Share News

కొత్తపేట.. నీటికి కటకట

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:29 AM

కనిగిరి పట్టణంలో సంపన్నుల పేట నీటికోసం కటకటలాడుతుంది. భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లలో నీరురావడంలేదు. దీంతో కొత్తపేట వాసులకు మున్సిపాల్టి సరఫరాచేసే నీరే దిక్కయింది. అదికూడా ఐదురోజులకొకమారు ట్యాంకర్‌ ద్వారా సరఫరాచేస్తున్నారు.

కొత్తపేట.. నీటికి కటకట
మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న ఇంటి ముందు ఉన్న పీపాలు

- వాడుకకూ తప్పని అవస్థలు

- ట్యాంకర్‌ల కోసం ఎదురుచూపులు

- పట్టించుకోని అధికారులు

కనిగిరి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): కనిగిరి పట్టణంలో సంపన్నుల పేట నీటికోసం కటకటలాడుతుంది. భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లలో నీరురావడంలేదు. దీంతో కొత్తపేట వాసులకు మున్సిపాల్టి సరఫరాచేసే నీరే దిక్కయింది. అదికూడా ఐదురోజులకొకమారు ట్యాంకర్‌ ద్వారా సరఫరాచేస్తున్నారు. ఈనీరు సరిపడక స్థానికులు పడరానిపాట్లు పడుతున్నారు. గతపాలకులు ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని ప్రచారాలు చేసి పట్టించుకోలేదని కొత్తపేట ప్రజలు విమర్శిస్తున్నారు. అరకొరగా పనిచేసే బోరు మోటర్‌ల నుంచి కేవలం పది బిందెలు కంటే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది చివరి మాసాల్లో కురిసిన వర్షాలకు నాగులచెరువుకు నీరొచ్చి భూగర్భ జలమట్టం పెరిగి బోర్లు మళ్ళీ వాడుకలోకి వస్తాయని భావించిన ప్రజలకు నీటి కష్టాలు తప్పటం లేదు. ప్రతిఇంటి ముందు పెద్ద, పెద్ద ట్యాంకులు, పీపాలు దర్శనమిస్తూ ప్రజలు పడుతున్న అవస్థలకు సాక్ష్యంలా నిలిచాయి.

కనిగిరి పట్టణంలోని కొత్త పేటలో బహుళ అంతస్థులు వెలిశాయి. ఒక్కో అంతస్థుకు సరాసరిన రోజుకు వెయ్యి లీటర్లు వినియోగించుకునే పరిస్థితి. కొత్తపేట ప్రాంతంలో గృహ యజమానుల కంటే ఎక్కువ మంది బయటి ప్రాంతాల నుంచి వచ్చి అద్దెలకు నివసిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. కొత్తపేటలో దాదాపు మూడువేల మంది జనాభా ఉన్నారు. 1800 వందల కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు. రెండు సచివా లయాల పరిధిలో విస్తీర్ణంలో కొత్తపేట ఏర్పాటయింది. అత్యధిక జనాభా కల్గిన ప్రాంతంగా కొత్తపేట పేరొందింది. కాశినాయన గుడి దాటి నాగులచెరువు అలుగు వరకు ఇళ్ళు విస్తరించాయి. ఈ ప్రాంతం నుంచి ఏడాదికి సగటున దాదాపు రూ.20 లక్షల వరకు ఇంటి పన్నుల రూపంలో మున్సిపాల్టీకి చెల్లిస్తున్నారు. గత పాలకుల వైఫల్యం కారణంగా వాడుక నీటి కోసం కొత్తపేట ప్రజలకు అవస్థలు మాత్రం తప్పటం లేదు.

ఐదు రోజులకోమారు ట్యాంకరుతో సరఫరా

కొత్తపేటలో మున్సిపల్‌ ట్యాంకరుతో ఐదు రోజులకోమారు నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రెండు నుంచి మూడు పీపాలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. ఎవరైనా బంధువులు వస్తే మాత్రం నీరు చాలకపోవటంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ వాటర్‌ సరఫరా కాంట్రాక్టర్‌ ట్రిప్పుల్లో మోసం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:29 AM