జై చెన్నకేశవా..
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:51 PM
మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి పుష్కరిణిలో ఆదివారం రాత్రి క్షిరాబ్ధి ద్వాదిశి సందర్భంగా చెన్నకేశవస్వామికి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
వైభవంగా మార్కాపురంలో చెన్నుడి తెప్పోత్సవం
వైభవంగా కార్యక్రమం
మార్కాపురం వన్‌టౌన్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి పుష్కరిణిలో ఆదివారం రాత్రి క్షిరాబ్ధి ద్వాదిశి సందర్భంగా చెన్నకేశవస్వామికి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి ఉభయదేవేరులతో చెన్నకేశవస్వామి.. బాణసంచా కాల్పులు, మంగళ వాయిద్యాలు, భాజాభజంత్రీల నడుమ 4వ వార్డులోని పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేతుడై చెన్నయ్య ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై వేంచేశారు. వేదమంత్రాలు చదవి, హారతులు ఇచ్చి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. రంగనాయక అలంకారంలో చెన్నకేశవస్వామి పుష్కరిణిలో జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. 3 సార్లు పుష్కరిణిలో తెప్పను తిప్పారు. రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య కోనేటిలో విహరిస్తున్న చెన్నయ్యను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఈ సందర్భంగా చెన్నకేశవ నామస్మరణ మార్మోగిపోయింది. మహిళా భక్తులు కోలాటాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి, తెప్పోత్సవంలో శాశ్వత ఉభయదాతలు, కౌన్సిలర్ డాక్టరు చెప్పల్లి కనకదుర్గ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అగ్నిమాపక శాఖ, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.