లైన్‌క్లియర్
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:47 AM
ఆరేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ కాలంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి బిల్లులు రాక ఎదురుచూస్తున్న వారికి రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ పనులకు బిల్లులు చెల్లించకుండా వాటిని వైసీపీ ప్రభుత్వం ఏకంగా క్లోజ్ చేసింది. ఆన్‌లైన్ అకౌంట్లు సైతం మూసివేయడంతో ఆ బిల్లులు రాక అప్పట్లో పనులు చేసిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రూ.10.24కోట్ల ఉపాధి పెండింగ్ బిల్లులకు మోక్షం
ఎఫ్‌టీవోలను అప్‌లోడ్ చేసిన డ్వామా అధికారులు
ఆరేళ్ల తర్వాత అందనున్న నిధులు
మరో రూ.6.80 కోట్ల చెల్లింపునకు అవకాశం
అవసరమైన రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు
గత వైసీపీ ప్రభుత్వం కక్షకట్టి చెల్లింపులకు బ్రేక్
ఆరేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ కాలంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి బిల్లులు రాక ఎదురుచూస్తున్న వారికి రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ పనులకు బిల్లులు చెల్లించకుండా వాటిని వైసీపీ ప్రభుత్వం ఏకంగా క్లోజ్ చేసింది. ఆన్‌లైన్ అకౌంట్లు సైతం మూసివేయడంతో ఆ బిల్లులు రాక అప్పట్లో పనులు చేసిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారికి ప్రస్తుతం చెల్లింపులకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలా పెండింగ్ ఉన్న వాటిలో రూ.10.24 కోట్ల బిల్లులకు లైన్‌క్లియర్ చేసింది. మరో పది రోజుల్లో ఆ బిల్లులకు సంబంధించిన నగదు వారి వారి ఖాతాల్లో జమ కానుంది. మరో రూ.6.80 కోట్ల మేర పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కూడా అవకాశం ఉంది. వాటికి అవసరమైన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఒంగోలు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : గతంలో టీడీపీ అధికా రంలో ఉన్న (2014-19) మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఉపాధి హామీ పనులు జరిగాయి. ఆ పథకం కింద ఒకవైపు లక్ష లాది మంది కూలీలకు కోట్లాది రూపాయల నగదు వేతన రూపంలో అందింది. మరోవైపు మెటీరియల్ కోటా నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున రోడ్లు, డ్రైన్లు, ప్రహరీలు, వివిధ నిర్మాణాలు, శ్మశానాల అభివృద్ధి, ఇతరత్రా అనేక పనులు చేప ట్టారు. జిల్లాలో ఆ ఐదేళ్ల కాలంలో సుమారు వెయ్యి కోట్ల మేర మెటీరియల్ కోటా పనులు చేశారు. వాటికి ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరిగాయి. 2019 ఎన్నికల సమయానికి ముందు చేసిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల మేర బిల్లులు నిలిచిపోగా, మరికొన్ని పనులను డ్వామా సిబ్బంది రికార్డు చేయలేదు. ఆ ఎన్ని కల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాడు పనులు చేసింది టీడీపీ మద్దతుదారులు కావడంతో వారిపై కక్షగట్టి బిల్లులను ఆపేసింది. వాటిలో సుమారు రూ.20 కోట్ల మేర అన్ని రికార్డులు నమోదు చేసి నగదు బదిలీ ఉత్తర్వులు (ఎఫ్‌టీవో)లు కూడా అప్‌లోడ్ చేసి ఉండగా, మరో రూ.30 కోట్ల మేర పనులకు కొంత చెల్లింపులు చేసి మరికొంత చెల్లించాల్సి ఉంది. చేసిన పని మేరకు రికార్డులు చేసినవి ఉండగా ఎఫ్‌టీవోలు మంజూరు చేసిన బిల్లులను చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది.
వివరాల నమోదు ఆపేశారు
రెండో కేటగిరీలో కొంత చెల్లింపు చేసి ఇంకా రికార్డులు పూర్తిచేయాల్సి ఉన్న వాటిని భవిష్యత్‌లో ఎఫ్‌టీవోలు అప్‌లోడ్ కూడా చేసే అవకాశం లేకుండా ఉపాధి పనుల సాఫ్ట్‌వేర్‌లో ఆ వివరాల నమోదును నాటి వైసీపీ ప్రభుత్వం తొలగించి వేసింది. ఇక మూడో కేటగిరీలో కొన్ని పనులకు అసలు డ్వామా లేదా ఆ పనులను పర్యవేక్షించిన పీఆర్, ఇతర శాఖల సిబ్బంది రికార్డులు చేయడమే జరగలేదు. అలాంటివి మరో రూ.20 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. అలా సుమారు జిల్లాలో రూ.70 కోట్ల మేర పెండింగ్ బిల్లులు నిలిచిపోయాయి. వీటిలో పనులు చేసి ఎఫ్‌టీవోలు కూడా అప్‌లోడై ఉన్న వాటికి సంబంధించి కొందరు కోర్టును ఆశ్రయించి బిల్లులు పొందగలిగారు. మిగిలినవన్నీ ఆరేళ్లకుపైగా అలాగే ఆగిపోయాయి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన అనంతరం ఈ పెండింగ్ బిల్లులపై దృష్టి సారించింది. ఈక్రమంలో ఎఫ్‌టీవోలు అప్‌లోడై చెల్లింపునకు పూర్తిగా లైన్‌క్లియర్‌గా ఉన్న వాటిని గత జనవరి, ఫిబ్రవరిలో చెల్లించారు. ఆ సమయంలో జిల్లాలో రూ.11.30 కోట్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరిగాయి.
కేంద్రం అనుమతితో నమోదు
రెండో కేటగిరీగా ఉన్న వాటి చెల్లింపులకు వైసీపీ నిర్వాకం వల్ల సాఫ్ట్‌వేర్‌లో ఆ పనులు తొలగించడంతో తిరిగి ఆ సాఫ్ట్‌వేర్‌ను పునరుద్ధరణ కోసం కేంద్రంతో రాష్ట్రప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఆ మేరకు ఇటీవల అనుమతి వచ్చింది. దీంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం జాబితాలను జిల్లాలకు పంపించి వాటికి సంబంధించి రికార్డులను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నవాటికి నగదు బదిలీ ఉత్తర్వులు (ఎఫ్‌టీవో)లను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఆ ప్రకారం జిల్లాకు రూ.16.17 కోట్ల పనులకు సంబంధించిన వివరాలను పంపారు. వాటిపై జిల్లాలోని డ్వామా సిబ్బందితోపాటు అప్పట్లో పనులను పర్యవేక్షించిన ఆయా శాఖల అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటివరకు రూ.10.24 కోట్ల పనులకు ఎఫ్‌టీవోలను అప్‌లోడ్ చేశారు.