కట్టను కొల్లగొట్టి..!
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:36 AM
గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎడమ కాలువ కట్టను ఉప్పుగుండూరుకు చెందిన వైసీపీ నాయకుడు కొల్లగొడుతున్నాడు. అర్ధరాత్రి వేళ యంత్రాలను ఉపయోగించి ఇష్టారీతిన తరలిస్తున్నాడు. తన స్థలంలో మెరకకు దాన్ని వినియోగిస్తుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు.
గుండ్లకమ్మ ఎడమ కాలువ కట్ట గ్రావెల్‌ను తరలించుకుపోతున్న వైసీపీ నాయకుడు
పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో రైతులు
నాగులుప్పలపాడు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎడమ కాలువ కట్టను ఉప్పుగుండూరుకు చెందిన వైసీపీ నాయకుడు కొల్లగొడుతున్నాడు. అర్ధరాత్రి వేళ యంత్రాలను ఉపయోగించి ఇష్టారీతిన తరలిస్తున్నాడు. తన స్థలంలో మెరకకు దాన్ని వినియోగిస్తుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. అతని దెబ్బకు కట్ట కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో, నీటి ఉధృతి పెరిగిన సమయంలో కాలువలోని నీరు పొలాల్లోకి చేరి పంటలు దెబ్బతినే ప్రమాదముంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువ.. ప్రాజెక్టు వద్ద నుంచి మండల పరిధిలోని కండ్లగుంట మీదుగా కొరిశపాడు మండలం రెడ్డిపాలెంతోపాటు అటువైపు గ్రామాల వరకు ఉంది. నాగులుప్పలపాడు-ఇంకొల్లు పాత మద్రాసు రహదారిలోని ఒమ్మెవరం బస్ షెల్టర్ వెనుక ఉన్న ఎడమ కాలువ కట్ట గ్రావెల్‌ను ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు తవ్వేస్తున్నాడు. దాన్ని 216 జాతీయ రహదారి పక్కన మాచవరం రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోలు బంక్ మెరక కోసం తరలిస్తున్నాడు. రాత్రిళ్లు ఎక్స్‌కవేటర్‌తో కట్టను తవ్వి ట్రాక్టర్లతో వందల ట్రిప్పులు తోలుతున్నాడు. ఆ స్థలం సదరు వైసీపీ నాయకుడిది కావడం గమనార్హం. దీంతో కట్ట కరిగిపోయి భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువను పర్యవేక్షించే లస్కర్ నాగార్జునరెడ్డి తొలుత గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్‌లతోపాటు, ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకొని ఆపై వదిలేయడం చూసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టల గ్రావెల్ తరలించుకుపో తున్న వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ కె.ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా గ్రావెల్ తరలింపు విషయం తన దృష్టికి రాలేదన్నారు.