Share News

ముఖ హాజరులో అక్రమాలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:20 AM

ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే మెడికల్‌ అధికారులు ఐఫోన్‌ ద్వారా ముఖ హాజరును ట్యాంపరింగ్‌ చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. అలా చేస్తున్న వారిలో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిర్ధార ణకు వచ్చారు. వారందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ముఖ హాజరులో అక్రమాలు

వైద్య సిబ్బంది ట్యాంపరింగ్‌

ఐఫోన్‌లో తప్పుడు హాజరు.. గుర్తించిన ఉన్నతాధికారులు

వారిలో 14 మంది మెడికల్‌ ఆఫీసర్లు, ఇరువురు ఎంఆర్‌హెచ్‌పీఎస్‌లు

భారీగా ఉన్న సిబ్బంది

అందరికీ షోకాజ్‌ నోటీసులు

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే మెడికల్‌ అధికారులు ఐఫోన్‌ ద్వారా ముఖ హాజరును ట్యాంపరింగ్‌ చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. అలా చేస్తున్న వారిలో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిర్ధార ణకు వచ్చారు. వారందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు వైద్యశాలల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రాథమిక వైద్యశాలల్లో పనిచేసే వైద్యాధికారులు, ఇతర ఉద్యోగులకు ముఖ హాజరు తప్పనిసరి చేసింది. అందుకోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా ముఖ హాజరు వేస్తే సమయం, తేదీ, ఎక్కడ వేశారు అనేది నమోదవుతుంది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. అయితే ఎక్కువమంది మంది వైద్యాధికారులు, మెడికల్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది ఐఫోన్లను వినియోగిస్తున్నారు. ఆ ఫోన్ల ద్వారానే ముఖ హాజరు వేస్తున్నారు.

ఎన్నిగంటలకు వెళ్లినా..

కొందరు వైద్యాధికారులు, ఇతర సిబ్బంది వైద్యశాలలకు ఎన్ని గంటలకు వెళ్లినా వారి వద్ద ఉన్న ఐఫోన్‌లో సమయం ఏవిధంగా నమోదు చేసుకొని ఉంటారో ఆ విధంగానే ముఖ హాజరు తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక వైద్యాధికారి ఉదయం 9.30 గంటలకు వైద్యశాలకు వెళ్లాల్సి ఉంటే ఆయన ఉదయం 11 గంటలకు వెళ్లి ఐఫోన్‌ ద్వారా ముఖహాజరు వేస్తే అందులో ఉదయం 9.30 గంటలు ఉంటే అదేసమయంలో హాజరైనట్లు నమోదవుతుంది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖశాఖ ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. తదనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన చేసి ప్రస్తుతం ఆవిధంగా ట్యాంపరింగ్‌ చేసిన వైద్యాధికారులు 185 మంది, మరో 13వేల మంది వైద్య, పారామెడికల్‌ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. వారందరికి ఇప్పుడు రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు వారందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు.


ఉద్యోగుల్లో ఆందోళన

జిల్లాలో 13మంది మెడికల్‌ ఆఫీసర్లు, ఇద్దరు మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవిడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీఎస్‌లు) హాజరు ట్యాంపరింగ్‌ చేసిన వారిలో ఉన్నారు. ఇక వైద్యశాఖలో పనిచేసే సిబ్బంది కూ డా భారీగా ఉన్నట్లు సమాచారం. వారందరికీ షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. అర్ధవీడు, బేస్తవారపేట, ముండ్లమూరు, తూర్పుగంగవరం, పొన్నలూరు, వేములపాడు టంగుటూరు, కనిగిరి, ఎన్‌జీపాడు ప్రాథమిక వైద్యశాలల్లో పనిచేసే మెడికల్‌ ఆఫీసర్లకు ఇవి అందినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రస్థాయి లోనే ముఖ హాజరు నమోదు అక్రమాలను గుర్తించడంతో మెడికల్‌ ఆఫీసర్లు, ఇతర ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉన్నతాధికారులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Apr 17 , 2025 | 01:20 AM