వదిలేశారంతే!
ABN , Publish Date - Nov 23 , 2025 | 02:54 AM
పంచాయతీలలో నిధుల దుర్వినియోగంపై విచారణలు అటకెక్కాయి. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు. విచ్చలవిడిగా ప్రజా సొమ్మును డ్రా చేసుకుని స్వాహా చేస్తూనే ఉన్నారు.
పంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై అటకెక్కిన విచారణలు
గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా దోపిడీ
ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తున్న అధికారులు
కోర్టుకెళ్లి ఉపశమనం పొందుతున్న అక్రమార్కులు
పంచాయతీలలో నిధుల దుర్వినియోగంపై విచారణలు అటకెక్కాయి. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు. విచ్చలవిడిగా ప్రజా సొమ్మును డ్రా చేసుకుని స్వాహా చేస్తూనే ఉన్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఘటనలకు సంబంధించి కూడా అధికారులు నిగ్గుతేల్చకుండా నాన్చుతుండటంతో అవినీతి సర్పంచ్‌లు, అధికారులు మరింత బరితెగిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది విచారణాధికారులు బదిలీపై వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన వారు వాస్తవాలను తేల్చకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దర్శి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై విచారణలుఅడుగు ముందుకు పడటం లేదు. విచారణాధికారులు ఉద్దేశపూర్వకంగా అక్రమాలను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో అనేక పంచాయతీల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు అడ్డగోలుగా నిధులు దుర్వినియోగం చేశారు. అప్పటి వైసీపీ నాయకుల సహకారంతో పనులు చేయకుండా డ్రాచేసి పంచుకున్నారు. కొన్నిచోట్ల పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్‌లే నిధులు మింగేశారు. వీటిపై విచారణ చేస్తున్న అధికారులు తేల్చకుండా నాన్చుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొన్న అవినీతి సర్పంచ్‌లు, పంచాయతీ అధికారులు తప్పులు బయటపడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో రికార్డుల్లో లెక్కలు మార్చి ఏమీ జరగనట్లు చూపుతున్నారు. కొంతమంది కోర్టులకు వెళ్లి ఉపశమనం పొందుతున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విచారణ అడుగు ముందుకు పడటం లేదు.
విచారణాధికారుల ఉదాసీనత
దర్శి మండలంలోని రాజంపల్లి, తూర్పువెంకటాపురం పంచాయతీల్లో నిధులు దుర్వినియోగమైనట్లు మూడేళ్ల క్రితమే ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రాజంపల్లి పంచాయతీలో రూ.28లక్షలు దుర్వినియోగమైనట్టు నిగ్గుతేల్చి చెక్ పవర్ రద్దు చేశారు. ఆతర్వాత ఉత్తర్వుల్లో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని వారే మళ్లీ కొనసాగుతున్నారు. తూర్పువెంకటాపురంలో రూ.25లక్షలు నిధులు దుర్వినియోగమయ్యాయని గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థులు జిల్లా అధికారులకు ఫిర్యాదుచేయగా విచారణాధికారిని నియమించారు. ఆ పంచాయతీలో విచారణ చేసిన అప్పటి డీఎల్‌పీవో ఏమీ తేల్చకుండానే బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి అధికారుల సహకారంతో రికార్డులు క్రమబద్ధీకరించుకొని చక్కబెట్టుకున్నారు.
పంచాయతీ కార్యదర్శి చేతివాటం
గత వైసీపీ ప్రభుత్వంలో సామంతపూడి, జముకులదిన్నె, త్రిపురసుందరీపురం, తూర్పుచౌటపాలెం తదితర పంచాయతీల్లో చేపల పాటల ద్వారా వచ్చిన సొమ్మును, ఆర్థిక సంఘం నిధులను యథేచ్ఛగా బొక్కేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక పంచాయతీ కార్యదర్శిని నిధులు ఉన్న పంచాయతీలకు ఇన్‌చార్జ్‌గా నియమించి వాటిని డ్రా చేయించి స్వాహా చేయించారు. అనంతరం పంచుకున్నారు. గ్రామస్థులు లబోదిబోమన్నా ఫలితం లేకుండాపోయింది. ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటారని భావించినప్పటికీ నాయకుల అండదండలతో బయట మండలాలకు బదిలీ చేయించుకొని ఆ ఉద్యోగి వెళ్లిపోయారు.
అవినీతి ఇలా..
తాళ్లూరు మండలం విఠలాపురంలో రూ.58లక్షలు దుర్వినియోగమైనట్లు అధికారులు తేల్చారు. ఆ పంచాయతీలో పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్ నిధులు డ్రా చేసుకున్నారన్న విషయం బయటపడటంతో చెక్‌పవర్‌ను రద్దు చేశారు. సంబంధిత సర్పంచ్‌కు నోటీసులు ఇవ్వకుండా అధికారులు చెక్‌పవర్ రద్దు చేయడంతో కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరించి అక్రమార్కులకు సహకరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ుఽ ముండ్లమూరు మండలంలోని సింగన్నపాలెం, పూరిమిట్ల పంచాయతీల్లో కూడా నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు ఇటీవల సింగన్నపాలెం సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేశారు. పూరిమెట్ల సర్పంచ్ అక్రమంగా నిధులు డ్రా చేసినట్లు నిర్ధారించి ఆయన చెక్‌పవర్‌ను గత సోమవారం రద్దు చేశారు.
ుఽ దొనకొండ పంచాయతీలో అక్రమాలు జరిగినట్టు గ్రామస్థుడు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణాధికారులు రికార్డులు పరిశీలించి తీసుకెళ్లారే గాని నేటికీ విషయాన్ని తేల్చలేదు.
ుఽ కురిచేడు పంచాయతీలో నిధులు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి డ్రా చేసినట్టు ఫిర్యాదులు అందడంతో అక్కడ విచారణ జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పంచాయతీల్లో జరిగిన అక్రమాలు నిగ్గుతేల్చే విధంగా విచారణ చేయించాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.