ఉపాధి హామీతో మ్యాజిక్ డ్రైన్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:21 AM
గ్రామాల్లో తక్కువ ఖర్చుతో మురుగు కాలువల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ఉపక్రమించింది. డ్వామా ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం నిధులతో వీటిని చేపడుతోంది. నందిగామ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తొలుత చేపట్టగా విజయవంతమైంది.
తక్కువ ఖర్చుతో గ్రామాల్లో కాలువలు
మురుగు పారుదల కన్నా భూమిలో ఇంకేలా నిర్మాణం
జిల్లాలో ఆరు గ్రామాలు ఎంపిక
శివపురంలో శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ స్వామి
ఒంగోలు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తక్కువ ఖర్చుతో మురుగు కాలువల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ఉపక్రమించింది. డ్వామా ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం నిధులతో వీటిని చేపడుతోంది. నందిగామ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తొలుత చేపట్టగా విజయవంతమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 2 నాటికి వంద గ్రామాల్లో నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా జిల్లాలో ఆరు గ్రామాలను ఎంపిక చేసింది. అందులో ఒకటైన టంగుటూరు మండలం శివపురంలో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణా నికి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి సోమ వారం శంకుస్థాపన చేశారు. వెలిగండ్ల మండలం చోడవరంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి భూమిపూజ చేశారు. కొత్తపట్నం మండలం పాదర్తి బీసీ కాలనీ, రాచర్ల మండలం గౌతవరం, ముండ్లమూరు మండలం రమణారెడ్డి ఆవాసం, మార్కాపురం మండలం పెద్దనాగులవరంలలో కూడా చేపడుతున్నారు. సాధారణంగా మురుగు కాలువలను సిమెంట్, కాంక్రీటుతో నిర్మిస్తారు. ఇళ్లలో నుంచి అలాగే వర్షాల సమయంలో ఆ కాలువల నుంచి నీరు పారి దిగువకు పోతుంది. ఇప్పటి వరకూ నిర్మిస్తున్న కాలువల్లో మట్టి, ఇతర వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. వీటి నిర్మాణానికి భారీ వ్యయం అవుతుంది. ఇంజనీరింగ్ అంచనా ప్రకారం ఆ తరహా కాలువల నిర్మాణాలకు కిలోమీటరుకు రూ.60లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక టెక్నాలజీతో నిర్మించతలపెట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి కిలోమీటరుకు రూ.9లక్షలు మాత్రమే వ్యయమవుతుందని సమాచారం. అంతేకాక ఇళ్లలో నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా కాలువలో చివరి వరకు పారుదల కాకుండా ఎక్కడికక్కడ భూమిలో ఇంకేలా నిర్మించనున్నారు. ఈ కాలువలను అడుగున్నర వెడల్పు, రెండు అడుగుల లోతు తవ్వుతారు. అడుగున స్థానికంగా దొరికే కంకర తరహా రాళ్లను ఉపయోగిస్తారు. పైన మందంగా ఉండే కంకరు, ఆపైన చిన్న సైజు కంకరను వేస్తారు.
దుర్వాసన ఉండదు..
గ్రామాల్లో నిర్మించిన సిమెంట్ రోడ్ల పక్కన సమాంతరంగా తవ్వి ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు ఆ కాలువల్లోకి చేరేలా ఏర్పాటు చేస్తారు. కాలువ పొడవునా ప్రతి 50 మీటర్లకు ఒకచోట ఇంకుడు గుంతలు తవ్వుతారు. కాలువలకు ఇరువైపులా మట్టి విరిగి లోపల పడిపోకుండా పరుపు రాళ్లతో గోడ తరహాలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో మురుగు కాలువల్లోకి వచ్చేనీరు నేరుగా కాలువలో ముందుకు ప్రవాహ రూపంలో వెళ్లకుండా ఎక్కడికక్కడ కంకరలో నుంచి భూమిలోకి దిగుతుంది. అధిక ప్రవాహం వచ్చినప్పుడు కొంత దూరం ప్రవహించి అక్కడక్కడా తవ్విన ఇంకుడు గంటల్లోకి చేరి భూమిలోకి ఇంకుతుంది. దీని వల్ల కాలువల్లో నీరు, మురుగు పేరుకపోయి దుర్వాసన రాకుండా, దోమలు చేరకుండా ఆరిపోతుందని చెప్తున్నారు.
అన్ని గ్రామాల్లోనూ ఇదే తరహా..
నందిగామ మండలంలో విజయవంతమైన తర్వాత గతనెల 23న పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరైన సందర్భంగా ఈ తరహాలో అక్కడ తవ్విన కాలువలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం వచ్చేనెల 2లోపు రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో ఈ తరహా డ్రైన్లు తవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లు చేపట్టాలని భావిస్తోంది. కాగా ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో చిన్న గ్రామాలుగా ఉన్న ఆరింటిలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ తెలిపారు. నిర్ధిష్ట కాల వ్యవధిలో వీటిని పూర్తిచేస్తామన్నారు.