Share News

ఖరీఫ్‌ కష్టం.. రబీ జాప్యం

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:46 AM

మొంథా తుఫాన్‌ జిల్లాలో వ్యవసాయ రంగంపై తీవ్రప్రభావాన్ని చూపింది. కీలక సమయంలో కురిసిన అతి భారీ వర్షాలు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను దెబ్బతీశాయి. రబీ పంటల సాగు కూడా ఆలస్యం కానుంది. పశ్చిమ ప్రాంతంలో పత్తి, మిర్చి, సజ్జ, కంది, వరి ఇలా పొలంలో ఉన్న ప్రతి పంటా దెబ్బతిని ఏదో ఒక స్థాయిలో నష్టం వాటిల్లింది.

ఖరీఫ్‌ కష్టం.. రబీ జాప్యం
తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉప్పుగుండూరు వద్ద చెరువును తలపిస్తున్న పొలాలు (ఫైల్‌)

వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిన మొంథా తుఫాన్‌

కీలక సమయంలో దెబ్బతీసిన భారీ వర్షాలు

పశ్చిమాన పత్తి, సజ్జ, వరి, మిర్చిలకు నష్టం

పంట పొలాల్లో పెరుగుతున్న కలుపు

రబీ ప్రధాన పైర్ల సాగుకు అదును దాటే పరిస్థితి

మొంథా తుఫాన్‌ జిల్లాలో వ్యవసాయ రంగంపై తీవ్రప్రభావాన్ని చూపింది. కీలక సమయంలో కురిసిన అతి భారీ వర్షాలు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను దెబ్బతీశాయి. రబీ పంటల సాగు కూడా ఆలస్యం కానుంది. పశ్చిమ ప్రాంతంలో పత్తి, మిర్చి, సజ్జ, కంది, వరి ఇలా పొలంలో ఉన్న ప్రతి పంటా దెబ్బతిని ఏదో ఒక స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇక ముమ్మరంగా రబీ పంటలు సాగు చేసే సమయంలో కుంభవృష్టి వానలు పడటంతో అత్యధిక ప్రాంతాలలో మరో పక్షం రోజులపాటు పొలాల్లోకి వెళ్లి సేద్యం చేసే అవకాశం లేదు. దీంతో సాగు ఆలస్యం కానుంది. అదును దాటిపోతుందేమోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

ఒంగోలు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌ వ్యవసాయంపై తీవ్రంగా ఉంది. ఖరీఫ్‌ పంటలు భారీగా దెబ్బతినగా, రబీ సాగు ఆలస్యం కానుంది. జూన్‌ నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు ఖరీఫ్‌ సీజన్‌గా... అక్టోబరు నుంచి రబీ సీజన్‌గా పరిణిస్తారు. జిల్లాలో అక్టోబరు తొలిపక్షంలో వేసే పంటలను కూడా ఖరీఫ్‌ సీజన్‌గానే లెక్కిస్తున్నారు ఖరీఫ్‌లో జిల్లాలో వ్యవసాయశాఖ పరిధిలో లక్షా 29వేల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేస్తారు. అలాగే ఉద్యాన శాఖ పరిధిలో మరో 20వేల హెక్టార్లలో మిర్చి, కూరగాయలు, ఇతరత్రా సాగవుతాయి. ఈ ఏడాది దాదాపు లక్షా 24వేల హెక్టార్లలో వ్యవసాయశాఖ పరిధిలో, 15వేల హెక్టా ర్లలో ఉద్యానశాఖ పరిధిలో పంటలు వేశారు. ప్రధానంగా కంది, పత్తి, వరి, సజ్జ, మొక్కజొన్న, బర్లీ పొగాకు, మిర్చి తదిత రాలు సాగు చేశారు. ఆ పంటల్లో అధిక శాతం పూత, పిందె, కోత దశలకు చేరా యి. కొంత విస్తీర్ణంలో ఎదుగుదల దశలో ఉన్నాయి. అక్టోబరు నెల ఖరీఫ్‌ పంటలకు కీలక సమయం. మరోవైపు రబీ పైర్లలో అత్యధిక భాగం అక్టోబరు, నవంబరుల్లోనే వేస్తారు. పశ్చిమ ప్రాంతంలో పొగాకు, శనగ అధికభాగం అక్టోబరులోనే సాగు చేస్తారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో నవంబరు, డిసెంబరులలో వాటి సాగు చేపడతారు. అక్టోబరు, నవంబరుల్లో అన్ని ప్రాంతాల్లోనూ వరినాట్లు వేస్తారు. అలా అక్టోబరు రబీ పంటల సాగుకు కీలకం. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా తుఫాన్‌ విరుచుకుపడి జిల్లాను ముంచెత్తింది. కేవలం 36 గంటల వ్యవధిలో సగటున జిల్లాలో 18.40 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

నష్ట అంచనాల్లో అధికారులు

జిల్లాలో అక్టోబరులో సాధారణ వర్షపాతం 20.57 సెం.మీ కాగా ఏకంగా 49.96 సెం.మీ కురిసింది. పొన్నలూరు మండలంలో 25.02 సెం.మీ సాధారణ వర్షపాతం అయితే అక్కడ దాదాపు 70 సెం.మీ నమోదైంది. సంతనూతలపాడు, పీసీపల్లి పామూరు, ఒంగోలు, మర్రిపూడి, కొత్తపట్నం, కొండపి, కనిగిరి, చీమకుర్తి, సీఎస్‌పురం, మద్దిపాడు, ఎన్‌జీపాడు, పొదిలి, సింగరాయకొండ, టంగుటూరు తదితర మండలాల్లో 40 నుంచి 65 సెం.మీ వరకు కురిసింది. మిగతా మండలాల్లోనూ 30 నుంచి 40సెం.మీ పడింది. ఇలా సాధారణం కన్నా పలుచోట్ల అధికంగా ఈ నెలలో కురవడం, అందులోనూ తుఫాన్‌ సమయంలో భారీ వర్షాలు ముంచెత్తడంతో పొలంలో ఉన్న ఖరీఫ్‌ పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు 40వేల హెక్టార్లలో పత్తి, మిర్చి, సజ్జ, కంది, వరి, పొగాకు, మొక్కజొన్న తదితర పంటలు నీట మునిగాయి. ఇంచుమించు 15వేల హెక్టార్లలో ఆ పంటలకు పూర్తిగా నష్టం జరిగినట్లు అధికార వర్గాలు అంచనా వేసి రైతువారీ నష్టాలపై ఎన్యుమరేషన్‌ చేస్తున్నారు.

పొగ నారుకు ఇక్కట్లే!

పశ్చిమ ప్రాంతంలో కనీసం పక్షం రోజులు, ఇతర ప్రాంతా ల్లో మూడు నుంచి నాలుగు వారాలపాటు భూములు ఆరే అవకాశం కనిపించడం లేదు. దీని వల్ల రబీలో కీలక పంట లైన శనగ, పొగాకు, మిర్చి, మినుము సాగు ఆలస్యం కానుం ది. ఒక్క వరి మినహా ఇతర ఏ పంటలను ప్రస్తుతం సాగు చేసే వీలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు నారు మడులు కూడా వర్షాలకు తుడిచి పెట్టుకుపోయాయి. కాస్తంత పొలం ఆరిన చోట పొగాకు సాగుకు మొక్కల కోసం రైతులు అవస్థ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

బురదమయంగా భూములు

తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలు చేతికొచ్చే అవకాశం లేదు. నీటిలో రెండు మూడు రోజులు ఉన్న ఇతర విస్తీర్ణంలోని పంటలు కోలుకుంటున్నప్పటికీ ఆ పంటల ఉత్పత్తులు గణనీయంగా తగ్గి రైతులు భారీగా నష్టపోనున్నారు. మరోవైపు తుఫాన్‌ వల్ల కురిసిన భారీ వర్షాల ప్రభావం రబీ సాగుపైనా తీవ్రంగా చూపనుంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో శనగ, పొగాకు, మిర్చి వంటి పంటలను అక్టోబరులో ముమ్మరంగా వేస్తారు. అలాగే తూర్పు ప్రాంతంలో కాస్తంత ఆలస్యంగా వేసే ఆ పంటలకు భూములు సిద్ధం చేసే పని ఆ సమయంలో జోరుగా సాగుతుంది. అయితే అక్టోబరు 20 నుంచి వర్షాలు ప్రారంభమై తుఫాన్‌ సమయంలో ముంచెత్తడంతో పొలాల్లో భారీగా వర్షపు నీరు పారి బురదమయంగా మారాయి. అవి పూర్తిగా ఆరి సేద్యం చేస్తే తప్ప పంటలు వేసే అవకాశం లేదు.

Updated Date - Nov 04 , 2025 | 12:46 AM