Share News

గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గింపుపై లారీ యజమానులు హర్షం

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:21 PM

: ప్రజాప్రభుత్వం లారీ యాజమానులకు తీపికబురు చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన గ్రీన్‌ ట్యాక్స్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లారీ యాజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌రెడ్డి పాలనలో లారీలపై గ్రీన్‌ ట్యాక్స్‌ భారీగా పెంచారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.400 ఉన్న గ్రీన్‌ ట్యాక్స్‌కు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమాంతం రూ. 20వేలకు పెంచారు.

గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గింపుపై   లారీ యజమానులు హర్షం
చంద్రబాబు, పవన్‌ చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

సింగరాయకొండలో చంద్రబాబు, పవన్‌ చిత్రపటాలకు పాలభిషేకం

మంత్రి స్వామిని కలిసి కృతజ్ఞతలు

సింగరాయకొండ, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రభుత్వం లారీ యాజమానులకు తీపికబురు చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన గ్రీన్‌ ట్యాక్స్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లారీ యాజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌రెడ్డి పాలనలో లారీలపై గ్రీన్‌ ట్యాక్స్‌ భారీగా పెంచారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.400 ఉన్న గ్రీన్‌ ట్యాక్స్‌కు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమాంతం రూ. 20వేలకు పెంచారు. జగన్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన గత ఐదేళ్లు రవాణా రంగం పూర్తిగా కుదేలైంది. గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత ప్రభుత్వం పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో ఏడాదికి రూ.20వేల వరకు ఉన్న పన్ను ఇప్పుడు రూ. 1500 నుంచి రూ. 3వేలకు తగ్గించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సింగరాయకొండ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలోని లారీ యూనియన్‌ కార్యాలయంలో ఆదివారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. అనంతరం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామిని కలిసి ఘనంగా సత్కరించారు. గ్రీన్స్‌ ట్యాక్స్‌ తగ్గించి లారీ ఓనర్స్‌కు ఆర్థికభారం తగ్గించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వాహనాల ఫిట్‌నెన్స్‌ పరీక్షలు ఇప్పటి వరకు ఒంగోలు, మార్కాపురం ఆర్టీవో కార్యాలయాల్లో జరిగేవని, ప్రస్తుతం ప్రైవేటుపరం చేస్తూ ఏటీఎస్‌ విధానం ద్వారా ఫిట్‌నెన్స్‌లు చేసుకోవాల్సి వస్తోందని మంత్రి స్వామి దృష్టికి లారీ యజమానులు తీసుకెళ్లారు. పాత పద్ధతిలోనే కొనసాగించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన స్వామి వెంటనే రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. లారీ ఓనర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిగురుపాటి శేషగిరిరావు, పామర్తి మాధవరావు, పటేల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:23 PM