టీడీపీలో ‘మహా’ సందడి
ABN , Publish Date - May 19 , 2025 | 01:42 AM
తెలుగుదేశం పార్టీలో మహానాడు సందడి మొదలైంది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏటా రాష్ట్రస్థాయిలో మహానాడును ఆపార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి నియోజకవర్గ, జిల్లాస్థాయిలో మినీ మహానాడులు ఏర్పాటు చేస్తోంది.
నేటి నుంచి 22 వరకూ నియోజకవర్గస్థాయి మినీ మహానాడులు
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల నేతృత్వంలో సభలు, ర్యాలీలు
23న ఒంగోలులో పార్లమెంట్‌స్థాయి కార్యక్రమం
ఈలోపు పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు
27నుంచి 29 వరకు కడపలో మహానాడు
భారీగా తరలివెళ్లనున్న తెలుగు తమ్ముళ్లు
తెలుగుదేశం పార్టీలో మహానాడు సందడి మొదలైంది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏటా రాష్ట్రస్థాయిలో మహానాడును ఆపార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి నియోజకవర్గ, జిల్లాస్థాయిలో మినీ మహానాడులు ఏర్పాటు చేస్తోంది. ఆ సందర్భంగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం జరుగుతుంది. ఈక్రమంలో ఈనెల 27నుంచి 29 వరకూ మూడు రోజులపాటు పార్టీ మహానాడు కడపలో జరగనుంది. తొలిసారి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలోపు నియోజకవర్గ, పార్లమెంట్‌స్థాయి మహానాడుల పూర్తికి అధిష్ఠానం ఆదేశించింది. ఈనెల 14న జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది.
ఒంగోలు, మే 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 22లో పు మినీ, 23నుంచి 25లోపు పార్లమెంట్‌స్థాయి మహానాడులు పూర్తిచేయాలని టీడీపీ అధి ష్ఠానం ఆదేశించింది. ఆలోపు డివిజన్, పట్టణ, మండల పార్టీ కమిటీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. వరుసగా మూడు సార్లు లేదా ఆరేళ్లపాటు పార్టీ మండల, పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన వారిని మార్చి ఆస్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ సూచించింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో పనిచేసి నేటికీ క్రియాశీలకంగా ఉన్న వారికి ఆపైస్థాయి కమిటీల్లో స్థానం కల్పించాలని స్పష్టం చేసింది. టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయాస్థాయిలో పార్టీ బాధ్యతల కోసం అనేక మంది పోటీ పడుతున్నారు.
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గస్థాయి మహానాడుల నిర్వహణకు అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొండపి, కనిగిరి, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల మినీ మహానాడులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం జరగనున్నాయి. గిద్దలూరు నియోజకవర్గ మహానాడు ఈనెల 20న గిద్దలూరులో నిర్వహించనున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ మినీ మహానాడు 22వతేదీన ఒంగోలు నగర పరిఽధిలోని త్రోవగుంటరోడ్డులో ఉన్న విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఒంగోలు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు సంబంధించి సోమవారం స్పష్టత రానుంది. ఒంగోలు పార్లమెంట్‌స్థాయి మినీమహానాడు ఈనెల 23వతేదీన ఒంగోలులో జరగనుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యవేక్షణలో దానిని నిర్వహించనున్నారు.
ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు
మినీ మహానాడుల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించి తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి పంపాలని అధిష్ఠానం అదేశించింది. ఇదిలా ఉండగా కడపలో ఈనెల 27నుంచి 29 వరకు జరగనున్న టీడీపీ మహానాడుకు జిల్లా నుంచి పార్టీశ్రేణులు భారీగా తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు నాయకులు కడప నగరంలో బసకు సంబంధించి సొంత ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద నవ్యాంధ్రలో రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారిగా మహానాడులు జరగనుండగా టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.