జగన్ చెప్పాడు.. చేశామంతే!
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:29 AM
విపక్ష వైసీపీ వివాదాస్పదమైన నినాదంతో చేపట్టిన వెన్నుపోటు దినం ఉమ్మడి జిల్లాలో మొక్కుబడిగా సాగింది. ‘జగన్ చెప్పారు.. చేయక తప్పదు’ అన్నట్లు కొన్నిచోట్ల కార్యక్రమాలను నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో సర్వశక్తులొడ్డి పర్వాలేదనిపించారు.
నాయకులు తప్ప సామాన్యులు లేరు
కదలని వైసీపీ కార్యకర్తలు
పసలేని ప్రసంగాలతో తుస్
కందుకూరు, పర్చూరులో తోలారు
వెన్నుపోటు దినానికి స్పందన అంతంతే
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
విపక్ష వైసీపీ వివాదాస్పదమైన నినాదంతో చేపట్టిన వెన్నుపోటు దినం ఉమ్మడి జిల్లాలో మొక్కుబడిగా సాగింది. ‘జగన్ చెప్పారు.. చేయక తప్పదు’ అన్నట్లు కొన్నిచోట్ల కార్యక్రమాలను నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో సర్వశక్తులొడ్డి పర్వాలేదనిపించారు. ఆపార్టీ నాయకుల్లో కదలిక కనిపించినా చాలామంది కార్యకర్తలు, సామాన్య ప్రజలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తీవ్రంగా ప్రయత్నించి కార్యకర్తలను సమీకరించడం ద్వారా కందుకూరు, పర్చూరులో కార్యక్రమాలు ముందు వరుసలో ఉండగా, మిగిలిన చోట్ల సాదాసీదాగా జరిగాయి. రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడయ్యాయి. ఆ సందర్భంగా వెన్నుపోటు దినం పేరుతో బుధవారం నియోజకవర్గాల వారీ కార్యక్రమాల నిర్వహణకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఆ నినాదమే వివాదాస్పదంగా మారింది. అయినా నియోజకవర్గాల వారీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ రాష్ట్ర నేతలు.. జిల్లా, నియోజకవర్గాల నాయకులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. దీంతో వారం నుంచి ఆపార్టీ నాయకులంతా కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. నాయకులను కదిలించడం, కార్యకర్తల వద్దకు వెళ్లటం, ప్రజలను సమీకరించడానికి సర్వశక్తులొడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యక్రమానికి సామాన్య ప్రజలు దూరంగా ఉన్నారు. బుధవారం అన్ని చోట్లా జరిగిన కార్యక్రమాలను పరిశీలించగా ముఖ్యమైన నాయకులు, వారి మాట కాదనలేని ద్వితీయశ్రేణి నాయకులు మాత్రమే పాల్గొనడం కనిపించింది. వైసీపీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు విశ్వప్రయత్నం చేసినా నాయకులు సామాన్య కార్యకర్తలు కదలకపోవడం చర్చనీయాంశమైంది.
డబ్బు, వాహనాలతో సమీకరణ
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాలను పరిశీలిస్తే పర్చూరు, కందుకూరులో కాస్తంత ఎక్కువసంఖ్యలో ఆ పార్టీశ్రేణులు పాల్గొన్న దాఖలాలు కనిపించాయి. పర్చూరులో 350 నుంచి 400 మంది వరకు నిరసన ర్యాలీకి హాజరుకాగా, కందుకూరులో 500 మంది పాల్గొన్నారు. అయితే ఈ రెండుచోట్ల ఆ మాత్రం కార్యకర్తల సమీకరణకు బాగా కష్టపడ్డారు. వాహనాలు ఏర్పాటు చేయడం, భోజనాలు ఏర్పాటులాంటి అదనపు చర్యలు ఎక్కువగా కనిపించాయి. పర్చూరుకు కొత్తగా ఇన్‌చార్జి అయిన మధుసూదన్‌రెడ్డి ప్రత్యేక దృష్టితో ఏర్పాటు చేసుకున్నారు. కందుకూరు ఇన్‌చార్జి మధుసూదన్ యాదవ్ మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి సహకరించకపోయినా తనకు పట్టుందని నిరూపించుకునేందుకు సామ,దాన,భేద దండోపాయాలు ఉపయోగించి కార్యకర్తలను సమీకరించారు. కనిగిరిలో ర్యాలీకి కార్యకర్తల సమీకరణకు డబ్బులు పంపిణీ చేయడం విశేషం. మిగిలిన అన్ని ప్రాంతాలను పరిశీలిస్తే.. ఒక్కోచోట కనీసం 70 మంది నుంచి 250 మందికిలోపే కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు పాల్గొన్నట్లు వెల్లడైంది. ఆసలు ఈ కార్యక్రమ నిర్వహణ కరెక్టు కాదేమో.. నినాదం కూడా బాగా లేదేమో అన్న అనుమానాలను కార్యక్రమాల్లో పాల్గొన వైసీపీ శ్రేణులు వ్యక్తం చేయడం విశేషం.
హడావుడి కార్యక్రమం
కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేనలు బుధవారం సాయంత్రం విజయోత్సవ కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. అది ఆఖరు క్షణంలో హడావుడిగా పిలుపునివ్వడంతో అందుబాటులో లేక ఆ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎక్కువచోట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. నిర్వహించిన చోట స్థానికంగా ఉన్న కార్యకర్తలు కేక్‌లు కట్ చేయడం, బాణసంచాలు పేల్చడం వంటి మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించారు.