Share News

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

ABN , Publish Date - Nov 06 , 2025 | 01:03 AM

కార్తీక పౌర్ణమి సందర్భంగా చినకాశీగా పేరుగాంచిన మణికేశ్వరానికి బుధవారం భక్తులు పోటెత్తారు.

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

అద్దంకి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా చినకాశీగా పేరుగాంచిన మణికేశ్వరానికి బుధవారం భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూరాని విధంగా భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు కార్తీకదీపాలు వెలిగించుకొని మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్ధీ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు భక్తులు బారులుతీరి స్వామి వారిని దర్శించు కున్నారు. సాయంత్రం దేవాలయంలో దీపోత్సవము వైభవంగా నిర్వహించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో నీరు నిండుగా ఉండడం, ఇటీవల వరదల నేపథ్యంలో భధ్రతా చర్యలలో భాగంగా దేవాలయం పక్కనే ఉన్న గుండ్లకమ్మ నదిలోని స్నానాలఘాట్‌లను మూసి వేశారు. కొద్దిమంది మహిళలు మాత్రం సమీపంలో గుండ్లకమ్మ నదిలో కార్తీక దీపాలను వదిలారు. దేవ స్థానం ఈవో గుంటుపల్లి వాసుబాబు, సీఐ సుబ్బరాజుల ఆధ్వర్యంలో దేవాలయం వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. అద్దంకి పట్టణంలోని పాత శివాలయం, వేయిస్తంభాలగుడి, కమఠేశ్వరాలయంలలో భక్తులు పెద్దసంఖ్యలో పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించారు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

బల్లికురవ : మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న ప్రసిద్ధ బ్రహ్మకుండం కొలనులో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తులు కార్తీక స్నానాలు చేశారు. సామన్యశకం 11 వ శతాబ్ధపు నాటి కాలం నుంచి ఉన్న బ్రహ్మకుండంలో స్నానాలు చేస్తే పాపాలు హరించుకుపోతాయని ప్రజలకు ఆపార నమ్మకం ఉంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు వాహనాలను ఏర్పాటు చేసుకుని బుదవారం తెల్లవారు జాము నుండే బ్రహ్మకుండం వద్దకు చేరుకొని స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. వేల మంది భక్తులు స్నానాలనకు రావడంతో బ్రహ్మకుండం పోటేత్తింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా గ్రామస్ధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు కొలనులో స్నానాలు చేయగానే పక్కనే కుళాయిల ద్వారా కూడా నీటిని అందుబాటులో ఉంచారు. అలానే గ్రామంలో ఉన్న భవాని శంకర స్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్ధులు సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వల్లాపల్లి గ్రామం వద్ద ఉన్న అడవి పేరాంటలమ్మ దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బల్లికురవ గ్రామానికి చెందిన చిన్నారులు కోలాట ప్రదర్శన ప్రజలను ఆకట్టుకొంది. కార్తీక పౌర్ణమి సందర్బంగా పలు గ్రామాలకు చెందిన భక్తులు శ్రీశైలం, కొటప్పకొండలకు బారీగా తరలి వెళ్లారు.

సంతమాగులూరు : కార్తీక పౌర్ణమి పురస్కరించు కొని బుధవారం కొప్పరం గ్రామంలో వేంచేసిన శ్రీ బాల త్రిపురసుందరి త్రిపురాంతకేశ్వర స్వామి వారికి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారికి విశేష అభిషేకాలు చేశారు.

శింగరకొండలో లక్ష తమలపాకుల పూజ

అద్దంకి : శింగరకొండలో పౌర్ణమి సందర్భంగా బుధవారం లక్ష తమలపాకుల పూజ వైభవంగా నిర్వహించారు. వేదపండితులు, పూజారులు లక్ష తమలపాకులతో విశేషంగా అలంకరించారు. ఉభయ దాతలుగా కొల్లూరుకు చెందిన సమ్మెట వెంకటసాయి శ్రీహర్ష, విమలాదేవి దంపతులు వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసిస్టెంట్‌ కమిష నర్‌ తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చుండూరి మురళీసుధాకరరావులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

పర్చూరు/ కారంచేడు : కార్తీక పౌర్ణమి వేడుకలను పర్చూరు, కారంచేడు మండలాల్లోని ఆయా గ్రామాల్లో భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువ జామునుండే ఆయా శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివార్ల భక్తిని చాటుకున్నారు. పర్చూరులోని భీమేశ్వరస్వామి, ఉప్పుటూరులోని అమరేశ్వరస్వామి, నూతలపాడులోని శివాలయం, నాగులపాలెంలోని నాగేశ్వరస్వామి ఆలయంతోపాటు, చెరుకూరు గ్రామంలోని అగస్తేశ్వర స్వామివార్ల ఆలయంలో కార్తీకపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవాదాయశాఖ అధికారి దామా నాగేశ్వరరావు సారధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పర్చూరులోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన దీపోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పెద్దఎత్తున ఆలయ ప్రాంగణంలో అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయా ఆలయా లను విద్యుత్‌ దీపాలతో ఘనంగా అలంకరించారు. అదేవిధంగా మండలంలోని అడుసుమల్లి గ్రామంలోని గౌరీ శంకర ఆలయంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు.

మార్టూరు : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి మార్టూరు సమీపంలోని అమరావతి నూలుమిల్లు ఎదురుగా ఉన్న నాగార్పమ్మ దేవాలయంలో 50 కిలోలు కర్పూరంతో అఖండ కర్పూరపు జ్యోతిని వెలిగించారు. భక్తులు జ్యోతిని దర్శించుకొని పులకించారు. మార్టూరు గ్రామానికి చెందిన వసంతరావు ఆర్ధిక సహకారం అందించగా కర్పూరపుజ్యోతిని అర్చకులు వెలిగించారు. మార్టూరు, జొన్నతాళి, ఇసుకదర్శి గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకొని కర్పూరపు జ్యోతిని తిలకించారు. అనంతరం భక్తులకు కమిటి సభ్యులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఇంకొల్లు : కార్తీక పౌర్ణమి సందర్భంగా మండలం లోని శివాలయాల్లో భక్తులు బారులుతీరారు. బ్రహ్మముహుర్తంలో వేకుమజామున పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆయా ఆలయాల్లో అనంతరం కార్తీక దీపాలు వెలిగించారు. శివుడికి అహాషేకాలు చేయించారు. ఇంకొల్లు శివాలయం మహిళలతో కిక్కిరిసింది. పూజారి సదాశివశాస్త్రి భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. అరుణాచల శివ అర్థఏకాహాం కార్యక్రమాన్ని సంకీర్తానాచార్యులు మద్దినేని ప్రతాప్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మిండాల నాగేశ్వరి, ఘంటా సుకన్య, నాదెండ్ల పార్ధసారధి, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా కార్తీక పౌర్ణమి

చినగంజాం : అత్యంత ప్రవితమైన కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. శైవక్షేత్రాలు ఓంకారనాథంతో మారుమోగాయి. కార్తీక దీపాలు వెలిగించి ముక్కంటి సేవలో తరించారు. మండల పరిధిలోని శివాలయాల లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శైవక్షేత్రాల వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొంథా తుఫాన్‌ కారణంగా సముద్రంలో గుంతలు ఏర్పడి ప్రమాదకర పరిస్థితులు ఉన్నందున మండల పరిధిలోని మోటుపల్లి, బాపయ్యనగర్‌, పల్లెపాలెం సముద్రతీర ప్రాంతాలను మూసివేశారు. తీరప్రాంతాల్లోని సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎవరు రాకుండా ఇంకొల్లు సీఐ వై.వీ.రమణయ్య ఆధ్వర్యంలో ఎస్‌.ఐ. శీలం రమేష్‌ పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Nov 06 , 2025 | 01:03 AM