పండుగలా..
ABN , Publish Date - Oct 02 , 2025 | 02:19 AM
జిల్లావ్యాప్తంగా సామాజిక పింఛన్‌ల పంపిణీ బుధవారం పడుగలా సాగింది. దసరా పర్వదినం గురువారం కావడంతో తొలిరోజే దాదాపు 90శాతం మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రక్రియను సచివాలయ సిబ్బంది చేపట్టారు.
ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ
మద్దిపాడులో పాల్గొన్న మంత్రి స్వామి,
కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే బీఎన్
తగ్గించిన జీఎస్టీపై పలుచోట్ల అవగాహన
ఒంగోలు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా సామాజిక పింఛన్‌ల పంపిణీ బుధవారం పడుగలా సాగింది. దసరా పర్వదినం గురువారం కావడంతో తొలిరోజే దాదాపు 90శాతం మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రక్రియను సచివాలయ సిబ్బంది చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా 80శాతం మందికి పైగా అందజేశారు. మొత్తం జిల్లాలో 2,84,279 మంది లబ్ధిదారులకు రూ.124.89 కోట్ల మేర పింఛన్ మంజూరైంది. దివ్యాంగుల కేటగిరీలో పలువురు అనర్హులు పింఛన్‌లు పొందుతున్నట్లు గుర్తించి వారికి ప్రభుత్వం గతంలోనే నోటీసులు ఇచ్చింది. వారిలో కొద్ది మంది మాత్రమే తమకు ఉన్న అర్హతలను సూచిస్తూ తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికులు మిన్నకుండిపోయారు. అయినప్పటికీ ఎవరికీ పింఛన్ నిలిపివేయకుండా గతనెలలో ఇచ్చిన వారందరికీ ఈనెలలో కూడా అందజేశారు. పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో పలుచోట్ల కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మద్దిపాడులో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్ పి.రాజాబాబు, ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని 37వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో పింఛన్‌లు పంపిణీ చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ మక్కు ఉగ్ర నరసింహారెడ్డి పామూరు మండలం చట్టుమడుగులో పింఛన్‌లు పంపిణీ చేయగా.. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలోని రెండో వార్డులోనూ, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పట్టణంలోని గణేష్‌నగర్‌లో పాల్గొన్నారు. టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గుడూరు ఎరిక్షన్‌బాబు ఎర్రగొండపాలెంలోని వై.కొత్తపల్లిలో, టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దొనకొండ మండలం గంగదేవిపల్లిలో పంపిణీ చేశారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలతో జీఎస్టీ తగ్గింపుపై జిల్లాలోని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.