పొగాకు సమాఖ్య పీఐసీ చైర్మన్‌గా జయంత్‌బాబు
ABN , Publish Date - Oct 23 , 2025 | 02:18 AM
ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (పొగాకు సమాఖ్య) పర్సన్ ఇన్‌చార్జి కమిటీ చైర్మన్‌గా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మండవ జయంత్‌బాబు నియమితులయ్యారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పొగాకు పండించే రైతులు వేలాది మంది సభ్యులుగా ఉండే పొగాకు సమాఖ్య ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగింది.
నిబద్ధతకు గుర్తింపు
ఒంగోలు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (పొగాకు సమాఖ్య) పర్సన్ ఇన్‌చార్జి కమిటీ చైర్మన్‌గా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మండవ జయంత్‌బాబు నియమితులయ్యారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పొగాకు పండించే రైతులు వేలాది మంది సభ్యులుగా ఉండే పొగాకు సమాఖ్య ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా పొగాకు అధికంగా పండే ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఒంగోలు కేంద్రంగా కార్యకలాపాలు కొనసా గుతున్నాయి. కాగా ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈక్రమంలో రైతుల్లో గుర్తింపు ఉన్న పొగాకు సమాఖ్య పీఐసీ కమిటీని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ చైర్మన్‌గా మద్దిపాడు మండలం బసవన్నపాలెంకు చెందిన మండవ జయంత్‌బాబును నియమించింది. సభ్యులుగా ఎన్‌జీపాడుకు చెందిన మాచవరపు జాన్, ఒంగోలు నగరపరిధిలోని త్రోవగుంటకు చెందిన కోమటినేని వీరభద్రరావులకు అవకాశం కల్పించింది. ఆమేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా యువకుడైన జయంత్‌బాబు ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మూడు పర్యాయాలు టీడీపీ మద్దిపాడు మండల అధ్యక్షుడుగా ఉన్న జయంత్‌బాబు పార్టీ అధికారం కోల్పోయి తీవ్రప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలోనూ నిబద్ధతతో పనిచేశారు. బసవన్నపాలెంకు చెందిన సీనియర్ నేత మద్దిపాడు ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ రంగారావు నుంచి రాజకీయ వారసత్వంగా వచ్చిన జయంత్‌బాబు 20ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తన నియామకానికి సహకరించిన ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్, మంత్రి డాక్టర్ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇతర నేతలకు జయంత్‌బాబు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.