కూచిపూడికి చెందిన వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:38 PM
సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట చెరువు సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
పేర్నమిట్ట చెరువు సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం
సంతనూతలపాడు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని పేర్నమిట్ట చెరువు సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాలూకా ఎస్సై హరిబాబు తెలిపిన సమాచారం మేరకు... మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన చేగిరెడ్డి పుల్లారెడ్డి(34)కి వివాహమై మూడేళ్లు అయింది. ఇతనికి ముగ్గురు ఆడపిల్లలు. బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుంటాడు. పుల్లారెడ్డి మద్యానికి బానిసై భార్యాబిడ్డలను సరిగా చూసుకోకపోవడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఈనెల 3న బేల్దారీ పనులకు బెంగళూరు వెళ్తున్నానని చెప్పి, పేర్నమిట్టలో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చాడు. అనంతరం ఆరోగ్యం బాగోలేదని ఒంగోలులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది బయటకు వచ్చి, ఈ నెల 4న సోదరికి చెప్పి వెళ్లిపోయాడు. ఈక్రమంలో ఆదివారం చెరువు సమీపంలో ఉరివేసుకుని ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని పుట్టకొక్కులను వేరుకునే కొందరు గమనించి తాలుకా పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఎస్సై హరిబాబు సంఘటన ప్రాంతానికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మృతుని జేబులోని ఆధార్ తదితర వివరాలను గమనించి మృతుడు మర్రిపూడి మండలం చేగిరెడ్డి పుల్లారెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.