తగ్గేదే లే..!
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:27 AM
ఈ ఏడాది కూడా పొగాకు పంట భారీగా సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నారు ధర కొండెక్కి కూర్చున్నా, ట్యాంకర్లతో నీటిని అధిక వ్యయంతో తరలించాల్సి వచ్చినా రైతులు లెక్కచేయడం లేదు. ఒకవైపు తుఫాన్‌తో దెబ్బతిన్న తోటలలో విడుపులు, మరోవైపు కొత్త విస్తీర్ణంలో ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు.
భారీగా పొగాకు సాగు
వెనక్కితగ్గమంటున్న రైతులు
దక్షిణాదిలో ఇప్పటికే 40,500 హెక్టార్లలో సాగు
ఇంకా అంతకుపైనే అవకాశం
బోర్డు అధికారుల సూచనలు బేఖాతర్
ప్రస్తుత మార్కెట్లో ధరలు తగ్గినా సాగువైపే మొగ్గు
శనగ ఆశాజనకంగా లేకపోవడం, వాతావరణ సానుకూలతలే కారణం
ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా నాట్లు, విడుపులు
ఈ ఏడాది కూడా పొగాకు పంట భారీగా సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నారు ధర కొండెక్కి కూర్చున్నా, ట్యాంకర్లతో నీటిని అధిక వ్యయంతో తరలించాల్సి వచ్చినా రైతులు లెక్కచేయడం లేదు. ఒకవైపు తుఫాన్‌తో దెబ్బతిన్న తోటలలో విడుపులు, మరోవైపు కొత్త విస్తీర్ణంలో ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటికే 41 వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో పొగాకు సాగైంది. ప్రస్తుతం స్పీడ్ చూస్తుంటే ఇంకా అంత విస్తీర్ణంలో సాగయ్యే పరిస్థితులు ఉన్నాయి. పంట ఉత్పత్తి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చిన దాని కన్నా భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నియంత్రణ కోసం అధికారులు ఈసారి నారుమడులు పెట్టే స్థాయి నుంచే ఒత్తిడి పెంచారు. గత సీజన్ మార్కెట్ ఒడిదొడుకులతో అత్యధిక శాతం మంది రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. అయినప్పటికీ ఈసారి విస్తారంగా సాగు చేస్తున్నారు. వ్యయప్రయాసలను లెక్కచేయకుండా మొక్కలు నాటుతున్నారు.
ఒంగోలు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలో ఈసారీ పొగాకు సాగు పెరుగుతోంది. గడిచిన సీజన్ మార్కెట్ ఒడిదొడుకుల్లో నడిచినా రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మూడేళ్ల క్రితం పంట ఉత్పత్తి కొంత అదుపులో ఉండగా 2022-23 నుంచి 2024-25 వరకు మూడేళ్లలో భారీగా పెరిగింది. ప్రత్యేకించి 2024-25 సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో సాగైంది. దక్షిణాది ప్రాంతంగా పిలిచే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 11 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. 2022-23 సీజన్‌కు ఈ ప్రాంతంలో సుమారు 87.97 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అను మతివ్వగా 123.11 మిలియన్ కిలోల విక్రయాలు జరిగాయి. సగటున కిలోకు రూ.216.28 ధర లభించింది. అదే 2023-24 సీజన్‌కు 88.68 మిలియన్ కిలోల ఉత్ప త్తికి అనుమతిస్తే ఇంచుమించు 154.11 మిలియన్ కిలోలు పండింది. అయినా మా ర్కెట్ బాగా ఉండటంతో మంచి ధరలు లభించి సగటున కిలోకు రూ.265 దక్కింది. ముందు సీజన్‌లో మంచి రాబడులు రావడంతోపాటు 2024-25కు వాతావరణం అనుకూలంగా ఉండటంతో భారీగా సాగు చేశారు. బోర్డు ఆ సీజన్‌కు 104.60 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతిస్తే దాదాపు 88వేల హెక్టార్లలో పంటను సాగు చేసి ఇంచుమించు 157 మిలియన్ కిలోలు పండించారు. పొగాకు బోర్డు లెక్కల ప్రకారం పాతిక వేల హెక్టార్లలో అదనంగా సాగు చేసి సుమారు 53 మిలియన్ కిలోలు అధికంగా ఉత్పత్తి చేశారు. మొత్తం 11 వేలం కేంద్రాల్లో ఒక్క కొండపి మినహా మిగిలిన పది కేంద్రాల్లో వేలం పూర్తయింది. అక్కడ మరో నాలుగు రోజుల్లో ముగియనుండగా దాదాపు 156.30 మిలియన్ కిలోలు విక్రయాలు జరగ్గా సగటున కిలోకు రూ.223.14 ధర లభించింది. అంటే అధికంగా పంట సాగు, ఉత్పత్తి పెరిగిన ప్రభావం ధరలపై పడి 2023-24 సీజన్ కన్నా 2024-25 సీజన్ ధరలు గణనీయంగా తగ్గాయి. అలా తగ్గడం వల్ల దక్షిణాది రైతులు గతం కన్నా దాదాపు రూ.500 కోట్ల మేర రాబడిని కోల్పోయి ఆమేర నష్టపోయారు. అంతేకాక గతంలో ఎన్నడూలేని విధంగా వేలం ప్రక్రియ దాదాపు నెలల పాటు సుదీర్ఘంగా సాగింది. వేలం ప్రక్రియ సాగే క్రమంలోనూ మార్కెట్ అనేక ఒడిడొడుకులను ఎదుర్కొంది.
నియంత్రణ చర్యలు చేపట్టినా సరే..
రాబోయే సీజన్ (2025-26)లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే సంకేతాలు ప్రస్తుత కొనుగోళ్ల సీజన్‌లోనే కనిపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన పొగాకు బోర్డు 2025-26 సీజన్‌కు సాగు నియంత్రణపై తొలి నుంచే దృష్టి సారించింది. తొలుత పంట ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించింది. దక్షిణాదిలో 2024-25 సీజన్‌కు 104 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన పొగాకు బోర్డు 2024-26 సీజన్‌కు 90 మిలియన్ కిలోలకు తగ్గించింది. గతానికి భిన్నంగా ఈసారి నారుమడులు పెట్టే సమయం నుంచే నియంత్రణ చర్యలు చేపట్టింది. పొగాకు బోర్డు నుంచి అనుమతి పొంది సీటీఆర్‌ఐ నుంచి విత్తనాలు పొందిన వారే నారుమడులు పెట్టాలని షరతు విధించింది. అంతేకాకుండా అధికారులు తనిఖీలు చేసి నియంత్రించారు. అలాగే అధిక పంట సాగు వల్ల జరిగే అనర్థాలు, 2024-25 సీజన్ మార్కెట్ సంక్షోభానికి కారణాలు, రానున్న సీజన్‌లో ప్రతికూల పరిస్థితులు, అంతర్జాతీయంగా పెరిగిన పంట ఉత్పత్తిపై విస్తృతంగా రైతులలో ప్రచారం చేపట్టారు. ఇందుకోసం వేలం కేంద్రాల స్థాయిలో అలాగే అధికంగా పంట పండే గ్రామాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహించారు. బ్యారన్ రిజిస్ట్రేషన్ల విధానాన్ని కొంత కఠినతరం చేశారు. అయినా ప్రస్తుతం దక్షిణాదిలో పొగాకు పంట సాగు భారీగానే కనిపిస్తోంది.
భారీగానే పంట సాగు
గత సీజన్ ప్రతికూల మార్కెట్ పరిస్థితులతో నష్టాలు వచ్చినా, బోర్డు అధికా రులు హెచ్చరిస్తున్నా, పెట్టుబడులు భారీగా ఆయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నా చాలాగ్రామాల్లో రైతులు పంట సాగును భారీగానే చేపడుతున్నారు. రెండు నెలల క్రితం వరకు కాస్తంత వెనుకడుగులోనే ఉన్నట్లు కనిపించిన రైతులు తర్వాత మళ్లీ గత రెండేళ్ల వలే సాగుకు ఉపక్రమించారు. ప్రత్యామ్నాయంగా సాగు చేసే శనగ పంట పరిస్థితి బాగా లేకపోవడం, వాతావరణం పొగాకు సాగుకు అనుకూలంగా ఉండటం, అక్టోబరులో ఒక్కసారిగా పొగాకు గరిష్ఠ ధరలు కిలో రూ.350 దాటడం వంటివి తిరిగి రైతులను సాగుకు ప్రేరేపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాది తేలిక నేలల రీజియన్‌లో 27,139 హెక్టార్లు, నల్లరేగడి రీజియన్‌లో 13,367 హెక్టార్లు కలిపి 40,507 హెక్టార్లలో పొగాకు నాట్లు వేశారు.
జోరుగా నాట్లు
గత అక్టోబరులో సంభవించిన మొంథా తుఫాన్ ఒకరకంగా పంట సాగు సీజన్‌ను తలకిందులు చేసింది. అప్పటికే వేసిన పంట దెబ్బతినగా, తదుపరి సాగు ఆలస్యమైంది. అయినా 40వేల హెక్టార్లకుపైగా సాగు కాగా తుఫాన్ తీవ్రత, తాజా వర్షాల వాతావరణం నుంచి తేరుకొని ప్రస్తుతం తిరిగి రైతులు నాట్లను జోరుగా వేస్తున్నారు. పొగాకు అధికంగా పండే కొండపి, కందుకూరు, ఎస్‌ఎన్‌పాడు, మార్కాపురం, కనిగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఏ గ్రామంలో చూసినా పొగనాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ సీజన్‌లో కూడా 80 నుంచి 90వేల హెక్టార్లలో పంట సాగు జరిగి ఆమేర ఉత్పత్తి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై పొగాకు బోర్డు ఆర్‌ఎం రామారావు స్పందిస్తూ అధిక సాగు అనర్థం అన్నారు. బోర్డు అధికారుల సూచనలను రైతులు పాటించాలన్నారు. ధర లేక, అమ్ముడుపోక 2024-25లో తీవ్ర ఇక్కట్లు పడాల్సి వచ్చిన వాస్తవ పరిస్థితిని గుర్తించి సాగు తగ్గించాలని రైతులకు సూచించారు. లేకపోతే నష్టపోతారన్నారు.