Share News

నవజాత శిశువులకు ‘కంగారూ కేర్‌’

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:50 AM

నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో కీలక పరిణామం. తల్లి ఆరోగ్యంతోపాటు పసికందు ప్రాణాలు నిలబెట్టేందుకు వినూత్నమైన కేఎంసీ విధానంపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా దృష్టి సారించారు. కంగారు మదర్‌ కేర్‌ సెంటర్‌లతో మంచి ఫలితాలు లభిస్తుండటంతో జిల్లాలోనూ ఏర్పాటుకు శ్రీకారం పలికారు.

నవజాత శిశువులకు ‘కంగారూ కేర్‌’
ఒంగోలులోని జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కంగారూ మదర్‌కేర్‌ సెంటర్‌

తక్కువ బరువుతో పుట్టిన పసికందుల ప్రాణాలు నిలబెట్టే వినూత్న విధానం

కేఎంసీతో ఆరోగ్య సంరక్షణ

ఎమ్మెల్యే ‘ఉగ్ర’ సొంత నిధులతో కనిగిరిలో ఏర్పాటు

కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధతో ఒంగోలు జీజీహెచ్‌లోనూ కేంద్రం

రెండు చోట్లా నేడు ప్రారంభం

త్వరలో మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు

నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో కీలక పరిణామం. తల్లి ఆరోగ్యంతోపాటు పసికందు ప్రాణాలు నిలబెట్టేందుకు వినూత్నమైన కేఎంసీ విధానంపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా దృష్టి సారించారు. కంగారు మదర్‌ కేర్‌ సెంటర్‌లతో మంచి ఫలితాలు లభిస్తుండటంతో జిల్లాలోనూ ఏర్పాటుకు శ్రీకారం పలికారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ర్టాలలో ఆ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆ విధానాన్ని జిల్లాలోనూ అమలు చేయాలని కలెక్టర్‌ భావించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డికి తెలియజేయగా ఆయన కనిగిరిలో ఏర్పా టుకు ముందుకొచ్చారు. కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధతో ఒంగోలులోనూ పనులు పూర్తి చేశారు. బుధవారం రెండు చోట్లా వీటిని ప్రారంభించనున్నారు.

ఒంగోలు, కార్పొరేషన్‌, జూన్‌ 10 (ఆంధ్ర జ్యోతి) : తక్కువ బరువుతో పుట్టిన, నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు భరోసా దక్కింది. తల్లి స్పర్శతో మరింత ఎదుగుదల, పుట్టినప్పటి నుంచే తల్లితో అనుబంధాన్ని పెంచే వినూత్నవిధా నాన్ని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈమేరకు జిల్లాలోకంగారూ మదర్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు విషయాన్ని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయనకనిగిరిలో ఏర్పాటుకు అంగీకరించడంతోపాటు తన సొంత నిధులు వెచ్చించి కేఎంసీని ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోనూ మరోకేంద్రం ఉండేలా దృష్టిసారించిన కలెక్టర్‌ స్థానిక జీజీహెచ్‌లో ఏర్పాట్లు చేయించారు.

కంగారూ మదర్‌ కేర్‌ అంటే?

‘కంగారూ మదర్‌ కేర్‌’ అనే పదం అస్ర్టేలియాలోని కంగారు జంతువు నుంచి తీసుకున్నారు. అది తన బిడ్డను శరీరంలో ఒక సంచిలా ఉండే దానిలోనే భద్రం చేసి సంరక్షించుకుంటుంది. ఆ విధానమే ఈ కంగారూ మదర్‌ కేర్‌ సెంటర్‌. తల్లి చాతికి హత్తుకునేలా చిన్నారిని పడుకోబె డతారు. అలా బిడ్డకు తల్లి స్పర్శను పుట్టినప్పటి నుంచే తెలియజేస్తారు. సాధారణంగా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, నెలల నిండకుండానే జన్మించిన చిన్నారులను ఇంక్యుబేటర్‌లో పెడుతుంటారు. కాగా కేఎంసీ విధానంతో తల్లి నిత్య స్పర్శతో పిల్లల శరీరం వెచ్చగా ఉండటంతోపాటు, వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంగారూ కేర్‌ వల్ల తల్లి పాలు కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

నేడు కనిగిరి, ఒంగోలులో ప్రారంభం

తొలిసారిగా కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి, ఒంగోలులోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌)లో కేఎంసీలను మంగళవారం ప్రారంభించనున్నారు. కనిగిరిలో కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తన సొంత నిధులు వెచ్చించారు. ఒంగోలు జీజీహెచ్‌లో కేఎంసీ ఏర్పాటుకు ఆరోగ్యశ్రీ నిధులను ఖర్చు చేశారు. కనిగిరిలో కేంద్రాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి స్వామి, కలెక్టర్‌ అన్సారియా, ఎమ్మెల్యే ఉగ్ర ప్రారంభించనున్నారు. ఒంగోలు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మధ్యాహ్నం 4.00 గంటలకు మంత్రి, కలెక్టర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రారంభిస్తారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తన సొంత నియోజకవర్గంలోని కొండపి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కేఎంసీ ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇది అక్కడ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎర్రగొండపాలెం ఏరియా ఆసుపత్రి, దోర్నాలలోనూ ఏర్పాటు దిశగా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు.

Updated Date - Jun 11 , 2025 | 01:50 AM