రెండో హత్య కేసులో మళ్లీ యావజ్జీవం
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:14 AM
కొండపిలోని మద్దులూరు రోడ్డులో 2023 సంవత్సరంలో ఓ బ్రాందీ షాపు ముందు నిద్రిస్తున్న వాచ్‌మన్‌ను హత్య చేసిన కేసులో నిందితుడు కడియం హనుమంతరావుకు యావజ్జీవ శిక్ష పడింది. ఈమేరకు ఒంగోలు అదనపు జిల్లా న్యాయాధికారి టి.రాజావెంక టాద్రి శుక్రవారం తీర్పునిచ్చారు.
78 ఏళ్ల వయసులో ఆవేశం.. వాచ్‌మన్ హత్య
రెండోసారి కూడా నిందితుడికి అదే శిక్ష
కొండపి/ఒంగోలు క్రైం, అక్టోబరు 10 (ఆంధ్ర జ్యోతి) : కొండపిలోని మద్దులూరు రోడ్డులో 2023 సంవత్సరంలో ఓ బ్రాందీ షాపు ముందు నిద్రిస్తున్న వాచ్‌మన్‌ను హత్య చేసిన కేసులో నిందితుడు కడియం హనుమంతరావుకు యావజ్జీవ శిక్ష పడింది. ఈమేరకు ఒంగోలు అదనపు జిల్లా న్యాయాధికారి టి.రాజావెంక టాద్రి శుక్రవారం తీర్పునిచ్చారు. అప్పట్లో కొండపిలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడికి తాజాగా పడిన యావజ్జీవ శిక్ష రెండోసారని తెలిసింది. టంగుటూరు మండలం పొందూరుకు చెందిన కడియం హనుమంతరావుకు దాదాపు 30ఏళ్ల క్రితం ఆ గ్రామంలో జరిగిన హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఆ కేసులో ముద్దాయిగా శిక్ష అనుభవించాడు. అనంతరం తన స్వగ్రామం పొందూరు విడిచి కొండపికి వచ్చి గుడులు, పాడుబడిన, ఖాళీగా ఉండే ఇళ్లలో ఉంటున్నాడు. 2023 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ రాత్రి పది గంటల సమయంలో కొండపిలోని బ్రాందీ షాపులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మండలంలోని పోలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సంగన సుబ్బారెడ్డితో దుకాణం మూసేటప్పుడు గొడవపడ్డాడు. ఆవేశంతో చంపుతానని బెదిరించి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి తన నివాసం నుంచి గడ్డపారతో వెళ్లి బ్రాందీ షాపు ముందు నిద్రిస్తున్న సుబ్బారెడ్డి తలపై కొట్టి చంపాడు. ఈమేరకు మృతుడి భార్య సంగ సుశీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు, పోలీసు జాగిలాలు కూడా నేరుగా నిందితుడి ఇంటికి వెళ్లాయి. ఈ కేసులో తిరిగి హనుమంతరావుకు యావజ్జీవ శిక్ష పడింది. ఒకే వ్యక్తికి రెండుసార్లు హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష పడటం అరుదు. మొదటిసారి శిక్ష పడ్డాక సహజంగా పశ్చాత్తాపం ఉంటుంది. అటువంటిది తిరిగి రెండోసారి హత్య చేయడం విచిత్రంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతికుమారి వాదనలు వినిపించారు. సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందిచారు.