‘మహిళా మార్ట్ మూత’పై విచారణ
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:17 AM
పట్టణ పొదుపు సంఘాల భాగస్వామ్యంతో ఒంగోలులో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ మూసివేతపై మెప్మా అధికారులు స్పందించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ‘మహిళా మార్ట్ మూత’ కథనంపై పీడీ శ్రీహరి విచారణకు ఆదేశించారు.
లెక్కలు తేల్చి రికవరీ దిశగా చర్యలు
బాధ్యుల్లో మొదలైన కలవరం
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పొదుపు సంఘాల భాగస్వామ్యంతో ఒంగోలులో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ మూసివేతపై మెప్మా అధికారులు స్పందించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ‘మహిళా మార్ట్ మూత’ కథనంపై పీడీ శ్రీహరి విచారణకు ఆదేశించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్ట్‌లో జరిగిన క్రయ, విక్రయాలు, వ్యయం తదిర అంశాలతోపాటు, స్టాక్ రిజిస్టర్‌లు అందజేయాలని ఆయన సంబంధిత ఉద్యోగులకు సూచించినట్లు సమాచారం.మార్ట్ నిధులు కాజేసిన వారిలో మార్కెటింగ్ అధికారి, ప్రస్తుత సీఎంఎం-2 తమకేమీ తెలియదని బుకాయిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనపైనా విచారణకు సిదమైనట్లు సమాచారం. ముందస్తుగా నోటీసులు జారీచేసి వివరణ కోరనున్నారు. ఆ తర్వాత పొదుపు సంఘాలు చెల్లించిన రూ.1,500, సరుకుల కొనుగోలు బిల్లులు, రోజువారీ కలెక్షన్ తదితర అంశాలపైనా దృష్టి సారించారు. అయితే అధికారులకు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకుమార్ట్‌లో భారీగానే గోల్‌మాల్ జరిగినట్లు అంచనాకు వచ్చారు. ఇందులో భాగస్వాములైన వారిని గుర్తించడం కోసం విచారణ కమిటీని నియమించడంతోపాటు వారి నుంచి దోచుకున్న సొమ్మును రికవరీ చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. మొత్తంగా మార్ట్‌లో లెక్కలన్నీ తేల్చి బాధ్యులపైచర్యలు తీసుకునేందుకు మెప్మా అధికారులు సిద్ధమయ్యారు. దీంతో నిధులు సొంతానికి కాజేసిన కొందరు ఉద్యోగుల్లో భయం నెలకొంది.