Share News

పురుగుల ఉధృతి.. తెగుళ్ల దాడి

ABN , Publish Date - Dec 03 , 2025 | 02:40 AM

జిల్లాకు దిత్వా తుఫాన్‌ ముప్పు తప్పినప్పటికీ దానివల్ల నెలకొన్న మంగు వాతావరణం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగు రోజులుగా చిరుజల్లులు, చలిగాలులతో కూడిన తేమ వాతావరణం కొనసాగుతోంది. దీంతో పైర్లపై తెగుళ్ల దాడి, పురుగుల ఉధృతి అధికమైంది.

పురుగుల ఉధృతి.. తెగుళ్ల దాడి
ఎర్రగొండపాలెం వద్ద నల్లి తెగులు కారణంగా గిడసబారిన మొక్కలు

దిత్వా తుఫాన్‌ ముప్పుతప్పినా కొనసాగుతున్న మంగు వాతావరణం

పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతుల ఆందోళన

ఒంగోలు, డిసెబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు దిత్వా తుఫాన్‌ ముప్పు తప్పినప్పటికీ దానివల్ల నెలకొన్న మంగు వాతావరణం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగు రోజులుగా చిరుజల్లులు, చలిగాలులతో కూడిన తేమ వాతావరణం కొనసాగుతోంది. దీంతో పైర్లపై తెగుళ్ల దాడి, పురుగుల ఉధృతి అధికమైంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. నువ్వు, సజ్జ, పెసర వంటివి కోతలు పూర్తయ్యాయి. ఇంచుమించు 90శాతం విస్తీర్ణంలో పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో కంది, వరి, మొక్కజొన్న, మిర్చి పత్తి ప్రధానమైనవి. వాటితోపాటు ఇతర అన్ని రకాల పంటలు పూత, పిందె, కాయ, కోత దశకు చేరుకున్నాయి. మరో నెలరోజుల్లో అధిక శాతం పంటలు చేతికొస్తాయి. అలా ప్రస్తుతం పైర్లకు అత్యంత కీలకం కాగా ఈ సమయంలో నెలకొన్న మంగు వాతావరణం వాటిని దెబ్బతీస్తోంది.

వాతావరణంలో మార్పు

జిల్లాలో సాధారణంగా ఈ సమయంలో వర్షాలు పెద్దగా ఉండవు. పగటిపూట ఒక స్థాయి ఎండలు, రాత్రివేళ చలి, తెల్లవారుజామున కొంతమేర మంచు ఉంటుంది. అలా మిశ్రమ వాతావరణం పంటలకు లాభిస్తుంది. అయితే దిత్వా తుఫాన్‌ కారణంగా వారం రోజులుగా ఎండ అన్నది కనిపించడం లేదు. పగటిపూట కూడా చల్లటి వాతావరణం నెలకొంది. ఆపై చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో పంటలపై తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగింది. ఆయా ప్రాంతాల్లో పరిశీలిస్తే.. పంటలు విస్తారంగా సాగైన దర్శి ప్రాంతంలో కంది పూతదశలో ఉండగా మచ్చల పురుగు పెరిగింది. వరిలో కాండం, పొట్ట తెగుళ్లు ఉధృతంగా కనిపిస్తుండగా పంట దిగుబడులను దెబ్బతీసే అవకాశం ఉంది. వైపాలెం నియోజకవర్గంలో మిర్చి అధికంగా సాగు చేయగా నల్లపురుగు ఉధృతంగా ఆశిస్తోంది. మిర్చి ఆకులు ముడుచుకుపోయి ఎండిపోతున్నాయి. గతంలో నల్లపురుగుతో మిర్చి పంట తుడిచిపెట్టుకుపోగా ప్రస్తుత పరిస్థితితో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అనువైన వాతావరణం లేదు

వరిపైరు కోతదశకు రాగా తుఫాన్‌ కారణం గా వర్షం పడితే భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు కలవరపడ్డారు. ప్రస్తుతం ఆ పరిస్థితి తప్పినా కోతలకు అనువైన వాతావరణం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో విస్తారంగా బొప్పాయి సాగులో ఉండగా దాదాపు 40శాతం తోటలు మంగు వాతావరణంతో ఆకు ముడత, కుళ్లు తెగుళ్లతో దెబ్బతిన్నాయి. కనిగిరి ప్రాంతంలోనూ మిర్చి పంటపై ఆకు ముడత, నల్లపురుగు కనిపిస్తోంది. కంది, మినుము పంటలు కూడా తెగుళ్ల బారిన పడ్డాయి. ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో పత్తికి కాయకుళ్లు తెగులు ఆశిస్తోంది. మొక్కజొన్న, శనగ, వరి, పొగాకు తదితర అన్ని పంటలపైనా తామరపురుగు, లద్దెపురుగు, అలాగే ఆకు ముడత, ఎండ తెగులు వంటివి ఉధృతంగా సోకి పంటలను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - Dec 03 , 2025 | 02:40 AM