అక్రమాల డంప్
ABN , Publish Date - May 14 , 2025 | 01:16 AM
ప్రభుత్వ పరిధిలో ఉన్న వాగుపోరంబోకు భూములను దర్జాగా కబ్జా చేశారు. పైసా చెల్లించకుండా అప్పనంగా గ్రానైట్ డంపులకు ఉపయోగించుకుంటున్నారు. ఏన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం ఎట్టకేలకు రట్టయ్యింది.
చీమకుర్తిలో వాగు పోరంబోకు భూములు దర్జాగా కబ్జా
సర్వేలో వెలుగుచూసిన 150 ఎకరాలు
దాదాపు 90 ఎకరాలు ఆక్రమించి గ్రానైట్ వ్యర్థాల పారబోత
మిగతా కొన్ని భూములకు ఎన్‌వోసీలు
బహిర్గతమవుతున్న అధికారుల అవినీతి బాగోతం
ఆ భూముల్లో గుర్తించిన రాళ్లు మావి కావంటూ తప్పించుకుంటున్న యజమానులు
ఉన్నతాధికారులకు నివేదించనున్న తహసీల్దార్
ప్రభుత్వ పరిధిలో ఉన్న వాగుపోరంబోకు భూములను దర్జాగా కబ్జా చేశారు. పైసా చెల్లించకుండా అప్పనంగా గ్రానైట్ డంపులకు ఉపయోగించుకుంటున్నారు. ఏన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం ఎట్టకేలకు రట్టయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణదారులకు వాగు భూముల్లో ఎన్‌వోసీలు ఇచ్చిన రెవెన్యూ అధికారుల అవినీతి కంపు సైతం బయటపడింది. ఈ కబ్జా బాగోతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ విస్తరించిన చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం పంచాయతీల పరిధిలో చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం ఈ ఆక్రమణల పర్వాన్ని నిగ్గుతేల్చాలని ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె విచారణకు ఆదేశించడంతో నిజమేనని తేలింది.
చీమకుర్తి, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌కు నెలవైన చీమకుర్తి ప్రాంతంలో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వాటిలో వ్యర్థాలను పారబోస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డంప్‌లను, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలను ఎగ్గొడుతున్నారు. ఇటీవల చిరంజీవి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ స్పందించారు. రెవెన్యూ, మైన్స్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి వాగుపోరం బోకు భూముల్లో ఏమేరకు ఆక్రమణలు చోటుచేసుకున్నాయే నిగ్గుతేల్చాలని ఆదేశించారు. ఈమేరకు ఇటీవల రెవెన్యూ అధికారులు గ్రానైట్ పరిశ్రమ విస్తరించిన ఆర్‌ఎల్‌పురం, చీమకుర్తి పరిధిలోని వాగు పోరంబోకు భూముల్లో సర్వే నిర్వహించారు. ఇంకా బూదవాడ పంచాయతీ పరిధిలో సర్వే నిర్వహించాల్సి ఉంది.
అక్రమంగా ఎన్‌వోసీలు
చీమకుర్తి, ఆర్‌ఎల్ పురం పరిధిలో నిర్వ హించిన సర్వేలో రెవెన్యూ అధికారులు సైతం విస్తుపోయే విధంగా ఆక్రమణలు, ఎన్‌వోసీల మంజూరు బహిర్గతమైంది. దాదాపు 150 ఎకరాల వాగు పోరంబోకు భూములు అన్యాక్రాంతమైనట్లు సర్వేలో తేలింది. గ్రానైట్ క్వారీల యజమానుల్లో కొంతమంది సింహభాగం ఆక్రమించుకొని డంపులు, ఇతర క్వారీ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నట్లు బయటపడింది. మిగతా భూముల్లో కొంతమేర ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని పట్టాలను సైతం పొందారు. ఇంకా డొంక పోరంబోకు, ఇతర ప్రభుత్వ భూముల్లో సైతం సర్వే నిర్వహిస్తే మరిన్ని ఆక్రమణలు వెలుగుచూసే అవకాశం ఉంది.
ఆక్రమణల పర్వం ఇలా...
రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో వాగుపోరంబోకు భూములను ఆక్రమించుకొని గ్రానైట్ డంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. సర్వే నంబర్ 162లో 28.87 ఎకరాలు, 163లో 15.93 ఎకరాలు, 130లో 22 ఎకరాలు, 146లో 11.24 ఎకరాలు, 103లో 3.16 ఎకరాలు మేరకు ఆక్రమించుకొని డంపులు నిర్వహిస్తున్నట్లు సర్వేలో గుర్తించారు. వారు ఎవరు అనేది తేల్చలేక అధికారులు సతమతమవుతున్నారు. డంపులు ఎవరివి అని క్వారీ యజమానులను సంప్రదించగా ఎవరికి వారు మావి కాదని తప్పించుకోవాలని చూస్తుండటంతో రెవెన్యూ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. మావి అని చెబితే భారీ పెనాల్టీలు కట్టాల్సి వస్తుందేమో అని యజమానులు తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆక్రమణదారుల లెక్కతేల్చే బాధ్యత మైనింగ్ అధికారులకు రెవెన్యూ అధికారులు అప్పజెబుతున్నారు. వీరు రంగంలోకి దిగితే కబ్జాదారుల బాగోతం బయటపడే అవకాశం ఉంది. డంపులకు ఎన్‌వోసీలు ఇచ్చిన అధికారుల అవినీతి వ్యవహారం కూడా వెలుగులోకి రావడం ఖాయం. అప్పుడు ఆక్రమణదారుల నుంచి భారీగా రికవరీ చేసే అవకాశం ఉంటుంది. ఈ కబ్జా బాగోతాన్ని సవివరంగా జిల్లా ఉన్నతాధికారులకు రెవెన్యూ అధికారులు నివేదించనున్నారు. ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది