Share News

అమ్మకు న్యాయం చేశారు!

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:29 AM

తల్లి జీవించి ఉండగానే మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రం పొంది ఆమె పేరుతో ఉన్న భూమిని థర్డ్‌ పార్టీకి కుమారుడు విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న అంతా నిజమేనని తేల్చి అక్రమార్కులపై చర్యలకు ఆదేశించారు.

అమ్మకు న్యాయం చేశారు!
రిజిస్ట్రేషన్‌ రద్దు పత్రాన్ని రమాదేవికి అందజేస్తున్న ఆర్డీవో లక్ష్మీప్రసన్న

భూమి కోసం తల్లి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం

తర్వాత థర్డ్‌ పార్టీకి రిజిస్ట్రేషన్‌ చేసిన కుమారుడు

న్యాయం చేయాలని ‘మీకోసం’లో వృద్ధురాలి వేడుకోలు

విచారణ చేసిన ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న

అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు

డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన అధికారులపై చర్యలకు సిఫార్సు

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తల్లి జీవించి ఉండగానే మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రం పొంది ఆమె పేరుతో ఉన్న భూమిని థర్డ్‌ పార్టీకి కుమారుడు విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న అంతా నిజమేనని తేల్చి అక్రమార్కులపై చర్యలకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామానికి చెందిన విప్పల రమాదేవి గుంటూరు పట్టణంలోని అనురాగ్‌ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. రమాదేవి భర్త పెద్ద వెంకిరెడ్డి (లేటు) రిజిస్టర్‌ సెటిల్‌మెంట్‌ దస్తావేజు ద్వారా 155/1 సర్వే నెంబరులోని 1.96 ఎకరాల భూమి ఆమెకు వచ్చింది. రెవెన్యూ రికార్డులు కూడా రమాదేవి పేరుతోనే ఉన్నాయి. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె మరణించారు. రమాదేవికి 85ఏళ్లు. కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి, కుమార్తె వనుకూరి సుబ్బరావమ్మలు పట్టించుకోకపోవడంతో ఆమె పెద్ద కుమార్తె అంజమ్మ కూతురు రెడ్డెం శివపార్వతి సంరక్షణలో ఉంది. ఆర్థిక ఇబ్బందులు రావడంతో అమ్మమ్మను గుంటూరులోని అనురాగ్‌ వృద్ధాశ్రమంలో ఉంచి శివపార్వతి చికిత్సలు చేయిస్తున్నారు. అయితే రమాదేవి గ్రామంలో లేకపోవడంతో కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి భూమిని అక్రమంగా పొందాలనే ఉద్దేశంతో ఎత్తుగడ వేశాడు. రెవెన్యూ అధికారులతో లాలూచీపడి రమాదేవి మరణించినట్లుగా తప్పుడు పత్రాలతో భూమిని తన పేరుపై మార్పించుకొన్నాడు. అనంతరం థర్డ్‌ పార్టీ అయిన నాగిరెడ్డికి విక్రయించారు. గత ఏడాది డిసెంబరు 21న దర్శి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశాడు. కొనుగోలు చేసిన నాగిరెడ్డి ఆ భూమిని తన పేరుతో మార్పించుకున్నారు. అయితే తాను మరణించినట్లుగా సర్టిఫికెట్‌ సృష్టించి తన ప్రమేయం లేకుండా భూమిని విక్రయించారని సీనియర్‌ సిటిజన్‌ కింద ‘మీకోసం’లో రమాదేవి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో ఆర్డీవో లక్ష్మీప్రసన్న సమగ్ర విచారణ చేశారు. అయితే రమాదేవి కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి తండ్రి ఇచ్చిన ఆరు ఎకరాలతోపాటు తన తల్లి పేరుతో ఉన్న 1.96 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించినట్లుగా ఆర్డీవో వద్ద అంగీకరించారు. రమాదేవి వృద్ధాశ్రమంలో చేరిన నాటి నుంచి ఖర్చు రెడ్డం శివపార్వతియే భరిస్తుందని ఆ విచారణలో గుర్తించారు. అక్రమంగా చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తన తల్లి జీవనోపాధికి ప్రతినెలా రూ.30వేలు తన తమ్ముడు చెల్లించే విధంగా చూడాలని రమాదేవి మరో కుమార్తె సుబ్బరావమ్మ ఆర్డీవో దృష్టికి తెచ్చారు. తన తల్లి రమాదేవి ఆమెకు ఇష్టం ఉన్నచోట ఉండేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆర్డీవోకు రాతపూర్వకంగా ఇచ్చారు. వీటన్నింటిపై విచారణ చేసిన ఆర్డీవో లక్ష్మీప్రసన్న థర్డ్‌ పార్టీకి చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేశారు. అందుకు సంబంధించిన పత్రాన్ని సోమవారం ఆమెకు అందజేశారు. రమాదేవి మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన రెవెన్యూ అధికారులపై చర్యలకు సిఫార్సు చేశారు.

Updated Date - Dec 23 , 2025 | 01:29 AM