బదిలీలకు వేళాయె!
ABN , Publish Date - May 17 , 2025 | 12:53 AM
ప్రభుత్వ యంత్రాంగంలో బదిలీల సందడి నెలకొంది. ఎట్టకేలకు శుక్రవారం నుంచి ఉద్యోగుల స్థానచలనాలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అన్ని శాఖల్లో వచ్చేనెల 2వతేదీలోపు ఆ ప్రక్రియను పూర్తిచేయాలని మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు గ్రీన్‌సిగ్నల్
అన్నిశాఖల్లో మార్పులకు శ్రీకారం
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ప్రక్రియ
వచ్చేనెల 2వతేదీ వరకు అవకాశం
ఆతర్వాత మళ్లీ నిషేధం
ప్రభుత్వ యంత్రాంగంలో బదిలీల సందడి నెలకొంది. ఎట్టకేలకు శుక్రవారం నుంచి ఉద్యోగుల స్థానచలనాలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అన్ని శాఖల్లో వచ్చేనెల 2వతేదీలోపు ఆ ప్రక్రియను పూర్తిచేయాలని మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది కొన్ని శాఖల్లో మాత్రమే ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించింది. ఈసారి అన్ని శాఖల్లోని వారిని మార్పు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.
ఒంగోలు కలెక్టరేట్, మే 16 (ఆంధ్రజ్యోతి) :ఎట్టకేలకు ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్నిశాఖల్లో అత్యవసరమైన ఉద్యోగులను మాత్రమే మార్చగా.. వైద్యారోగ్యం, ఇరిగేషన్ లాంటి శాఖల్లో బదిలీలు జరగలేదు. ప్రస్తుతం ఆశాఖల్లో భారీగా ఉద్యోగుల బదిలీలు కొనసాగనున్నాయి. అలా అన్ని శాఖల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ బదిలీలు చేసే విధంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025 మే 31 నాటికి ఒకేస్థానంలో ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులను తప్పనిస రిగా మార్చాల్సి ఉంది. ఐదేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులు కూడా బది లీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వారి విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకొని పరిపాలనా సౌలభ్యం మేరకు మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
అనారోగ్యంతో బాధపడే ఆరికి ప్రాధాన్యం
ప్రస్తుత బదిలీల్లో అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు, మానసిక దివ్యాంగ పిల్లలు ఉండి వైద్యవసతి కలిగిన ప్రదేశాలకు వెళ్లే వారికి బదిలీల్లో ప్రాధాన్యం కల్పించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు, 40శాతంపైగా అంగవైకల్యం కలిగిన వారు, దీర్ఘకాలిక వ్యాధులైన కేన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రయారిటీ ఇవ్వనున్నారు. దివ్యాంగ ఉద్యోగులు కోరుకుంటే తప్ప వారిని బదిలీ చేయరాదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ తరహా ఉద్యోగులను వారు కోరిన చోట ఖాళీలను బట్టి బదిలీ చేసేలా వెసులుబాటును కల్పించారు. భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరినీ ఒకేచోట ఉంచేందుకు.. వీలు కాకపోతే పక్కపక్క ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని సూచించింది. ఉద్యోగోన్నతి పొందిన వారిని కచ్ఛితంగా బదిలీచేయాలని, ఆ పోస్టు ఇతర ప్రాంతాల్లో లేకపోతే అదేస్థానంలో కొనసాగించవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఐటీడీఏ పరిధిలో లోకల్ కేడర్, జోనల్ కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే వారు కోరుకున్న చోటకు బదిలీ చేయనున్నారు. ఐటీడీఏ ప్రాంతానికి బదిలీ కోరుకునే వారు 50ఏళ్ల లోపు వారై ఉండాలని, గతంలో ఐటీడీఏ ప్రాంతంలో పనిచేసిన వారిని ఈ బదిలీలకు పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా బదిలీలు
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఆయా శాఖల్లో ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగుల బదిలీలను ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకొని చేపడతారు. ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా సకాలంలో సంబంధిత శాఖలు ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. బదిలీల్లో ఏవైనా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే ఆయా శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రకటించింది. గుర్తింపు పొందిన రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయి ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్న వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు టర్మ్‌లు కానీ, తొమ్మిదేళ్ల సర్వీసు కానీ ఒకేచోట పూర్తిచేసి ఉంటే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. తాలూకా, జిల్లాస్థాయి గుర్తింపుపొందిన ఉద్యోగుల అసోసియేషన్ ఆఫీసర్ బేరర్స్ జాబితాను కలెక్టర్ ద్వారా ఆయాశాఖల అధికారులకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలు నిర్వహించరాదని పేర్కొంది. వచ్చేనెల 3నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుందని ఆలోపు ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేసింది.