ఆర్టీసీ డిపోలను కుదవపెట్టి అప్పులు తెచ్చిన జగన్
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:19 PM
వైసీపీ పాలనలో ఆర్టీసీ సంస్థ అస్తవ్యస్తంగా మారి, అభివృద్ధికి నోచుకోలేదని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎస్.సురేష్ రెడ్డి విమర్శించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో మరుగుదొడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో సంస్థ అస్తవ్యస్తం
బస్‌లు డొక్కు అయినా స్పందన శూన్యం
మరో 950 కొత్త బస్‌లకు ప్రతిపాదనలు పంపాం
జోనల్ చైర్మన్ సురే్‌షరెడ్డి
మార్కాపురం వన్‌టౌన్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో ఆర్టీసీ సంస్థ అస్తవ్యస్తంగా మారి, అభివృద్ధికి నోచుకోలేదని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎస్.సురేష్ రెడ్డి విమర్శించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో మరుగుదొడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల పనితీరు, అధికారుల నిర్లక్ష్యంతోపాటు క్యాంటీన్‌లలో అధిక ధరలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప అభివృద్ధి అనేది లేదని చెప్పారు. చివరకు డిపోలను కూడా కుదవపెట్టి డబ్బులు తెచ్చారని విమర్శించారు. రోడ్లు సరిగా లేక బస్సులు దెబ్బతిన్నాయని, కార్మికులు తీవ్ర కష్టాలు పడ్డారని, చివరకు అనారోగ్యం బారినపడినా ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా జీతాలు చెల్లించలేని దుస్థితికి తీసుకొచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆర్టీసీ నష్టాలకు ముఖ్య కారణం డీజిల్ ధరలు పెరగడమేనని చెప్పారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీలో 2900 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. మరో 700 బస్సులు పట్టణాల్లో కేటాయిస్తామని, 3600 బస్సులను పాత వాటికి బదులు ఇచ్చామని చెప్పారు. మరో 950 కొత్త బస్సులకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఆర్టీసీ బస్టాండ్, డిపోలలో పరిశుభ్రత పెంచాలని అధికారులకు చెప్పారు. కాంట్రాక్టర్ల పనితీరు మెరుగపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విలువైన ఆర్టీసీ బస్టాండ్‌ల స్థలాలను కాపాడుతామని చెప్పారు. మార్కాపురం బస్టాండ్‌కు కాంపౌండ్ వాల్ నిర్మాణం, హైదరాబాద్, బెంగళూరు బస్సులు ఆగేచోట నూతన సీసీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తామన్నారు. బస్టాండ్‌లో ఆర్‌వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సంఘం నాయకులు ఆర్‌కేజే నరసింహం, నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యులు, మార్కాపురం నుంచి బెంగళూరుకు ఇంద్ర స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీశైలం నుంచి తిరుపతికి వెళ్లే బస్సులను మార్చాలని, మార్కాపురం నుంచి హైదరాబాద్‌కు ఉదయంపూట ఒక బస్సును ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ నరసింహులు, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు పాల్గొన్నారు.