కానరాని వంతెనలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 10:09 PM
పశ్చిమ ప్రకాశంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఆశించిన మేర వర్షాలు కురవకున్నా ఆయా గ్రామాల పరిధిలో ఉన్న నల్లమల అడవుల్లో కురిసే మోస్తరు వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి.
పశ్చిమ ప్రకాశంలో వరదొస్తే తప్పని ఇక్కట్లు
కంభం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రకాశంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఆశించిన మేర వర్షాలు కురవకున్నా ఆయా గ్రామాల పరిధిలో ఉన్న నల్లమల అడవుల్లో కురిసే మోస్తరు వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల పరిధిలోని అర్ధవీడు, కంభం, రాచర్ల, గిద్దలూరు, పెద్దారవీడు, పెద్ద దోర్నాల, మార్కాపురం, రావిపాడు, తర్లుపాడు, తదితర మండలాల్లోని జంపలేరు, గుండ్లకమ్మ, సగిలేరు, నల్లవాగులు ప్రవహిస్తున్నాయి. ఈ వాగులకు వరద నీరు పోటెత్తినప్పుడు ఆయా మండలాల్లోని అనేక కల్వర్టులు, నేల చప్టాలు నీట మునిగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వరద వచ్చినప్పుడు సంబంధిత అధికారులు హడావుడిగా ప్రతిపాదనలు తయారు చేయడం, ఆ తరువాత పక్కన పెట్టేయడం జరుగుతుంది. వరదల తాకిడికి దెబ్బతిన్న వంతెనలకు కనీస మరమ్మతులు కూడా చేయడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా అర్ధవీడు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో కల్వర్టుపై నుంచి ప్రవహించే నీరు జంపలేరు వాగు వలన గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆ ప్రాంతంలోని మూడు గ్రామాల విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజలు వంతెన దాటి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే మండలంలోని బొల్లుపల్లి, అచ్చంపేట గ్రామ ప్రజలది మరో దయనీయమైన పరిస్థితి. ఒఝ్కోసారి ఈ వంతెన పైనుంచి ప్రవహించే వరద ప్రవాహం రెండు రోజుల వరకు తగ్గదు. ఆ గ్రామస్థులకు మరో ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఏ అవసరం వచ్చినా వంతెన వద్ద ప్రవాహం తగ్గేవరకు వేచి ఉండాల్సిందే. కల్వర్టుల ఎత్తు పెంచాలన్నది ప్రతిపాదనలకే పరిమితమవుతున్నదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనైనా మా బాధలు తీరుతాయేమోనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.