Share News

ఉల్లాసం.. ఉత్సాహం..!

ABN , Publish Date - Dec 16 , 2025 | 10:54 PM

తమ బిడ్డలు ప్రయోజకులు అయ్యారు అనే కొండంత ఆనందంలో తల్లిద్రండులు.. జీవన పోరాటంలో గెలిచి ఉద్యోగ నియామక పత్రాలు అందుకోబోతున్నామన్న ఉత్సాహంలో వారి పిల్లలు.. అంతాకలగలిపితే ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం అలుముకుంది. వీరంతా కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. వీరిలో దాదాపు సగం మందికి పైగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. డిగ్రీ, పీజీలు చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూ వదిలివేసి సమాజసేవ లక్ష్యంగా కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎన్నికయ్యారు.

ఉల్లాసం.. ఉత్సాహం..!

రక్షణ భటులు ఉద్యోగాలకు ఎంపిక

నియామక ఉత్తరం కోసం బయలుదేరిన యువత

కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లిన వైనం

ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసిన పోలీసు శాఖ

ఒంగోలు క్రైం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : తమ బిడ్డలు ప్రయోజకులు అయ్యారు అనే కొండంత ఆనందంలో తల్లిద్రండులు.. జీవన పోరాటంలో గెలిచి ఉద్యోగ నియామక పత్రాలు అందుకోబోతున్నామన్న ఉత్సాహంలో వారి పిల్లలు.. అంతాకలగలిపితే ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం అలుముకుంది. వీరంతా కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. వీరిలో దాదాపు సగం మందికి పైగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. డిగ్రీ, పీజీలు చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూ వదిలివేసి సమాజసేవ లక్ష్యంగా కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎన్నికయ్యారు.

జిల్లా నలుమూలల నుంచి కానిస్టేబుళ్లు ఎంపికైన వారితోపాటు వచ్చిన కుటుంబసభ్యులతో ఒంగోలులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ అంతా ఆనందోత్సాహం వెల్లివిరిసింది. మంగళవారం ఉదయం కానిస్టేబుళ్లుగా ఎంపికైన 281 మంది నియామకపత్రాలను అందుకునేందుకు సన్నద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మంగళగిరిలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లేందుకు సోమవారం రాత్రికే ఒంగోలు చేరుకున్నారు. వారికి ఎస్పీ వి.హర్షవర్ధనరాజు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టుదలతో ఉద్యోగం సాధించిన ఔన్నత్యం, కుటుంబం కోసం తనకు ఉద్యోగం అనే ధీమా, ప్రజల రక్షణ కోసం నేను సైతం అనే త్యాగనిరతి వారిలో కనిపించింది.

ఈనెల 22 నుంచి శిక్షణ

కానిస్టేబుళ్లుగా ఎంపికైన 281 మందిలో 88 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారు. అంతేకాక మరో 155మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరికి మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ నియమాక పత్రాలు అందజేశారు. ఈనెల 22వ తేదీ నుంచి వారికి కేటాయించిన జిల్లాలో శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రత్యేక బస్సుల్లో విజయవాడ తరలింపు

జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి 20 ప్రత్యేక బస్సులలో తరలించారు. ఎంపికైన కానిస్టేబుళ్లతో పాటు వారి తల్లిదండ్రులకు మంగళవారం ఉదయం అల్పాహారం పెట్టిన తరువాత మధ్యాహ్నభోజనం కోసం బాక్సులలో పులిహోర, పెరుగు అన్నం ఇచ్చి పంపించారు. ఈ ఏర్పాట్లన్నీ పోలీసు శాఖ తరఫున జరిగాయి. ఏర్పాట్లను మహిళ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ రమణకుమార్‌, ఒంగోలు డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు.


చిన్నతనం నుంచే కానిస్టేబుల్‌ కావాలనే కోరిక

ఎం.సత్యనారాయణ, బసవాపురం

చిన్నతనం నుంచే కానిస్టేబుల్‌ కావాలనే కోరికతో డిగ్రీ వరకు చదివా. చదువుతోపాటు దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకున్నా. నిత్యం కఠోర శ్రమ చేసి కానిస్టేబుల్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది.

డిగ్రీలో గోల్డ్‌ మెడల్‌ సాధించి...

బి.ఈశ్వరమ్మ, ఆలకూరపాడు, టంగుటూరు మండలం

డిగ్రీలో గోల్డ్‌ మెడల్‌ సాధించా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాస్తున్నా. ఇటీవల జరిగిన కానిస్టేబుల్‌ ఎంపికలో ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది.

సమాజ సేవ కోసం..

ఎం.అజయ్‌, బీటెక్‌

నా తండ్రి 25 ఏళ్లుగా పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు. ప్రజాప్రతినిధుల వద్ద రక్షక భటుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. నేను కూడా సమాజ సేవ చేయాలనే సంకల్పంతో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించా. నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజల మనన్నలు పొందుతా.

భర్త స్ఫూర్తితో కానిస్టేబుల్‌గా ఎంపిక

పి.వెంకటేశ్వరమ్మ, కొత్తపట్నం

ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్‌ అయిన నా భర్త ప్రస్తుతం సచివాలయంలో పనిచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఉద్యోగం సాధించాలని పట్టుదలతో స్వయంగా శిక్షణ పొంది ఉద్యోగం సాధించా. డిగ్రీ వరకు చదువుకున్న నేను గ్రూప్‌-1 అధికారి కావాలన్నదే లక్ష్యం. అందుకు కష్టపడతా.

Updated Date - Dec 16 , 2025 | 10:54 PM