ఖరీఫ్ అరకొరే!
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:19 AM
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రతికూలంగానే సాగుతోంది. కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో సగటు వర్షపాతం సాధారణం కన్నా అధికంగా ఉన్నప్పటికీ కొన్ని మండలాల్లో భారీ వర్షమే కురిసింది. అయితే అది పంటల సాగుకు అంతగా అనుకూలించ లేదు. సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో మూడో వంతు కూడా సాగు కాలేదు.
మూడు నెలలు.. మూడో వంతూ సాగు కాలేదు
కంది, పత్తికి మించిన సమయం
ప్రతికూల వాతావరణమే కారణం
సాగర్ నీటి భరోసాతో ముమ్మరంగా వరినాట్లు
మొక్కజొన్న వైపు రైతుల మొగ్గు
వర్షాలు కురిసిన ప్రాంతాల్లోనూ సాగుకు అనుకూలించని పరిస్థితి
ఒంగోలు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రతికూలంగానే సాగుతోంది. కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో సగటు వర్షపాతం సాధారణం కన్నా అధికంగా ఉన్నప్పటికీ కొన్ని మండలాల్లో భారీ వర్షమే కురిసింది. అయితే అది పంటల సాగుకు అంతగా అనుకూలించ లేదు. సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో మూడో వంతు కూడా సాగు కాలేదు. కీలక మెట్ట పంటలైన కంది, పత్తి అరకొరగా సాగవగా ఇప్పుడు అదును దాటింది. జూన్‌లో వేసే తొలకరి పైర్లు వర్షాభావంతో ముందుకు సాగలేదు. కాగా సాగర్ నీటి సరఫరాపై భరోసాతో ఆయకట్టు ప్రాంతంలో ముమ్మరంగా వరినాట్లు కొనసాగుతున్నాయి. అవి మరింత ఊపందు కోనున్నాయి. అలాగే మొక్కజొన్న సాగువైపు కూడా పలు ప్రాంతాల రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో వ్యవ సాయశాఖ పరిధిలో సుమారు లక్షా 29 వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్ సీజన్ కాగా ఈ సమయానికి కనీసం 75 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు కావాలి. జూన్‌లో తొలకరి పైర్లుగా పిలిచే సజ్జ, పెసర, పశుగ్రాసం.. జూలై, ఆగస్టులలో వర్షాధారంగా వేసే కంది, పత్తి, సెప్టెంబరులో వరి విస్తారంగా సాగు చేస్తారు. అలాగే జూలై నుంచి మిర్చి కూడా అధికంగా వేస్తారు. అయితే ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షపాతంతో తొలకరి సాగు ముందుకు సాగలేదు. తర్వాత జూలైలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైనా ఎక్కువగా ఆ నెల రెండో పక్షంలోనే కురిసింది. కొన్నిచోట్ల భారీ వర్షమే పడింది. ఆ వర్షాలతో భూములు పదునెక్కాయి. దున్నకం చేసి పంటలు వేసేందుకు చాలా ప్రాంతాల్లో భూములు ఆరక ప్రతికూలత ఏర్పడింది. ఆగస్టులోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. జూన్‌లో లోటు వర్షపాతంతో పంటల సాగు కాకపోగా, జూలై, ఆగస్టులో సాధారణం కన్నా అధికంగా వర్షం కురిసినా సకాలంలో పొలం ఆరక కీలక మెట్ట పంటలను రైతులు వేయలేకపోయారు. ప్రధానంగా కంది, పత్తిసాగుపై ఆ ప్రభావం పడింది. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 29వేల హెక్టార్లలో అత్యధికంగా 62,827 హెక్టార్ల (48.23శాతం) విస్తీర్ణంలో కంది, 26,981 హెక్టార్ల (20.10శాతం) విస్తీర్ణంలో పత్తి, 12,826 హెక్టార్ల(9.94శాతం) విస్తీర్ణంలో వరి సాగు చేపడతారు. అంటే ఈ సీజన్ మొత్తం సాగు విస్తీర్ణంలో ఈ మూడు పంటలే 78శాతానికిపైగా సాగవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం సాగు విస్తీర్ణంలో లక్షా 29వేల హెక్టార్లకు కేవలం 41,607 హెక్టార్ల(32.23శాతం)లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే మూడో వంతు విస్తీర్ణంలో కూడా విత్తనం పడలేదు.
పడిపోయిన కంది సాగు
ప్రధానమైన కంది పంట చూస్తే 68,287 హెక్టార్లకు కేవలం 13,450 హెక్టార్ల (25.55శాతం)లో మాత్రమే రైతులు వేశారు. పత్తి పంట 26,981 హెక్టార్లకు 10206 హెక్టార్లు (37.83శాతం) మాత్రమే సాగు చేశారు. వరి 12,826 హెక్టార్లకు 2,253 హెక్టార్లు (17.56శాతం) వేయగలిగారు. ప్రస్తుతం వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవలి వర్షాలు, సాగర్ కాలువల్లో నీటి సరఫరాపై భరోసాతో రైతులు వరిసాగు చేశారు. ఈనెలలో వరినాట్లు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. మెట్టపంటల్లో కీలకమైన కంది, పత్తి సాగుకు సమయం దాటిపోయింది. దీంతో నీటివసతి ఉన్న ప్రాంతాల రైతులు మొక్కజొన్న సాగువైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుత ఖరీప్ సీజన్ ప్రతికూలంగానే సాగుతోంది. సాధారణంలో సగం విస్తీర్ణానికి మించి పటంలు సాగయ్యే సూచనలు కనిపించడం లేదు.