పాల్గొన్నారు.