Share News

లక్ష్యాల మేరకు రుణాలు అందించాలి

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:42 PM

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రజలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు.

లక్ష్యాల మేరకు రుణాలు అందించాలి
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు, పక్కన డీఆర్వో ఓబులేశు

బ్యాంకర్లకు కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రజలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలులో సోమవారం జిల్లా స్థాయిబ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. అందుకు బ్యాంకర్లు అర్హులైన లబ్ధిదారులందరికీ బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ.25,045కోట్లు కాగా ఇప్పటివరకు రూ.16,505 కోట్లు రుణాలు మంజూరు చేశారని చెప్పారు. మిగిలిన లక్ష్యాలను కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాడి గేదెల రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంఈజీపీ పథకం కింద పరిశ్రమల స్థాపనకు వచ్చిన 102 దరఖాస్తులపై బ్యాంక్‌లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్రికల్చర్‌ డిప్లోమో, ఇంజనీరింగ్‌ పట్టభధ్రులకు శిక్షణ ఇచ్చి అగ్రి బిజినెస్‌కు రుణాలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో చినఓబులేషు, వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, ఎల్‌డీఎం రమేష్‌, ఆర్‌బీఐ ఏజీఎం రోహిత్‌ అగర్వాల్‌, నాబార్డు ఏజీఎం రవికుమార్‌ తదితరులు ఉన్నారు.


ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. పాలేరు వాగు నుంచి జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. వాగులు, ఇతర వనరుల్లో లభ్యమయ్యే ఇసుకను కేవలం 500 మీటర్ల పరిధిలోని స్థానిక గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. పాలేరులో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజశేఖర్‌, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, డీటీసీ సుశీల, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నిబద్దతో విధులు నిర్వహించాలి

ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్‌ రాజాబాబు పేర్కొన్నారు. కారుణ్య నియామకం కింద 8 మందికి, ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద మరో ఇద్దరికి ఉద్యోగ నియామకపత్రాలను సోమవారం స్థానిక మీ కోసం హాలులో కలెక్టర్‌ రాజాబాబు అందజేశారు. ఈకార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో రవి పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:42 PM