Share News

‘ఆటల్లో అవినీతి’పై విచారణ?

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:45 AM

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిధుల వినియోగంలో అవినీతికి పాల్పడిన వారిలో కలవరం మొదలైంది. నిధుల దుర్వినియోగంపై డీఈవో కిరణ్‌కుమార్‌ స్పందించారు. విచారణకు సిద్ధమయ్యారు. ఏజీఎఫ్‌ నిధుల వినియోగంలో సెక్రటరీ చేతివాటంపై శనివారం ఆంధ్రజ్యోతిలో ‘ఆటల్లో అవినీతి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే.

‘ఆటల్లో అవినీతి’పై విచారణ?

ఎస్‌జీఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై డీఈవో కిరణ్‌కుమార్‌ సీరియస్‌

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిధుల వినియోగంలో అవినీతికి పాల్పడిన వారిలో కలవరం మొదలైంది. నిధుల దుర్వినియోగంపై డీఈవో కిరణ్‌కుమార్‌ స్పందించారు. విచారణకు సిద్ధమయ్యారు. ఏజీఎఫ్‌ నిధుల వినియోగంలో సెక్రటరీ చేతివాటంపై శనివారం ఆంధ్రజ్యోతిలో ‘ఆటల్లో అవినీతి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై కలెక్టర్‌ కార్యాలయం నుంచి డీఈవోను వివరణ కోరారు. దీంతో ఎస్‌జీఎఫ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, అలాగే సెక్రటరీపై వచ్చిన ఆరోపణలపై ఆయన సీరియస్‌ అయినట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రీడాపోటీలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు క్రీడాకారులకే వినియోగించగా జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు విచారణకు సిద్ధమయ్యారు. గత ఏడాదిలో నిర్వహించిన క్రీడాపోటీలకు మంజూరైన నిధులు, వాటి వినియోగంపై లెక్కలు తేల్చనున్నారు. సెక్రటరీ బ్యాంకు ఖాతాల పరిశీలనతోపాటు కోఆర్డినేటర్‌లను, పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను విచారించనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా నిధుల దుర్వినియోగంలో చేతివాటం చూపిన ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ తనపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. మండల కోఆర్డినేటర్‌లతో ఫోన్‌లో మాట్లాడటంతోపాటు క్రీడాపోటీలకు నిధులు ఖర్చుచేసినట్లు బిల్లులు తయారుచేసే పనిలో ఉన్నట్లుగా తెలిసింది.

Updated Date - Aug 10 , 2025 | 01:45 AM