మహా చండీ శరణు..శరణు
ABN , Publish Date - Sep 28 , 2025 | 10:52 PM
జ్యోతి): అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, శక్తి స్వరూపిణికి దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలో 7వ రోజు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
మార్కాపురం వన్‌టౌన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, శక్తి స్వరూపిణికి దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలో 7వ రోజు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు వేదవల్లి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు. మా ర్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబ కాత్యాయని అలంకారంలో దర్శనం ఇచ్చారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత గాయత్రిదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొంతల పుల్లారావు, కార్యదర్శి వక్కలగడ్డ సురేశ్ కుమార్, కోశాధికారి చక్కా మాలకొండ చిన్న నరసింహారావు కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద పంపిణీ నిర్వహించారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జవహర్ నగర్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సంతానలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు.
పొదిలి : కంభాలపాడు పంచాయతీలో వెలసిన అంకాలపరమేశ్వరీదేవి మాహాచండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
గిద్దలూరు : దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉభయదాతలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి 108 రకాల ప్రసాదాలను సమర్పించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు వాడకట్టు రంగసతనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ, కమిటీ ప్రతినిధులు ఆయా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. షరా్‌ఫబజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారు పరశురామ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
పెద్దదోర్నాల : అమ్మవారు శ్రీ శారదా పరమేశ్వరీ దేవి అలంకారంలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి, శ్రీపోలేరమ్మ, సాయిబాబా, తిమ్మపురంలోని శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయాల్లో నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి (పట్టుచీర) సారెను అందజేశారు.
త్రిపురాంతకం : శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి బాలా త్రిపురసుందరీదేవి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప లువురు కళాకారులు ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. సంప్రదాయ నృత్య రూపకాలు, కోలాటాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం కాత్యాయనిదేవిగా అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
కంభం : శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు పార్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కోటా సత్యమాంబ త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా దేవాలయాల ప్రాంగాణాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
ఎర్రగొండపాలెం : శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పట్టు వస్త్రాలను సమర్పించి, పూజలు చేశారు. ఆయనతోపాటు ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు ఉన్నారు.
కొమరోలు : శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మోహినీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటరమణ ఆధ్వర్యంలో అమ్మవారికి తోట ఉత్సవాన్ని నిర్వహించారు. మహిళలు కోలాట నృత్యంతో చేరుకున్నారు.