లోగ్రేడ్.. నోబిడ్!
ABN , Publish Date - Jun 04 , 2025 | 02:25 AM
పొగాకు వ్యాపారుల తీరులో ఏమాత్రం మార్పులేదు. వేలానికి వస్తున్న అన్నిరకాల బేళ్లను కొనుగోలు చేయాలని, నోబిడ్‌లు లేకుండా చూడాలని మంత్రులు ప్రత్యేక సమావేశం పెట్టి మరీ చెప్పినా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు.
సగటున 28శాతానికిపైగా పొగాకు బేళ్ల తిరస్కరణ
కొన్నిచోట్ల 35శాతంపైనే
కనిష్ఠ ధరలు తగ్గించినా స్పందన నిల్
మీడియం గ్రేడ్‌లకూ తగ్గింపు
మేలురకం కోసం కంపెనీల పోటీ
అయినా గరిష్ఠ ధరపై నియంత్రణ
ఆందోళన వ్యక్తంచేస్తున్న రైతులు
టంగుటూరులో రోడ్డెక్కి నిరసన
ఒంగోలు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : పొగాకు వ్యాపారుల తీరులో ఏమాత్రం మార్పులేదు. వేలానికి వస్తున్న అన్నిరకాల బేళ్లను కొనుగోలు చేయాలని, నోబిడ్‌లు లేకుండా చూడాలని మంత్రులు ప్రత్యేక సమావేశం పెట్టి మరీ చెప్పినా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. నోబిడ్‌లు మరింత పెరుగుతున్నాయి. ప్రత్యే కించి లోగ్రేడ్ తిరస్కరణల సంఖ్య అధికంగా ఉంటోంది. కనిష్ఠ ధరలు తగ్గించి మరీ కొనుగోలు జరిగేలా బోర్డు అధికారులు ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. మంగళవారం ఇప్పటివరకూ ఉన్న కిలో రూ.200 కనిష్ఠ ధరను రూ.190కి తగ్గించినా నోబిడ్‌లు భారీగానే ఉన్నాయి. మంగళవారం నాటి మార్కెట్‌ను పరిశీలిస్తే మేలు రకం బేళ్లను పోటీపడి కొనుగోలు చేస్తున్న బయ్యర్లు ధరలు మాత్రం కిలో రూ.280 వద్ద నియంత్రించి ఇక పెరగకుండా కూటమి కట్టారు. మీడియం గ్రేడ్‌ల ధరలను తగ్గించివేశారు.
మూడొంతులు తిరస్కరణే
నెలక్రితం వరకు కిలోకు రూ.250 ఇచ్చిన మీడియం గ్రేడ్‌లను ప్రస్తుతం కిలో రూ.200 నుంచి రూ.220లోపు మాత్రమే వ్యాపారులు కొంటున్నారు. వాటిలోనూ పలు బేళ్లు నోబిడ్ అవుతున్నాయి. ఇక లోగ్రేడ్ బేళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రకం బేళ్లలో మూడొంతులు తిరస్కరణ జరుగుతున్నాయి. లోగ్రేడ్‌లో కాస్తంత నాణ్యమైనవిగా భావించే బ్రౌన్ రకం పొగాకు ధర గత ఏడాదిలో రూ.300పైగా పలుకగా ఈ ఏడాది రూ.200 కూడా లభించడం లేదు. అసలు కొనేవారు లేక నోబిడ్‌లు అవుతున్నాయి. కీలకమైన ఎక్స్‌పోర్టు కంపెనీలు కొనుగోళ్లను భారీగా తగ్గించి వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
పొదిలి కేంద్రంలో అధికం
మంగళవారం నాటి మార్కెట్‌ను చూస్తే దక్షిణాదిలోని 11వేలం కేంద్రాలలో దాదాపు 21.50శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. రెండు రీజియన్లలోని 11 వేలం కేంద్రాల్లో 7,611 బేళ్లు అమ్మకానికి రాగా 5,446 బేళ్లు మాత్రమే కొనుగోలు జరిగింది. దాదాపు 28శాతానికిపైగా తిరస్కరణలు జరగ్గా అందులో 21.50శాతం బోర్డు అధికారులు ప్రకటించిన ధరలను వ్యాపారులు ఇవ్వక నోబిడ్‌లు పెట్టారు. కాగా నోబిడ్ బేళ్లు కొన్ని కేంద్రాలలో ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. పొదిలిలో 34.31శాతం నోబిడ్‌లు ఉండగా కనిగిరిలో 34.75, వెల్లంపల్లిలో 33.76శాతం, ఒంగోలు-1లో 26.55శాతం ఉన్నాయి. వ్యాపారుల తీరుపై టంగుటూరు కేంద్రంలో రైతులు వేలం ఆపి నిరసన తెలిపారు. సీపీఐ (ఎంఎల్) నాయకులు డీవీఎన్ స్వామి, పరిటాల కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు సింగయ్య సంఘీభావం తెలిపారు. కొంతసేపు అనంతరం తిరిగి వేలం నిర్వహించారు.