Share News

సూపర్‌ హిట్‌ సభ ఏర్పాట్లలో ఉమ్మడి జిల్లా నేతలు

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:56 PM

అనంతపురంలో ఈనెల 10న టీడీపీ నిర్వహిస్తున్న సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌ సభ ఏర్పాట్లలో పలువురు ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు.

సూపర్‌ హిట్‌ సభ ఏర్పాట్లలో ఉమ్మడి జిల్లా నేతలు
పరిటాల ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తున్న ఉమ్మడి జిల్లా నేతలు

అనంతపురంలో మంత్రి గొట్టిపాటి మకాం

అక్కడే ఎమ్మెల్యేలు ఏలూరి, ఉగ్ర, మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య

ఒంగోలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : అనంతపురంలో ఈనెల 10న టీడీపీ నిర్వహిస్తున్న సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌ సభ ఏర్పాట్లలో పలువురు ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమం కోసం టీడీపీ ఎన్నికల ప్రణాళికలో సూపర్‌ సిక్స్‌ పేరుతో పథకాలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ఇచ్చిన ప్రధాన హామీలైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలకమైన వాటిని అమలు చేసింది. ఈనేపథ్యంలో సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌ పేరుతో విజయోత్సవ సభను భారీగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. అందుకు వేదికగా అనంతపురంను ఎంపిక చేసింది. ఈనెల 10న అక్కడ నిర్వహిస్తున్న సభకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులలు తరలిరానున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని దాదాపు ప్రధాన నియోజకవర్గాల నుంచి భారీ సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. మహానాడు స్థాయిలో ఈ సూపర్‌ హిట్‌ విజయోత్సవ సభను నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది.

ఏర్పాట్లలో కొందరు.. జన సమీకరణలో ఇంకొందరు..

రాష్ట్ర మంత్రి రవికుమార్‌, ఎమ్మెల్యేలు సాంబశివరావు, డాక్టర్‌ ఉగ్ర, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య తదితరులు రెండు రోజులుగా అనంతపురంలోనే మకాం వేశారు. కొందరు సభా ఏర్పాట్లు, మరికొందరు స్థానికంగా జన సమీకరణలో అక్కడి నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అనంతపురంలో ఈ ఏర్పాట్లలో ఉన్న ఉమ్మడి జిల్లా నేతలు ఆదివారం అక్కడికి సమీపంలోని వెంకటాపురం వెళ్లి దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. ఆయన నివాసానికి వెళ్లి రవీంద్ర సతీమణి, ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, యువనేత శ్రీరాములును కలిశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డితోపాటు పలువురు శాసనసభ్యులు, ముఖ్యనేతలు ఆదివారం రాత్రికి అనంతపురం చేరుకున్నారు. సోమవారం నుంచి వారు కూడా ఏర్పాట్లలో భాగస్వామ్యంకానున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 10:56 PM