Share News

మహానాడు నిర్వహణలో కీలక బాధ్యతలు

ABN , Publish Date - May 21 , 2025 | 01:07 AM

టీడీపీ మహానాడు నిర్వహణలో జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. ఈనెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు కడప నగర శివారులో మహానాడు జరగనుంది. దానిని భారీగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించి తదనుగుణ ఏర్పాట్లు అధిష్ఠానం పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

మహానాడు నిర్వహణలో కీలక బాధ్యతలు

పలు కమిటీల్లో జిల్లా నేతలకు స్థానం

మంత్రి స్వామి కన్వీనర్‌గా రక్తదాన, మెడికల్‌ క్యాంపు కమిటీ

ఒంగోలు మే 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ మహానాడు నిర్వహణలో జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. ఈనెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు కడప నగర శివారులో మహానాడు జరగనుంది. దానిని భారీగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించి తదనుగుణ ఏర్పాట్లు అధిష్ఠానం పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈక్రమంలో మహానాడు విజయవంతం కోసం 19 కమిటీలను ఏర్పాటు చేశారు. వాటిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నేతలను నియమించారు. అందులో పలు కమిటీల్లో జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు ఉన్నారు. ఒక్కో కమిటీకి ఒక రాష్ట్ర స్థాయి ముఖ్య నేత కన్వీనర్‌గా, అవసరాన్ని బట్టి ఒకరిద్దరు కోకన్వీనర్‌లుగా.. పలు వురు నాయకులను సభ్యులుగా నియమించారు. అందులో వైద్యులు ప్రధానంగా నడిపించే రక్తదాన, మెడికల్‌ క్యాంపుల కమిటీకి కన్వీనర్‌గా జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి వ్యవహరించనున్నారు. అందులో సభ్యులుగా వైద్యులైన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మిని సభ్యులుగా నియమించారు. అత్యంత కీలకమైన తీర్మానాల కమిటీలోనూ మంత్రి డాక్టర్‌ స్వామికి చోటు కల్పించారు. మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కన్వీనర్‌గా ఉన్న వసతి ఏర్పాట్ల కమిటీకి జిల్లాకు చెందిన యువ నేత, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణను కోకన్వీనర్‌గా నియమించారు. అలాగే భోజనాల ఏర్పాట్ల కమిటీలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మరో ప్రధానమైన ఆర్థిక వనరుల కమిటీలో సభ్యునిగా నియమించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కన్వీనర్‌గా జన సమీకరణ కమిటీ ఏర్పాటు చేయగా అందులో సభ్యులుగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ముత్తుముల అశోక్‌రెడ్డి ఉన్నారు. సాంస్కృతిక వ్యవహారాల కమిటీలో ఒంగోలుకు చెందిన రాష్ట్ర కల్చరల్‌ కమిషన్‌ చైర్మన్‌ పొడపాటి తేజశ్వనిని నియమించారు. ఆయా కమిటీ సభ్యులు అన్ని జిల్లాల పార్టీ నేతలతో సమన్వయం చేసుకొని మహానాడు విజయవంతానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు.

23న ఒంగోలులో టీడీపీ జిల్లా మహానాడు

టీడీపీ జిల్లా మహానాడును ఈనెల 23న ఒంగోలులోని త్రోవగుంట సమీపంలో ఉన్న బృందావన్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే మహానాడుకు ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు జిల్లాకి చెందిన మంత్రి,ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, డైరెక్టర్‌లు హాజరవుతారన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బాలాజీ కోరారు.

Updated Date - May 21 , 2025 | 01:07 AM