ఆయకట్టుకు జీవం
ABN , Publish Date - Jun 03 , 2025 | 01:59 AM
సాగర్ జలాలు పారేందుకు ఆటంకాలు తొలగనున్నాయి. కాలువల బాగుకు రంగం సిద్ధమైంది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వకాలంలో కనీస మరమ్మతులకు కూడా నోచుకోక చిల్లచెట్లు, తూటుకాడతో నిండిపోయిన కాలువలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది.
సాగర్ కాలువల మరమ్మతులకు మోక్షం
ఉమ్మడి జిల్లాకు రూ.8.70కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు
వారు ముందుకు రాకపోతే స్వల్పకాలిక టెండర్లు
ఐదేళ్లు కాలువల గురించి పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
నీటి సరఫరాకు తీవ్ర ఆటంకం
ఎట్టకేలకు ఆ సమస్యకు పరిష్కారం
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
ఒంగోలు బ్రాంచ్ కాలువ కట్టలు అనేకచోట్ల కోసుకుపోయాయి. కొన్నిచోట్ల లైనింగ్ కూడా దెబ్బతింది. కాలువలకు నిండుగా నీరు విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి ఉంది. కట్టలపై చిల్లచెట్లు దట్టంగా పెరిగి రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది. మేజర్లు, మైనర్ల రూపురేఖలు కూడా మారిపోయాయి. తూర్పువీరాయపాలెం మేజర్‌లో చిల్లచెట్లు దట్టంగా మొలిచాయి. అనేకచోట్ల కట్ట బలహీనపడింది.
దర్శి, ఒంగోలు బ్రాంచ్ కాలువల పరిధిలోని మేజర్లు, మైనర్లు గత ఐదేళ్లలో కనీస మరమ్మతులకు నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఏడాది సాగర్ జలాలు విడుదల చేసేలోపు పనులు పూర్తయ్యే అవకాశం ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాగర్ జలాలు పారేందుకు ఆటంకాలు తొలగనున్నాయి. కాలువల బాగుకు రంగం సిద్ధమైంది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వకాలంలో కనీస మరమ్మతులకు కూడా నోచుకోక చిల్లచెట్లు, తూటుకాడతో నిండిపోయిన కాలువలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రవాహానికి అవరోధం లేకుండా చేసి ఎగువ నుంచి వచ్చే నీరు పొలాలకు చేరేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం అత్యవసర పనుల పేరుతో తాజాగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్నిరకాల కాలువల మరమ్మతులకు రూ.8.70 కోట్లు మంజూరు చేసింది. రూ.2లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన మొత్తం 232 పనులు చేయించనుంది.
ఒంగోలు, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ప్రధాన సాగు, తాగునీటి వనరు సాగర్ కాలువలే. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఒకవైపు ప్రపంచ బ్యాంకు నిధులు, మరోవైపు రాష్ట్రప్రభుత్వం ద్వారా నిధులు ఇచ్చి భారీగా కాలువలను ఆధునికీకరింది. అనంతరం అధికా రంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాలువల నిర్వహణను గాలికొదిలేసింది. కనీస మరమ్మతుల గురించి కూడా పట్టించుకోలేదు. దీంతో ప్రధాన.. మేజర్, మైనర్ కాలువలు అన్న తేడా లేకుండా అన్నింటిలోనూ చిల్లచెట్లు, తూటుకాడ భారీగా పెరిగిపోయింది. అనేకచోట్ల కట్టలు బలహీన పడ్డాయి. డ్రాపులు, షట్టర్లు ధ్వంసమై నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఈ అవస్థలను గుర్తించి అత్యవసర పనులను చేపట్టింది. అయితే వ్యవసాయ సీజన్, కాలువల్లో నీటి సరఫరాతో అన్ని పనులు చేపట్టేందుకు వీలు కాలేదు. దీంతో వచ్చే సీజన్‌కు సాగర్ కాలువలకు నీరు వచ్చేలోపు అలాంటి పనులు చేపట్టి పూర్తిచేయాలని నిర్ణయించింది. అందుకోసం అత్యవసరంగా చేయాల్సిన పనులను నివేదించాలని ఏప్రిల్‌లో జలవననరుల శాఖ ఉన్నతాధికారులు జిల్లాల అధికారులను ఆదేశించారు.
చీమకుర్తి డివిజన్‌కు ఎక్కువ
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాస్థాయి అధికారులు ప్రతిపాదనలను తయారు చేసి పంపారు. వాటిని పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.374 కోట్ల విలువైన పనులను మంజూరు చేశారు. అందులో ఒంగోలు కేంద్రంగా ఉన్న ఎన్‌ఎస్‌పీ సర్కిల్ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో ఉన్న సాగర్ కాలువల్లో అత్యవసర పనులకు రూ.8.70 కోట్లు మంజూరయ్యాయి. గతంలో ఈ తరహా పనులు స్వల్పంగా మాత్రమే జరిగిన చీమకుర్తి డివిజన్‌లోని సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో కాలువల మరమ్మతులకు రూ.5.12 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో 87 పనులు చేపట్టనున్నారు. అలాగే దర్శి డివిజన్‌లో పరిధిలో 37 పనులకు రూ.1.08 కోట్లు మంజూరయ్యాయి. ఆ డివిజన్‌లో గత ఏడాది దాదాపు రూ.3.50 కోట్లతో పనులు మంజూరు చేసి ఉండటంతో ఈసారి కొంత తగ్గించారు.
తక్షణం పనులు చేపట్టాలి
ఒంగోలు సర్కిల్ పరిధిలో బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి డివిజన్‌లోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో 78 పనులకు రూ.2.58 కోట్లు మంజూరు చేశారు. తక్షణం ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజా ప్రభుత్వం వచ్చాక సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుతం మంజూరు చేసిన పనులను వాటి ద్వారానే చేయించాలని అధికారులను ఆదేశించింది. గతంలో రూ.5లక్షల పనుల వరకే నామినేషన్ పద్ధతిపై చేసే అవకాశం ఉండగా, దానిని ప్రస్తుతం రూ.10 లక్షలకు పెంచింది. ప్రతిపాదించిన పనులన్నీ రూ.10లక్షలలోపే ఉండటంతో సాగునీటి సంఘాల నుంచి తీర్మానాలను తీసుకొని వారికి అధికారులు పనులు ఇచ్చే అవకాశం ఏర్పడింది. తద్వారా తక్షణం ఆ పనులు చేపట్టి కాలువల్లో నీరు వచ్చేలోపుగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. కాగా ఎక్కడైనా సంఘాలు ఈ పనులను చేపట్టేందుకు ముందుకు రాకపోతే స్వల్పకాలిక టెండర్లు పిలిచి చేయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.