పాల కేంద్రాల్లో తనిఖీలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:12 AM
దర్శి ప్రాంతంలోని పాల కేంద్రాల్లో ఆహార భద్రత అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. గురువారం ‘పాల కూట విషం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి వారు స్పందించారు. మండలంలోని చలివేంద్ర గ్రామంలోని డెయిరీ ఫాంలో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఆహార భద్రతా అధికారి శివకృష్ణ సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు.
చలివేంద్రలో కల్తీ పాల శాంపిల్స్ తీసిన ఆహార భద్రతా అధికారులు
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
దర్శి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దర్శి ప్రాంతంలోని పాల కేంద్రాల్లో ఆహార భద్రత అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. గురువారం ‘పాల కూట విషం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి వారు స్పందించారు. మండలంలోని చలివేంద్ర గ్రామంలోని డెయిరీ ఫాంలో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఆహార భద్రతా అధికారి శివకృష్ణ సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. పాల సాంపిళ్లను సేకరించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ దర్శి ప్రాంతంలో పలుచోట్ల కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అందులో భాగంగా చలివేంద్రలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఇక్కడి పాలకేంద్రంలో పాల కల్తీ కోసం వాడిన ఆయిల్ ప్యాకెట్లు, పాలు మిక్సింగ్ చేసేందుకు వాడే జార్లు పట్టుబడ్డాయన్నారు. పాల సాంపిళ్లను సేకరించి వాటిని ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు చెప్పారు. నివేదిక రాగానే బాధ్యులపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సీజ్ చేసిన మెటీరియల్‌ను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచుతామని, తాము తయారు చేసిన నివేదికను సమర్పిస్తామన్నారు. కల్తీ పాల నివారణకు ముమ్మర తనిఖీలు చేపట్టి కల్తీరాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని శివకృష్ణ హెచ్చరించారు. ఎక్కడైనా పాలు కల్తీ జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.