తుపానును సమర్థవంతంగా ఎదుర్కొందాం
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:40 AM
తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందని, కలెక్టర్ డా.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు.
చీరాల, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి) : తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందని, కలెక్టర్ డా.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల ప్రభుత్వం అఽధికారులతో సమావేశం నిర్వహిం చారు. డివిజన్ పరిధిలో తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో తీసుకున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. అలాగే వార్డు లోని 31వ వార్డు రోశయ్య కాలనీ పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటికే కేంద్రానికి తరలించిన వారి సౌకర్యాలపై మాట్లాడారు. అర్భన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి జాగ్రత్తలు సూచించారు. వారి వెంట ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, కమీషనర్ అబ్దుల్ రషీద్, ఎంపీడీవో విజయ తదితరులు ఉన్నారు.
వాడరేవు : తుఫాన్ ప్రభావంతో ఎటువంటి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో సోమవారం ముంపు గ్రామాలైన వాడరేవు, రామా పురం, నాయనిపల్లి, కఠారిపాలెం, అబ్దుల్ కలామ్ కాలనీల్లో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. అలాగే పునరావాస కేంద్రాల్లోని ఏర్పాట్లు పరిశీలించి ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణకు పలు సూచనలు చేశారు.
అద్దంకిలో వర్షపుజల్లులు ప్రారంభం
అద్దంకి : మొంథా తుఫాన్ ప్రభావంతో అద్దంకిలో సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి. ఉదయం సమయంలో ఎండ ఉండగా మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిన్నగా మొదలైన వర్షపుజల్లులు సోమవారం రాత్రి కూడా కొనసాగాయి. మండలంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు ముంథా తుఫాన్ ప్రభావంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి
అద్దంకి : ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీఐ సుబ్బరాజు కోరారు. మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి, గాలులు వీచే అవకాశం ఉండడంతో తమ ప్రయాణాలను మూడురోజుల పాటు వాయిదా వేసుకోవాలన్నారు. ప్రధానంగా కొత్తవ్యక్తులు ఎట్టి పరిస్థితులలో వాగులు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. రామాయపాలెంలో సోమవారం రాత్రి సీఐ సుబ్బరాజు పరిశీలించి గ్రామ స్థులతో మాట్లాడారు. మండలంలోని భవనాశి వాగు, దోర్నపువాగు, చిలకలేరు, నల్లవాగులు పొంగి ప్రవహిం చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు.
పుకార్లను నమ్మవద్దు : జడ్పీసీఈవో బాలమ్మ
మేదరమెట్ల : మొంథా తుపాను తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండా లని, పుకార్లను నమ్మవద్దని జడ్పీ సీఈవో బాలమ్మ చెప్పారు. సోమవారం మండలంలోని మేదరమెట్లలోని పునరాసకేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏదైనా అనుకోని విపత్తు జరిగితే అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉండి ఇళ్లలోని నీరు వస్తే స్థానిక పాఠశాలలో పునరావాసం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏదైనా సహాయం అవసర మైతే మండలంలోనే అధికారులను సంప్రదించాల న్నారు. ఆమె వెంట తహసీల్దార్ జీ.వీ.సుబ్బారెడ్డి, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
మేదరమెట్ల : జాతీయ, రాష్ట్రీయ, గ్రామీణ, రహదారుల్లో ఎక్కడైనా రహదారులకు ఆటంకం కలిగితే స్థానిక పోలీసులను సంప్రదించాలని అద్దంకి రూరల్‌సీఐ మల్లికార్జునరావు తెలిపారు. సోమవారం తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జనరేటర్లు, మొకులు, రంపాలు, గొడ్డలు, వంటి ఉపకరణాలను సమకూర్చుకొని ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు మల్లికార్జునరావు తెలిపారు. పోలీసులు చేసిన ఏర్పాట్లను తహసీల్దార్ జీవీ.సుబ్బారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫీ, కొరిశపాడు ఎస్సై సురేష్‌లు ఉన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
చినగంజాం : తుపాన్ తీరం దాటి ప్రశాంత వాతావరణం నెలకొనే వరకు మండల స్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని పర్చూరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి లవన్న, మండల ప్రత్యేకాధికారి సీ.హెచ్.ప్రశాంత్‌లు అన్నారు. మండలంలోని మోటుపల్లి, పెదగంజాం గ్రామాల్లో పర్యటించి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను, తీరప్రాంతాలను సోమవారం వారు పరిశీలించారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దన్నారు. తుఫాన్ హెచ్చరికలను అనుక్షణం గమనిస్తూ నడుచుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, భోజన సదుపాలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చుడాలని అధికారులను ఆదేశించారు. పెదగంజాం జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లు పరిశీలించారు. పునరావాస కేంద్రం వద్ద ఉంచిన ఆహారం, బ్లీచింగ్, జనరేటర్, రెండు ట్రాక్టర్లు, జెసీబి తదితర వాటిని ఆయన పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా తుపాను పర్యవేక్షణ కోసం గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఇక ఇంకొల్లు సీఐ వై.వీ.రమణయ్య మోటుపల్లి, రుద్రమాబపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. తీరం వెంట ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవిగుంట ప్రబాకరరావు, ఎంపీడీవో కే.ధనలక్ష్మి, ఏపీఎం గద్దె పెదసుబ్బారావు, గ్రామ కార్యదర్శి కె.కృపారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగు గ్రామాలలో పునరావాస కేంద్రాలు
పంగులూరు : మొంథా తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నాలుగు గ్రామాలలో పునరావాస కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన వసతులు కల్పించా మన్నారు. మొంధా తుఫాన్‌పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందికలిగినా టోల్‌ఫ్రీ నెంబరు 9000811918 నెంబరుకు ఫోన్‌చేసి తగిన సాయం పొందాలని, సిబ్బంది అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు.
అద్దంకి : తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. పట్టణంలోని పల్లపు ప్రాంతాలుగా ఉన్న ఎన్‌టీఆర్ నగర్, గుంజివారిపాలెం, పోలేరమ్మ గుడి వెనుక, పాత దర్శి రోడ్డు తదితర ప్రాంతాలలో తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రలు సోమవారం పరిశీలించి స్థానికులకు తగు జాగ్రత్తలు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిస్తే పునరావాసం కోసం 10 ప్రాంతాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. మండలంలోని శింగరకొండపాలెం ఎస్టీ కాలనీని తహసీల్దార్ శ్రీచరణ్ పరిశీలించారు. మున్సిపల్ ఏఈ లోకేష్, ఆర్‌ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
చెరువులను పరిశీలించిన ఎంపీడీవో
పంగులూరు : మండలంలోని నూజెళ్లపల్లె, చందలూరు, అలవలపాడు, కోటపాడు, జనకవరం గ్రామాలలో చెరువులను సోమవారం ఎంపీడీవో స్వరూపారాణి పరిశీలించారు. తుపాను వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తుఫాన్ తీవ్ర తను గుర్తించాలని, తీరంతాకే వరకు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చెట్ల కింద, విద్యుత్ తీగలకింద నిలువరాదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సుమంత్, కార్యదర్శులు, వీఆర్ వోలు పాల్గొన్నారు.
తుపానును ఎదుర్కోవడానికి అధికారుల ఏర్పాట్లు
మార్టూరు : మొంథా తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మార్టూరు మండలంలో 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, భోజనం తదితర వసతులు ఉండే విధంగా చర్యలు చేపట్టారు. అత్యవసర సమయంలో వినియోగించడానికి ఎక్స్‌కవేటర్, తాళ్లు,బ్యాటరీ లైట్లను సిద్ధం చేశారు. మార్టూరులోని ప్రభు త్వ ఆస్పత్రిలో విద్యుత్ సమస్య ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యగా జనరేటర్లును ఏర్పాటుచేశారు. యద్దనపూడి మండలంలో 8 పునరావాసకేంద్రాలను ఏర్పాటుచేశారు
పర్చూరు : తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. 24 గంటలు సిబ్బంది విధుల్లో ఉండేలా షిష్ట్‌ల వారీగా విధులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. పర్చూరు, కారంచేడు మండలాల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. కారంచేడులో తహశీల్ధార్ నాగరాజు, ఎస్సై ఖాదర్ భాషా, ఇతర శాఖల అధికారులతో కలసి కొమ్మమూరు కాలువతో పాటు, ఇతర కాలువలను పరిశీలించారు. ఆయా లోతట్టు గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా పర్చూరులో తహశీల్దార్ బ్రహ్మయ్య, ఎస్పై .జి.వి.చౌదరి నేతృత్వంలో అధికారులు ప్రత్యేక పునరాస కేంద్రాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణహాని జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ తెలిపారు.