ఉద్యోగోన్నతులపై విచారణ
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:15 AM
జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు గ్రేడ్-3 ఉద్యోగోన్నతులపై ఫిర్యాదులు రావడంతో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నాలుగు నెలల క్రితం సుమారు 200 మందికిపైగా ఏఎన్‌ఎంలకు ఉద్యోగోన్నతి కల్పించారు.
వైద్యశాఖలో రికార్డులను పరిశీలించిన జేడీ ఆధ్వర్యంలోని బృందం
ఏఎన్‌ఎంలు, ఫిర్యాదుదారుడు హాజరు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు గ్రేడ్-3 ఉద్యోగోన్నతులపై ఫిర్యాదులు రావడంతో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నాలుగు నెలల క్రితం సుమారు 200 మందికిపైగా ఏఎన్‌ఎంలకు ఉద్యోగోన్నతి కల్పించారు. అందులో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా చెన్నయ్య ఇటీవల వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ నాయక్ నేతృత్వంలోని బృందం విచారణ నిర్వహించింది. పలువురు ఏఎన్‌ఎంలను పిలిచి విచారించింది. ఫిర్యాదుదారుడైన చెన్నయ్యతో కూడా మాట్లాడింది. అంతకు ముందు ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితా, ఇతర రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా పలు అనుమానాలకు వైద్యశాఖ అధికారులు నివృత్తి చేసినట్లు సమాచారం. ఫిర్యాదుదారుడు మాత్రం ఏడుగురికి కల్పించిన ఉద్యోగోన్నతుల్లో పలు అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించినట్లు తెలిసింది.