Share News

లైన్‌ క్లియర్‌

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:38 AM

మొంథా తుఫాన్‌ కారణంగా వెలిగొండ ప్రాజెక్టు పనులకు ఏర్పడిన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. నిర్మాణ పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఒకటికి రెండుసార్లు వెంటవెంటనే పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

లైన్‌ క్లియర్‌
వరద నీరు తొలగింపుతో బయటపడిన టన్నెల్‌-2 ముఖద్వారం

వెలిగొండ టన్నెల్‌ పనులు మళ్లీ మొదలు

మొంథా తుఫాన్‌తో ముంచెత్తిన వరద నీరు తొలగింపు

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

రెండు రోజుల్లో లైనింగ్‌ పనుల పునఃప్రారంభానికి అధికారుల చర్యలు

ఫీడర్‌ కాలువ, తీగలేరు వాగుల్లో ఆటంకాల తొలగింపు పనులు

మంత్రి నిమ్మల వరుస పర్యటనలతో కొలిక్కి వస్తున్న ప్రాజెక్టు వ్యవహారం

మొంథా తుఫాన్‌ కారణంగా వెలిగొండ ప్రాజెక్టు పనులకు ఏర్పడిన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. నిర్మాణ పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఒకటికి రెండుసార్లు వెంటవెంటనే పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అటు అధికారులు, ఇటు కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కదలిక వచ్చింది. ఆటంకాల తొలగింపు ప్రక్రియ వేగంగా సాగింది. మరో రెండు రోజుల్లో కీలకమైన టన్నెల్‌-2లో లైనింగ్‌ పనుల పునఃప్రారంభానికి ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఒంగోలు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనుల పునఃప్రారంభానికి లైన్‌క్లియర్‌ అయ్యింది. టన్నెళ్లలో చేరిన వరద నీరు, మట్టి తొలగింపు పనులకు ఆటంకాలు తొలగాయి. మిగతా పనులు కూడా వేగవంతమయ్యాయి. గత నెలాఖరులో సంభవించిన మొంథా తుఫాన్‌ జిల్లాపై తీవ్రప్రభావం చూపిన విషయం విదితమే. కేవలం 36 గంటల్లోనే ఏకంగా 18.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నల్లమలలో కురిసిన భారీ వర్షాలకు తీగలేరు వాగు పొంగి ప్రవహించి వెలిగొండ ఫీడర్‌ కాలువను ముంచెత్తింది. దీంతో అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న కాలువ మరింత దెబ్బతినడంతోపాటు భారీగా వరద నీరు ఆ కాలువకు అనుసంధానంగా ఉన్న వెలిగొండ టన్నెళ్లలోకి చేరింది.

టన్నెళ్ల నిండా బురద, నీరు

వెలిగొండ ఒక్కొక్క టన్నెల్‌ పొడవు 18.80 కి.మీ కాగా వెలుపలి వైపు నుంచి దాదాపు 9 కి.మీ వరకు సగం ఎత్తులో వరదనీరు చేరడంతో టన్నెల్‌-2లో జరుగుతున్న పనులు ఆగిపోయాయి. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతోపాటు మిషనరీ మొత్తం వరద నీరు, బురదలో చిక్కుకొంది. ఇంచు మించు 0.40 టీఎంసీల నీరు అలా టన్నెల్‌లోకి వెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఆ ప్రాం తాన్ని ఈనెల 7న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. టన్నెళ్ల నుంచి నీటిని తక్షణం తొలగించి లైనింగ్‌ పనులు పునరుద్ధరణ, తీగలేరులో ఆక్రమణలు తొలగించి నీరు ప్రవాహం సాగేలా చర్యలు, ఫీడర్‌ కాలువలో మేటవేసిన మట్టి తొలగింపును యుద్ధప్రాతిపదికన చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అదేరోజు సాయంత్రం నుంచి ఆ పనులను అధికారులు చేపట్టారు. సుమారు 1,540 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న పలు మోటార్లను పెట్టి నీటి తొలగింపును అధికారులు చేపట్టారు. అలాగే తీగలేరు వాగు, ఫీడర్‌ కాలువల్లో కూడా పనులు ప్రారంభించారు.

వేగవంతమైన పనులు

మరోసారి ఈనెల 12వతేదీన మంత్రి నిమ్మల ఆ పనులను పరిశీలించారు. తాను ఊహించిన విధంగా పనులు సాగడం లేదని గుర్తించిన ఆయన మరికొన్ని సూచనలు చేస్తూ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు హెచ్చరికలతో కూడిన ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరింత వేగవంతంగా సదరు పనులను అధికారులు చేసి ఎట్టకేలకు ఆదివారం రాత్రికి టన్నెల్‌లోని నీటిని బయటకు పంపి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చేయగలిగారు. మొత్తం అడుగుభాగంలో పేరుకుపోయిన బురద నీరు తొలగింపు, మిషనరీ శుభ్రం, పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా వంటివి చేపట్టి రెండు రోజుల్లో తిరిగి టన్నెల్‌-2లో లైనింగ్‌ పనులు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఫీడర్‌ కాలువలో మేట వేసిన మట్టి దిబ్బల తొలగింపుతోపాటు ప్రధాన ముంపునకు కారణమైన తీగలేరు వాగుపైనా దృష్టి సారించారు. వాగు ప్రాంతాన్ని డ్రోన్‌ ద్వారా సర్వే చేసి ఫీడర్‌ కాలువో మట్టి తొలగింపు, జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి పనులు కొనసాగిస్తున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 01:38 AM