అలసత్వం.. సమన్వయ లోపం..
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:25 AM
జిల్లాలో ఉపాధి పథకం-రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్య యోజన (ఆర్‌జీఎస్‌ఏ) కింద మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలు అడుగు ముందుకు పడటం లేదు. ఒక్కో భవనానికి రూ.32లక్షలు ఈ పథకం కింద ఇస్తుండగా జిల్లాకు 18 భవనాలు మంజూరయ్యాయి.
ప్రారంభం కాని పంచాయతీ భవన నిర్మాణాలు
ఉపాధి హామీ, ఆర్‌జీఎస్‌ఏలతో 18 మంజూరు
పురోగతి లేకపోవడంపై పీఆర్ కమిషనర్ కృష్ణతేజ సీరియస్
మండల స్థాయి అధికారులతో డ్వామా పీడీ, పీఆర్ ఎస్‌ఈల జూమ్ కాన్ఫరెన్స్
ఒంగోలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉపాధి పథకం-రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్య యోజన (ఆర్‌జీఎస్‌ఏ) కింద మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలు అడుగు ముందుకు పడటం లేదు. ఒక్కో భవనానికి రూ.32లక్షలు ఈ పథకం కింద ఇస్తుండగా జిల్లాకు 18 భవనాలు మంజూరయ్యాయి. అందులో ఆర్‌జీఎస్‌ఏ ద్వారా రూ.25 లక్షలు ఇస్తుండగా, ఉపాధి హామీ నుంచి రూ.7లక్షలు సమకూరుస్తున్నారు. దీంతో టెండర్లు పిలిచే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంగా వెండర్స్ పేరుతో మెటీరియల్ సరఫరా చేసేవారితో నిర్మాణాలు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఈ పథకం కింద గత ఏడాది వెలిగండ్ల మండలం పందువ పంచాయతీకి భవనం మంజూరైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెలిగండ్ల మండలం జాళ్లపాలెం, మోటుపల్లి, హెచ్‌ఎంపాడు మండలం ఉమ్మనపల్లి, సీఎస్‌పురం మండలం వెంగనగుంట, దొనకొండ మండలం సంగాపురం, మద్దిపాడు మండలం బూరేపల్లి, పెద్దారవీడు మండలం రామాయపాలెం, ఎస్.కొత్తపల్లి, దోర్నాల మండలం గంటవానిపల్లి, బీఎన్‌తండా, త్రిపురాంతకం మండలం సంగంతాండ, గిద్దలూరు మండలం జయరాంపురం, మార్కాపురం మండలం నికరంపల్లి, పడమటిపల్లి, కే కొత్తపల్లి, పి.మాచవరం, కొమరోలు మండలం బాదినేనిపల్లిలకు మంజూరయ్యాయి. కొన్నింటికి నెలక్రితం, మరికొన్నింటికి ఇటీవల కలెక్టర్ మంజూరు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇంతవరకు గ్రౌండింగ్ లేదు
గత ఏడాది మంజూరైన పందువ పంచాయతీ భవన నిర్మాణం పురోగతిలో ఉండగా ఈ ఏడాది మంజూరైన 17 భవనాలలో ఒక్కటి మినహా మిగిలినవి ఇంతవరకు గ్రౌడింగ్ కూడా కాలేదు. సకాలంలో వాటి నిర్మాణం చేస్తేనే కేంద్రం నుంచి నిధులు వచ్చేది. అయితే జిల్లాలో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారుల అలసత్వం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో భవన నిర్మాణాలు ప్రారంభం కాకపోవడమే కాక సగం భవనాలకు ఇంతవరకు స్థలాల ఎంపికే కొలిక్కి రాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ జిల్లా అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈలు మంగళవారం సంబంధిత మండలాల ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ డీఈలు, ఏఈలతో జామ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. పలుచోట్ల లోపాలను గుర్తించిన వారు వాటి పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. తక్షణం భవణ నిర్మాణాలు ప్రారంభించా లని(గ్రౌడింగ్) ఆదేశించారు.