Share News

డీఎల్‌డీవోలకు కీలక బాధ్యతలు

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:17 PM

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో కీలకమైన పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీనియర్‌ ఎంపీడీవోలకు రాష్ట్రవ్యాప్తంగా డివిజనల్‌ స్థాయి అభివృద్ధి అధికారులు(డీఎల్‌డీవో)గా ఉద్యోగోన్నతులు కల్పించారు. ప్రమోషన్లు వచ్చినా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. డి

డీఎల్‌డీవోలకు కీలక బాధ్యతలు

గత వైసీపీ హయాంలో ఉత్సవ విగ్రహాల్లా..

టీడీపీ ప్రభుత్వం వచ్చాక గుర్తింపు..

ఉత్తర్వులు జారీ

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో కీలకమైన పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీనియర్‌ ఎంపీడీవోలకు రాష్ట్రవ్యాప్తంగా డివిజనల్‌ స్థాయి అభివృద్ధి అధికారులు(డీఎల్‌డీవో)గా ఉద్యోగోన్నతులు కల్పించారు. ప్రమోషన్లు వచ్చినా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. డివిజనల్‌ కేంద్ర పోస్టుల్లో నియమించినా ఎటువంటి పనులు లేవు. జిల్లా కేంద్రంలో పనిచేసే డీఎల్‌డీవోలకు మాత్రం కలెక్టరేట్‌లో అప్పగించిన పనులు మాత్రమే చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం డీఎల్‌డీవోలకు ఏయే బాధ్యతలను అప్పగించాలో విస్తృత కసరత్తు చేసింది.

రెవెన్యూ వ్యవస్థ తరహాలోనే..

రెవెన్యూ వ్యవస్థ తరహాలో డివిజనల్‌ వ్యవస్థ పంచాయతీరాజ్‌లో ఉండేది కాదు. ఇక నుంచి డివిజనల్‌ స్థాయిలో కూడా అభివృద్ధి పనుల పర్యవేక్షణకు డీఎల్‌డీవోలకు మరిన్ని అధికారులను కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఒంగోలు, కనిగిరి, మార్కాపురంలు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో డీఎల్‌డీవో కార్యాలయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఎల్‌డీవోలకు జాబ్‌చార్టును కూడా రూపొందించారు. డీఎల్‌డీవో పరిధిలోకి ఎంపీడీవోలు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, డ్వామా ఏపీడీలను తీసుకురానున్నారు. మండల పరిషత్‌లలో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటు ఉపాధి హామీ పథకం కింద జరిగే పనులను కూడా పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించారు.

ఎన్నికల అథారిటీ కూడా వారికే

ఇప్పటివరకు జిల్లా ఎన్నికల అథారిటీలుగా ఆర్డీవోలు వ్యవహరిస్తుండగా ఇకపై ఆ విధులను డీఎల్‌డీవోలకు అప్పగించారు. పంచాయతీల్లో ఆడిట్‌ అభ్యంతరాలతోపాటు పన్నులు, వివిధ రకాల రుసుముల వసూళ్లు పెరిగేలా డీఎల్‌డీవోలు చర్యలు తీసుకోనున్నారు. గ్రామ సచివాలయాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా, తదితర అంశాలతో సమన్వయం చేస్తారు.

Updated Date - Jun 15 , 2025 | 11:17 PM