కారుమంచి మేజర్‌ను నిర్మించాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:30 AM
చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలకు సాగు, తాగునీటిని అందించే కారుమంచి మేజర్ కాలువను వెంటనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మధుకాన్ గ్రానైట్ క్వారీ వద్ద కాలువ తెగిపోయినా పట్టించుకోలేదని వాపోయారు.
కలెక్టరేట్ ఎదుట ఆయకట్టు రైతుల ఆందోళన
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డామని ఆవేదన
ప్రస్తుత ఎమ్మెల్యే బీఎన్ చొరవతో రూ.2.63కోట్లు మంజూరు
పనులను గ్రానైట్ కంపెనీ వారు అడ్డుకుంటున్నారని ఆరోపణ
వెంటనే ప్రారంభించాలని డిమాండ్
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలకు సాగు, తాగునీటిని అందించే కారుమంచి మేజర్ కాలువను వెంటనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మధుకాన్ గ్రానైట్ క్వారీ వద్ద కాలువ తెగిపోయినా పట్టించుకోలేదని వాపోయారు. కారుమంచి మేజర్ పరిధిలోని గ్రామాల రైతులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. టీడీపీ చీమకుర్తి రూరల్ మండల అధ్యక్షుడు జి.రాఘవరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం ప్రసాద్, మాజీ డీసీ కాట్రగడ్డ రమణయ్య, చీమకుర్తి, కారుమంచి డీసీ అధ్యక్షుడు పాలడుగు వెంకటనారాయణ, మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. కారుమంచి కాలువ ద్వారా 20 గ్రామాలకు 30ఏళ్ల నుంచి సాగు, తాగునీరు అందుతుందన్నారు. రామతీర్థం జలాశయం నిర్మించిన తర్వాత ఆప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అయితే 2019లో కాలువ కట్ట మధుకాన్ గ్రానైట్ వద్ద తెగిపోయిందని తెలిపారు. దాని పక్కన తాత్కాలిక కాలువ నిర్మాణం చేశారన్నారు. ఆ కాలువ పరిధిలో 18వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 130 క్యూసెక్కుల నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే తాత్కాలిక కాలువ ద్వారా కేవలం 40 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతుండటంతో చివరి భూములు, గ్రామాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ ఏపీడీఎంఎఫ్ నుంచి రూ.2.63 కోట్లను మంజూరు చేయించారన్నారు. కానీ ఆ కాలువ నిర్మాణాన్ని మధుకాన్ గ్రానైట్ యాజమాన్యం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. కాలువ కింద ఉన్న రాళ్ల కోసం ఆ స్థలాన్ని తమకు కేటాయిస్తే కాలువ నిర్మాణం ల్యాండ్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొంచెం ముందు నుంచి తీస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాత డిజైన్ ప్రకారమే కాలువ నిర్మిస్తేనే ఆయా గ్రామాలకు నీళ్లు అందుతాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాఽధికారులు స్పందించి వెంటనే కాలువ నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కారుమంచి మేజర్ కర్షకుల కడగండ్లు కథనాన్ని రైతులు ధర్నాలో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆ ప్రాంత రైతులు కూనంనేని శ్రీను, కొల్లూరి వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీను, మద్దులూరి వీరయ్య, బొల్లినేని రామచంద్రరావు, బి.పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.