టీచర్ల ప్రమోషన్‌లలో దొంగాట
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:49 AM
ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆరుగురు సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిబంధనలకు విరుద్ధంగా సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించారు. ఈ విషయమై ఒక టీచర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారుల దొంగాట బయటపడింది.
ఆరుగురికి అడ్డగోలుగా ఉద్యోగోన్నతులు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదులు
విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలతో రీ కౌన్సెలింగ్
నలుగురికి ఎస్‌జీటీలుగా రివర్షన్!
ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆరుగురు సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిబంధనలకు విరుద్ధంగా సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించారు. ఈ విషయమై ఒక టీచర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారుల దొంగాట బయటపడింది. ఆరుగురికి అక్రమంగా ఉద్యోగోన్నతులు ఇవ్వడం వల్ల తాను నష్టపోయానని ఆ టీచర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం, విద్యాశాఖ మంత్రి పేషీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్య డైరెక్టర్‌ను కూడా ప్రశ్నించారు. దీంతో ఆ ఆరు సోషల్ స్టడీస్ స్కూలు అసిస్టెంట్ పోస్టులకు రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని డైరెక్టర్ ఆదేశించడంతో అధికారులు ఆప్రక్రియను పూర్తి చేశారు. నలుగురు సీనియారిటీలో ఉద్యోగోన్నతుల పరిధిలోకి రాకపోవడంతో వారికి తిరిగి ఎస్‌జీటీలుగా రివర్షన్ ఇచ్చారు.
ఒంగోలు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఇటీవల నిర్వహించిన టీచర్ల బదిలీలకు ముందు సెకండరీ గ్రేడ్‌లకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ క్రమంలో 17 సోషల్ స్టడీస్ స్కూలు అసిస్టెంట్ పోస్టులకు ఒక్కోదానికి ముగ్గురు చొప్పున 51 మందిని కౌన్సెలింగ్‌కు పిలిచారు. వారిలో 11 మంది మాత్రమే సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తీసుకున్నారు. మిగిలిన వారు ముందుకు రాలేదు. దీంతో ఆరు పోస్టులు మిగిలిపోయాయి. నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు మళ్లీ ప్రమోషన్ కౌన్సెలింగ్ తేదీ ప్రకటించి సీనియారిటీ జాబితాలోని తదుపరి టీచర్లను ఆహ్వానించాల్సి ఉంది. అయితే ఆ నిబంధనలకు అధికారులు నీళ్లొదిలారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కనబెట్టి అందు బాటులో ఉన్న జాబితాలకు ఉద్యోగోన్నతులు కట్టబెట్టారు. మొదటి కౌన్సెలింగ్‌కు సీనియారిటీ జాబితాలోని 120వ నంబరు వరకు పిలవగా ఆ తర్వాత సీనియారిటీని విస్మరించి జాబితాలో ఎక్కడో 386 వరస నంబరు ఉన్న టీచర్‌కు కూడా ప్రమోషన్ కల్పించారు.
గుట్టుచప్పుడు కాకుండా రీ కౌన్సెలింగ్
అక్రమ ఉద్యోగోన్నతుల గుట్టు రట్టవడంతో పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశాల మేరకు గత మంగళవారం గోప్యంగా రీకౌన్సెలింగ్ నిర్వహించారు. ఎలాంటి పత్రికా ప్రకటన కూడా ఇవ్వకుండా డీఈవో కార్యాలయం నుంచి నేరుగా అభ్యర్థులకు ఫోన్లు చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. గతంలో అక్రమంగా ఉద్యోగోన్నతులు పొందిన ఆరుగురిని కూడా ఆహ్వానించారు. ఈ కౌన్సెలింగ్‌లో ప్రమోషన్ల జోన్‌లోకి గతంలో అక్రమంగా ఉద్యోగోన్నతి పొందిన వారు ఇద్దరు రాగా మిగిలిన నాలుగు పోస్టులు ఇతరులు కోరుకున్నారు. దీంతో పాతవారిలో నలుగురి ప్రమోషన్లను రద్దు చేశారు. వీరికి ఎస్‌జీటీలుగా రివర్షన్ ఇవ్వనున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఈ నలుగురికి ముందస్తు నోటీసులు జారీ చేశారు.