వెలిగొండ.. వేగంగా..
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:55 PM
మొంథా తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలతో వెలిగొండ పనులకు ఏర్పడిన ఆటంకాల తొలగింపును ప్రాజెక్టు అధికారులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టును సందర్శించి లోటుపాట్ల సవరణపై ఆదే శాలు ఇచ్చిన రోజు నుంచే అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు.
యుద్ధప్రాతిపదికన ఆటంకాల తొలగింపు
మంత్రి నిమ్మల పర్యటన అనంతరం చకచకా అధికారుల చర్యలు
మొంథా తుఫాన్‌తో కురిసిన వర్షాలకు టన్నెళ్లలో చేరిన వర్షపు నీరు
భారీ మోటార్లతో తోడివేత
ఫీడర్ కాలువ గండ్లకు కారణమైన తీగలేరు వాగుపైనా దృష్టి
12,13 తేదీల్లో మరోసారి ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి
కొలిక్కి వచ్చిన ఫీడర్ కాలువ.. ఆధునికీకరణ టెండర్ల ప్రక్రియ
మొంథా తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలతో వెలిగొండ పనులకు ఏర్పడిన ఆటంకాల తొలగింపును ప్రాజెక్టు అధికారులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టును సందర్శించి లోటుపాట్ల సవరణపై ఆదే శాలు ఇచ్చిన రోజు నుంచే అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టుకు ప్రాజెక్టు తొలి దశ, మార్చికి రెండో దశ పనుల పూర్తి లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొలిదశ పూర్తికి ప్రధాన పనులుగా గుర్తించిన వాటిలో రూ.476 కోట్లతో ఫీడర్ కాలువ ఆధునికీకరణకు నిధులు మంజూరై టెండరు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. మరో కీలకమైనదిగా వెలిగొండ రెండో టన్నెల్ లైనింగ్ పనిని గుర్తించారు. రిజర్వాయర్‌లో నీటిని నిలిపేలోపు తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం, గొట్టిపడియ కాలువ గేటు ఏర్పాటు, కాకర్ల గ్యాప్ వైపు నుంచి అర్ధవీడు మండలానికి వెళ్లే గ్రామాలకు ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం వంటివి చేయాల్సి ఉంది. వీటిలో ఒక్కో పనిపై సమీక్ష చేసి గాడిలో పెడుతున్నారు.
ఒంగోలు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. కేవలం 36 గంటల్లోనే 18.40 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. నల్లమల అటవీ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో వెలిగొండ ఫీడర్ కాలువకు ఎగువన ఉన్న తీగలేరు వాగు పొంగి ప్రవహించింది. అప్పటికే బలహీనంగా ఉన్న ఫీడర్ కాలువ మట్టి కట్టలు ధ్వంసమయ్యాయి. ఫీడర్ కాలువ 850 మీటర్ వద్ద ఏకంగా 30 అడుగుల లోతు, వంద అడుగుల పొడవున కొట్టుకుపోయింది. మరో రెండు చోట్ల భారీ గోతులు పడ్డాయి. దీంతో తీగలేరు నీరంతా దిగువకు వచ్చి కడపరాజుపల్లి, కటకానిపల్లి, ఇతర గ్రామాల్లో పొలాలను ముంచెత్తి మేట వేసింది. ఫీడర్ కాలువల్లోనూ మట్టి మేటలతో నీరు ముందుకు సాగడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు టన్నెళ్ల వైపు కూడా నీరు వెళ్లింది. ఒక్కో టన్నెల్‌లో సుమారు 9 కి.మీ లోపలకు భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో రెండో టన్నెల్‌లో లైనింగ్ పనులు నిలిచిపోయాయి.
ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
ఈనెల 7వతేదీన ప్రాజెక్టు పనుల సందర్శనకు వచ్చిన జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. టన్నెళ్లలోకి చేరిన వరద నీరు, ఫీడర్ కాలువకు పడిన భారీ గండి, మట్టి పెద్దఎత్తున మేట వేసిన పొలాలు, ఫీడర్ కాలువను చూశారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈనెల 12,13తేదీల్లో తిరిగి తాను ప్రాజెక్టు సందర్శనకు వస్తానని ఆలోపు సదరు పనులు చేయాలని ఆదేశించారు. టన్నెల్‌లోకి వెళ్లిన నీటిని తోడేసి తిరిగి లైనింగ్ పనులు ప్రారంభించాలని, ఫీడర్ కాలువలో మేట వేసిన మట్టిని తక్షణం తొలగించాలని సూచించారు. తీగలేరు వాగులో భారీగా ఆక్రమణలు, దీర్ఘకాలంగా కనీస మరమ్మతులు చేయక పూడిక పెరగడంతో భారీగా వర్షాలు కురిసినప్పుడు ప్రవాహం ఫీడర్ కాలువను దెబ్బతీస్తోంది.తీగలేరువాగులో నీటి ప్రవాహం సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల ఆదేశించారు.
టన్నెళ్లలో చేరిన నీరు మోటార్ల ద్వారా బయటకు..
మంత్రి పర్యటన ముగిసిన వెంటనే సంబంధిత పనులపై ప్రాజెక్టు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. టన్నెళ్ల లోపలికి చేరిన నీటిని మోటార్ల ద్వారా ఫీడర్ కాలువలోకి పంపిస్తున్నారు. సుమారు 12 మోటార్లు (మొత్తం కలిపి 1,540 హెచ్‌పీ సామర్థ్యం) ఏర్పాటు చేశారు. అందులో ఒక మోటారు 550 హెచ్‌పీ శక్తి ఉన్నది కూడా ఉంది. క్రేన్ సాయంతో దానిని తెచ్చి నీటిని తోడేస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం వెలిగొండ టన్నెళ్లలోకి సుమారు కోటి 30 లక్షల లీటర్ల నీరు చేరింది. ఇప్పటి వరకు దాదాపు 80లక్షల లీటర్ల నీటిని బయటకు పంపారు. మిగిలిన నీటిని కూడా సోమవారం రాత్రికి తోడేసి మంగళవారం టన్నెళ్ల లోపలికి వెళ్లేమార్గం శుభ్రం చేయడం, విద్యుత్ పునరుద్ధరణ తదితర చర్యలు చేపట్టి ఆ వెంటనే రెండో టన్నెల్ లైనింగ్ పనులు మొద లుపెడతారు. ఫీడర్ కాలువలో మేట వేసిన మట్టి తొలగింపు కూడా ఎక్స్‌కవేర్లను ఏర్పాటు చేసి వేగంగా చేస్తున్నారు.
తీగలేరు ఆక్రమణలపై డ్రోన్ల ద్వారా సర్వే
తీగలేరుపై కూడా ప్రాజెక్టు అధికారులు దృష్టి సారించారు. పలుచోట్ల వాగు ఆక్రమణలపై డ్రోన్ల ద్వారా సర్వేచేశారు. ఆదివారం వాగు లోపలి భాగంలో తక్షణం చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఒకవైపు ఆక్రమణల తొలగింపు, మరోవైపు పూడిక తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతుల పొలాల్లో వేసిన మేట తొలగింపునకు సంబంధించి తక్షణ చర్యలపై దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనుల కోసం సెప్టెంబరు 22న ప్రభుత్వం రూ.476 కోట్లను మంజూరు చేసింది. గత నెలలో రూ.375 కోట్లతో అధికారులు టెండర్లు పిలిచారు. పది రోజుల క్రితం టెండర్లను తెరవగా కాంట్రాక్టు పొందిన సంస్థ సమర్పించిన అన్ని పత్రాలను పరిశీలించిన అధికారులు రెండు రోజుల్లో అగ్రిమెంట్ కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఆ ప్రకారం చూస్తే ఈనెలలోనే ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టే అవకాశం ఉంది.