బీఈడీ పరీక్షల్లో అక్రమాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:24 AM
అయ్యోర్ల పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల బలహీనతను బట్టి కళాశాల యాజమాన్యాలు ముక్కుపిండి మరీ దండుకుంటున్నాయి. జాతికి మార్గదర్శకంగా నిలవాల్సిన ఉపాధ్యాయ పరీక్షలలో కాబోయే టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కళాశాల నిర్వాహకులకు విద్యాశాఖ అధికారులు వంతపాడుతున్నారు.
డమ్మీ అభ్యర్థికి రూ.5వేలు
చూచిరాతకు రూ.1000
యథేచ్ఛగా వసూలు చేస్తున్న కాలేజీల యాజమాన్యాలు
జోరుగా కాపీయింగ్... కన్నెత్తిచూడని అధికారులు
పొదిలి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): అయ్యోర్ల పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల బలహీనతను బట్టి కళాశాల యాజమాన్యాలు ముక్కుపిండి మరీ దండుకుంటున్నాయి. జాతికి మార్గదర్శకంగా నిలవాల్సిన ఉపాధ్యాయ పరీక్షలలో కాబోయే టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కళాశాల నిర్వాహకులకు విద్యాశాఖ అధికారులు వంతపాడుతున్నారు. పొదిలిలో సోమవారం నుంచి ప్రారంభమైన బీఈడీ పరీక్షలు అవకతవకలకు కేరాఫ్‌గా మారాయి. పట్టణంలోని మూడు కళాశాలల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు చెందిన బీఈడీ విద్యార్థులు అధిక శాతం మంది ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. దీంతో వారి నుంచి చూచిరాతకు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెయ్యి ఇచ్చిన విద్యార్థి యథేచ్ఛగా చూసి రాసుకోవచ్చు. వారికి అవసరమైన స్లిప్పులను అందిస్తారు. ఒకవేళ ఆ విద్యార్థి పరీక్షకు రాలేకపోతే వారి తరఫున నకిలీ వ్యక్తి పరీక్ష రాసేందుకు రూ.5వేలను వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఆయా కళాశాలల్లో సైతం కేవలం ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రవేశం పొందడమే వారి విధి. ఆ తరువాత క్లాసులకు హాజరుకావాల్సిన పనేలేదు. కేవలం పరీక్షలకు హాజరైతే సరిపోతుందని యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు రూపంలో వసూలు చేస్తున్నాయి. తరగతులు నిర్వహించే పని లేకపోవడంతో ఆ కాలేజీలో బోధన సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జిల్లా నడికూడలిలో బీఈడీ పరీక్షలు అపహాస్యంగా మారగా విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఈ అక్రమాల్లో అధికారుల చేతివాటం కూడా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భావితరాలను ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఇలా తప్పుడు మార్గంలో పరీక్షలు రాయడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.